విజయదశమి ఎందుకు చేసుకుంటారు?


 విజయదశమిః-

భారతదేశంలో అత్యంత వైభవంగా చాలా ఘనంగా జరుపుకునే పండుగలలో దసరా ఒకటి. దసరా వస్తుందంటే చాలు అందరూ ఎంతో ఆనందంతో చేసుకుంటారు. ఈ పండుగనే నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ప్రారంభంలో వచ్చిన పండుగ కాబట్టి ఆ పేరు వచ్చింది. ఆశ్వీయుజ మాసం శుక్ల పక్షం విదియ మొదలు నవమి వరకు తొమ్మిది రోజులు నవరాత్రులుగా పూజాకార్యక్రమాలు చేసుకుని. పదవ రోజు చెడుపై మంచి విజయం సాధించినట్టుగా విజయ దశమి చేసుకుని అమ్మవారిని ఆరాధిస్తారు. దసరా అంటే అటు పిల్లలకు ఇటు పెద్దలకు ఎంతో ఆనందం. అమ్మవారిని తొమ్మిది రూపాలలో తొమ్మిది రోజులు నవరాత్రుల పేరుతో జరుపుకునే పండుగ. 


అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా బె

ద్దమ్మ సురారులమ్మ కడుపారడి వుచ్చిన యమ్మ తన్నులో

నమ్మిన వేల్పుటంబున మనమ్మున యుండెడి యమ్మ దుర్గ మా

యమ్మ కృపాబ్థి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్


ముగ్గురమ్మ లకి మూలం అయిన దుర్గాదేవి మొదటి మూడు రోజులు పార్వతీదేవిగా, తరువాత మూడురోజులు లక్ష్మీదేవిగా, ఆఖరి మూడురోజులు సరస్వతీ దేవిగా అందరికీ దర్శనం ఇస్తుంది. 


ప్రధమం శైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి

తృతీయం చంధ్రఘంటేతి, కూష్మాండేతి చతుర్దామ్ ||

పంచమం స్కంధమాతేతి, షష్ఠమం కాత్యాయనీ తిచ

సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం

నవమం సిద్దితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత. 


మొదటి రోజు శైలపుత్రీ, రెండవరోజు బ్రహ్మచారిణి, మూడవరోజు ఛంద్రఘంట, నాల్గవరోజు కూష్మాండ, ఐదవరోజు స్కంధమాత, ఆరవరోజు కాత్యాయని, ఏడవరోజు కాళరాత్రి, ఎనిమిదవరోజు మహాగౌరి, తొమ్మిదవరోజు సిద్ధిధాత్రి  గా తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలతో అమ్మవారిని అలంకరించి పదవ రోజు రాజరాజేశ్వరీదేవిగా అమ్మవారికి పూజాకార్యక్రమాలు చేస్తారు.  వర్షఋతువు వెళ్ళిపోయి, శరదృతువు ప్రారంభం అవుతుంది. వర్షాకాలం వచ్చేసరికి ఎక్కువగా రోగాలు బారిన పడతారు. అందులో నుండి ఉపశమనం పొంది అమ్మవారి ఆశీస్సులతో సంతోషంగా, ఆనందంగా, సుఖంగా జీవించడానికి శరన్నవరాత్రులు జరుపుకుంటారు. మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మకోసం వేలసంవత్సరాలు తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటే చావు లేని వరం కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ చావు, పుట్టుకలు అందరికీ సమానమే అది సృష్టి ధర్మం నీ కోరిక తీర్చడం జరగదు అని చెప్తే మహిషాసురుడు అలా అయితే ఏ పురుషుడి వల్లా నాకు చావు లేని వరాన్ని ఇమ్మని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు తధాస్తు అని చెప్పి అంతర్దానమైపోతారు. ఆ వర గర్వంతో మహిషాసురుడు దేవతలపై యుద్ధం ప్రకటించి వారిని ఓడించి స్వర్గాన్ని తన కైవసం చేసుకుని ఇంద్ర పదవిని తీసుకుంటాడు. అప్పుడు దేవతలందరూ త్రిమూర్తులకు వారి బాధలను మొరపెట్టుకుంటారు. అప్పుడు ఆ త్రిమూర్తులు వారి తేజస్సుతో ఒక స్త్రీరూపాన్ని సృష్టిస్తారు. శివుని తేజస్సు ముఖముగా, విష్ణువు తేజస్సు చేతులుగా, బ్రహ్మతేజస్సు పాదములుగా కలిగి మంగళకరమైన అమ్మవారు 18 చేతులతో ఆవిర్భవిస్తుంది. శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చి మహిషాసురునిపై యుద్ధం చేయమని వేడుకుంటారు. అమ్మవారు మహిషాసురుడు, వాడి సైన్యంతో  9 రాత్రులు యుద్ధము చేస్తుంది. మహిషాసురుడు సింహరూపముతో, మానవరూపముతో, మహిషిరూపముతో భీకరముగా యుద్ధం చేస్తుంటాడు. చివరికి అమ్మవారు 10 వరోజు మహిషిరూపంలో ఉన్న వాడిని వధించి జయాన్ని పొందుతుంది. కనుకనే 10 వరోజు ప్రజలంతా సంతోషంతో విజయదశమి చేసుకుంటారు. ఈ అమ్మవారినే రాజరజేశ్వరీ దేవిగా కూడా పూజిస్తారు. చరిత్ర ప్రకారం  రాముడు రావణుని పై గెలిచిన రోజు. అలాగే పాండవులు వనవాసం పూర్తిచేసుకుని వెళ్తూ జమ్మి చెట్టుపై దాచిన తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు.

కొత్తది పాతది