శివపార్వతులకే విఘ్నం కలిగింది

త్రిపురాసుర సంహారం చేస్తున్న శివుడు
తారకాసురున్ని కుమారస్వామి చంపినందుకు దేవతలపై పగబట్టి తారకాసురుడి కుమారులైన విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనే ముగ్గురు రాక్షసులు బ్రహ్మకోసం ఘోరమైన తపస్సు చేసారు.  బ్రహ్మవారి తపస్సుకు మెచ్చి వరం కోరుకొమ్మంటే వారు బంగారం, వెండి, రాగితో చేసిన మూడు నగరాలు నిర్మించి ఇమ్మని, అవి అంతరిక్షంలో తిరుగుతూ వేయిసంవత్సరాలకి ఒకసారి కలుసుకుంటూ ఉండేటట్టు, అలా కలుసుకున్న సమయంలో ఒకే బాణంతో ఎవరు మూడింటిని ఒక్కసారి ధ్వంసం చేయగలరో వారివల్ల మాత్రమే మరణం కలిగేటట్టు వరం పొందారు. బ్రహ్మ ఆజ్ఞపై దేవశిల్పి విశ్వకర్మ కొడుకు అయిన మయున్నివారికి నగరాలు ఒక్కొక్కటీ యోజనం విస్తీర్ణం ఉండేలా నిర్మించి ఇచ్చాడు.
ఆ వర గర్వంతో త్రిపురాసురులు దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడించారు. దేవతలు వారి కష్టాలను చెప్పుకోవడానికి బ్రహ్మమహేశ్వరుల దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. విష్ణుమాయతో అరిహుడు అనే పురుషున్ని సృష్టించి మాయామతాన్ని వారికి ఉపన్యాసం చేసి వారిని ధర్మభ్రష్టులను చేయవలసినదిగా ఆదేశించారు. అరిహుడు నలుగురు శిష్యులను తయారుచేసి, వారికి మాయామతాన్ని ఉపదేశించి శిష్య సమేతుడై త్రిపురాలకు వెళ్ళి మత ప్రచారం చేసాడు. నారదుని ప్రోత్యాహంతో త్రిపురాసురులు అరిహుని వద్ద దీక్ష తీసుకుని నాస్తికులయ్యారు. అప్పుడు ధర్మచ్యుతి పొందిన వారిని చంపవలసినదిగా దేవతలు శివున్ని ప్రార్థించారు. శివుడు త్రిపురాసుర సంహారం కోసం ఉత్తమ రధాన్ని, ధనుర్భాణాలను నర్మించమని విశ్వకర్మకు ఆజ్ఞాపించారు. 
విశ్వకర్మ సర్వదేవతలను ఉపయోగించి ఒక దివ్య రధాన్ని నిర్మించాడు. దానికి సూర్యచంద్రులు చక్రాలయ్యారు. బ్రహ్మదేవుడు రధసారథి అయి పగ్గాలు చేతపట్టాడు. మేఖలాచలం గొడుగుగా, మందరగిరి పార్శ్వదండంగా, మేరుపర్వతం విల్లుగా, అనంతుడు వింటి నారిగా, శారదాదేవి వింటికి కట్టిన చిరు గంటలుగా, విష్ణువు మహాతేజస్సుతో బాణంగా మారారు. అగ్నిదేవుడు బాణపుమొన అయ్యారు. నాలుగు వేదాలు నాలుగు గుర్రాలైనాయి. 
శివుడు ఆ రధాన్ని ఎక్కి పార్వతీదేవితో బయలుదేరాడు. త్రిపురాలకు వెళుతుండగా మార్గమధ్యలో ఆ రధచక్రం యొక్క మేకు విరిగిపోయి, రధం కదలకుండా ఉండిపోతుంది. వాళ్ళకి ఇలాంటి సంఘటన జరగటం ఏంటని ఆశ్చర్యపోతారు. కొంతసేపు ఆలోచించిన తరువాత వారు విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని ప్రార్థించడం మరచిపోయానని అందుకే ఈ ఆటంకం కలిగిందని గ్రహించిన తరువాత పార్వతీ సమేతుడై పరమశివుడు గణేశున్ని ప్రార్థిస్తారు. ఆ స్తోత్రానికే శివశక్తి కృత గణేశ స్తోత్రం గా ప్రాచుర్యం పొందింది. ఆ స్తోత్రం చేసిన తరువాత గణేశుడు ఆనందించి వారికి ఏ విఘ్నం కలగకుండా విజయం సాధిస్తారని చెప్తాడు. ఈ స్తోత్రం ఎవరు చదువుతారో, వింటారో వారు వారి కొడుకులు, మనవళ్ళతో ధనధాన్యాలకు లోటు లోకుండా సుఖసంతోషాలతో ఉంటారని గణేశుడు ఆశీర్వదిస్తాడు. విఘ్నేశ్వరునికి స్తుతి చేసిన తరువాత పార్వతీపరమేశ్వరులు ఇద్దరూ కాంచన, రజత, తామ్ర పురములు మూడు ఒక దానిని ఒకటి సమీపిస్తుండగా, శివుడు ధనుర్భాణాలు చేతబట్టి రధంలో నిలబడ్డాడు. త్రిపురాలు ఏకమైనాయని బ్రహ్మ, శివునికి చెప్తాడు. వెంటనే శివుడు వింటితో బాణాన్ని సంధించి విడిచిపెడతాడు. బాణం, బాణం మొన రూపంలో ఉన్న విష్ణువు, అగ్నిదేవుడు ఆ త్రిపురాలను భస్మంచేసి, శివుని దగ్గరకు వచ్చింది. ఆ త్రిపురాసురులు ముగ్గురూ వారివారి సైన్యంతో సహా కాలిపోతారు. ఈ విధంగా పార్వతీదేవిశివుడు కలిసి విఘ్నేశ్వరున్ని స్తుతించి ఎటువంటి ఆటంకం లేకుండా త్రిపురాసురులను చంపి దేవతలకు ధైర్యం కలిగిస్తారు. ఓం నమఃశివాయ. 


కొత్తది పాతది