పాండవుల వల్ల ఐదు భాగాలుగా పడిన శివుడు


 
కేధారేశ్వరక్షేత్రం
నర-నారాయణులు బదరికా అనే గ్రామానికి చేరుకుని అక్కడ పరమశివుని పార్ధివ శివలింగాన్ని పూజించటం ప్రారంభించారు. అది చూసి పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకొమ్మని అడుగగా నర-నారాయణులు శివున్ని ఎప్పుడు అక్కడే ఉండాలని వరం అడిగారు. వారి కోరికను శివుడు అనుగ్రహించి కేదారేశ్వరుని గా స్వయంగా అక్కడే ప్రతిష్టితుడయ్యాడు. అదే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదారేశ్వర క్షేత్రం. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ శ్రేణిలో ఉంది. ఇక్కడ వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం ఏప్రిల్, నవంబరు నెలల మధ్య మాత్రమే సాధారణ ప్రజలకు తెరిచి ఉంచుతారు. శీతాకాలంలో కేధారనాధ్ ఆలయ విగ్రహాన్ని క్రిందకు తీసుకువచ్చి ఉక్రిమత్ అనే ప్రదేశంలో ఆరు నెలల వరకూ అక్కడే ఉంచి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి రోడ్డు మార్గం లేదు. కొండలపై ట్రెకింగ్ చేయవలసి ఉంటుంది. లేదా డోలీల సహాయంతో వెళ్ళవచ్చు. ఉత్తరహిమాలయాల చోటా చార్ ధామ్ యాత్రలలో ఇది కూడా ఒకటి.

మరొక కధనం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళ బందువులను, సోదరులను చంపిన పాండవులు తమ పాపాలను ప్రాయశ్ఛిత్తం కోసం శివున్ని దర్శంచుకుని ఆశీర్వాదం కోసం చూస్తూ ఉంటారు. పరమశివుడు వారి నుండి తప్పించుకుని తిరుగుతూ కేధారనాధ్ కి వెళ్ళి ఎద్దు రూపంలో అక్కడ ఉండిపోతాడు. భీముడు శివుడు ఎద్దు రూపంలో ఉన్నాడని గుర్తిస్తాడు. అలా తెలిసిన తరువాత శివుడు అక్కడ నుండి మాయమై ఐదు భాగాలుగా విడిపోయి వేర్వేరు ప్రదేశాలలో ఉంటాడు. అవి మూపురం భాగం ఉన్న ప్రదేశాన్ని కేధారేశ్వరునిగా, అతని బొడ్డు భాగం మధ్మహేశ్వురునిగా, చేతులు తుంగనాధ్ గా, ముఖం రుద్రనాధ్ గా, జటలు (జుట్టు) కల్పేశ్వర్ గా ఆవిర్భవించాడు. వాటినే ఇప్పుడు పంచ కేధార్ గా వ్యవహారం లో ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గర్హాల్ ప్రాంతంలో ఈ పంచ కేధార్ క్షేత్రాలు భక్తులతో పూజింపబడుతున్నాయి. ఇక్కడకు వచ్చిన భక్తులు పంచకేధార్ సర్క్యూట్ గా ఈ ఐదు ఆలయాలను తిరిగి చూడవచ్చు.

కేధార్ నాధ్ - కేధార్ నాధ్ ఆలయం ఉత్తరాఖండ్ లో రుద్రప్రయాగ లో ఉంది. ఇక్కడ గంగా నదికి ఉపనది అయిన మందాకినీ నది ప్రవహిస్తుంది. ఇక్కడ ఆలయం లో శివలింగం శంఖు ఆకారంలో ఉంటుంది. పంచకేధార్ ఆలయాలలో ఇదే ముఖ్యమైన ఆలయం. కేధార్ నాధ్ ఆలయానికి ట్రెక్కింగ్ గౌరీకుండ్ నుండి ప్రారంభం అవుతుంది.

మద్మహేశ్వరుడు - సుమారు 3,289 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మద్మహేశ్వురుడు లేదా మధ్యమహేశ్వురుని ఆలయం శివుని నాభి బాగం లేదా మధ్య భాగం నుండి ఉద్భవించినదని చెబుతారు. ఈ ఆలయం చుట్టూ కేధార్ నాధ్, చౌకాంబ మరియు నీలకంఠ మంచు శిఖరాలు ఉంటాయి.

తుంగనాధ్ - ప్రపంచంలో ఎత్తైన శివాలయాలలో ఒకటి ఈ తుంగనాధ్ ఆలయం. ఇక్కడ శివుడు చేతులు కనిపించిన ప్రదేశం. ఈ ఆలయం రుద్రప్రయాగ్ జిల్లాలో 3,680 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ నందాదేవి, చౌకాంబ, మరియు నీలకంఠ అని పలువబడే కొండలు ఉంటాయి.

రుద్రనాధ్ - 2,286 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆలయం సహజమైన రాతి దేవాలయం. ఇక్కడ పరమశివుడు నీలకంఠ మహదేవ్ గా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ శివుని ముఖం నేలపైకి వచ్చి కనిపించిందని నమ్ముతారు. ఈ ఆలయం చుట్టూ సూర్య కుండ్, చంద్ర కుండ్, తారా కుండ్, మనా కుండ్ అనే కొలనులు ఉన్నాయి.

కల్పేశ్వర్ - పంచకేధార్ లో ఆఖరి ఆలయం, సంవత్సరం పొడవునా తెరిచి ఉండే ఆలయం ఈ కల్పేశ్వర్ ఆలయం. ఇక్కడ పరమశివుని జటలు పూజింపబడుతుంటాయి. పంచకేదార్ సర్క్యూట్ ఈ ఆలయం తో ముగుస్తుంది.




కొత్తది పాతది