కౌల్హాపురీ మహాలక్ష్మి

 

మహాలక్ష్మిదేవి, కౌల్హాపూర్ మహారాష్ట్ర 
అష్టాదశ శక్తిపీఠాలలో ఏడవది అయిన కౌల్హాపురీ మహాలక్ష్మి దేవి ఆలయం మహారాష్ట్రలో కౌల్హాపురీ జిల్లాలో కొలువై ఉంది. అంబాబాయి గా పిలువబడే ఇక్కడ అమ్మవారు మూడడుగుల ప్రతిమతో సింహ వాహన దారి అయి, నాలుగు చేతులతో, 40 కిలోల వజ్రాలతో పొదగబడిన కిరీటం ఉండి దానిపై శేషనాగు చిత్రం ఉంటుంది. హిందూ ఆలయాలలో విగ్రహాలు తూర్పు లేదా ఉత్తరం వైపు చూసే విధంగా ఉంటాయి కానీ ఈ ఆలయం లో అమ్మవారి విగ్రహం పడమర దిక్కుకు చూస్తుంది. గోడకు చిన్న తెరిచి ఉన్న కిటికీ ఉంటుంది. ఆ కిటికీ ద్వారా ప్రతీ సంవత్సరం మార్చి 21 మరియు సెప్టెంబరు 21 వ తేదీలలో సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు అమ్మవారిపై పడుతుంది. ఆ రెండు రోజులు మాత్రమే సూర్యకిరణాలు పడతాయి. ఈ దేవాలయాన్ని 7 వ శతాబ్ధంలో చాళుక్య వంశ రాజైన కరన్దేవ్ నిర్మాణాన్ని చేపట్టారు. అమ్మవారికి ప్రతీరోజు 5 సార్లు అర్చన చేస్తారు. ప్రతీ శుక్రవారం సాయంత్రం, పౌర్ణమి రోజులలో అమ్మవారిని ఆలయం బయట ఊరెరిగింపు చేస్తారు. మహారాష్ట్రీయులకు మహాలక్ష్మి దేవి ఆలయం అత్యంత పవిత్రాస్థలం ఇక్కడ వారు అమ్మవారిని అంబాబాయిగా పిలుస్తారు. ప్రళయం సంభవించినప్పుడు పరమశివుడు కాశీ క్షేత్రాన్ని తన త్రిశులంతో పైకి ఎత్తి కాపాడతాడు. అలాగే ఈ కౌల్హాపురీ క్షేత్రాన్ని కూడా అమ్మవారు తన చేత్తో పైకి ఎత్తి కాపాడుతుంది. అందుకే ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమనే ఇంకో పేరు కూడా ఉంది. సూర్యగ్రహణం రోజున శివుడు నీరుగా, విష్ణువు రాయిగా, మహర్షులు ఇసుకగా, దేవతలు చెట్టుగా, మూడున్నర కోట్ల తీర్థాలు ఇక్కడ కొలువై ఉంటారు. అందుకే సూర్యగ్రహణం రోజున ఇక్కడ స్నానం చేస్తే పంచమహాపాతకాలు ప్రక్షాళన అవుతాయి అని అంటారు. అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ఎల్లప్పుడూ కాశీక్షేత్రాన్ని దర్శించుకునేవాడు. అయితే తన వృధ్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీక్షేత్రాన్ని దర్శించుకోవడానికి కష్టంగా అనిపించింది. అగస్త్యుడు, పరమశివుని గురించి తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షం అయి వరం కోరుకోమనగా, వృద్ధాప్యం కారణంగా కాశీక్షేత్రానికి రాలేకపోతున్నానని, కాశీక్షేత్రానికి సమానమైన క్షేత్రాన్ని తనుకు చూపించమని కోరుకున్నాడు. అప్పుడు పరమశివుడు కౌల్హాపురీ క్షేత్రం లో మహాలక్ష్మీ దేవిని దర్శించుకుంటే కాశీక్షేత్రాన్ని దర్శించుకున్న ఫలితం ఉంటుందని చెప్తాడు. పరమశివుడు చెప్పినట్టే అగస్త్య మహర్షి కౌల్హాపురీ మహాలక్ష్మి దర్శనం చేసుకుని, అలాగే అక్కడ కొలువైన అతిబలేశ్వరస్వామి ని దర్శించుకునే వాడని అక్కడ స్థలపురాణం చెప్తుంది. ఈ కౌల్హాపురినే కోల్ పూర్, కోలగిరి, కొలదిగిరి అని పిలిచేవారు. కొల్లా అంటే లోయ అని, పూర్ అంటే పట్టణంగా కౌల్హాపూర్ క్షేత్రం విలసిల్లింది. 17 వ శతాబ్థంలో ఛత్రపతి శివాజీ పాలనలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. ఈ ఆలయం లో ప్రత్యేకంగా కీర్ణోత్సవ పండుగ చేస్తారు. అంటే సూర్యకిరణాలు అమ్మవారి పై పడిన రోజులనాడు చేస్తారు. మార్చి, సెప్టెంబరు నెల 21 వ తేదీన సూర్యకిరణాలు అమ్మవారి ముఖంపై పడతాయి. అలా మూడురోజుల పాటు జరుగుతుంది. జనవరి 31 మరియు నవంబరు 9 వ తేదీలలో సూర్యకిరణాలు నేరుగా అమ్మవారి పాదాలపై పడతాయి. ఫిబ్రవరి 1 మరియు నవంబరు 10 వ తేదీలలో సూర్యకిరణాలు అమ్మవారి ఛాతీ పై పడతాయి. ఫిబ్రవరి 2 మరియు నవంబరు 11 వ తేదీలలో సూర్యకిరణాలు అమ్మవారి శరీరం పై పడతాయి. సూర్యకిరణాలతో స్నానం చేస్తున్నట్టుగా ఉంటుంది ఆ సమయంలో.

కొత్తది పాతది