గంగా ప్రవాహం నుండి పరమశివున్ని కాపాడుకున్న కాత్యాయనీదేవి

కామాక్షిదేవి
 అష్టాదశ శక్తిపీఠాలలో రెండవదయిన కామాక్షిదేవి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో కంచి లో ఉంది. కాంజీవరం, కాంచీపురం అని కూడా పిలుస్తారు. కంచి అనగా మొలచూల వడ్డాణం అని అర్థం. ఇక్కడ సతీదేవి నాభిభాగం పడింది. ఇక్కడ అమ్మవారు పద్మాసనంతో యోగ ముద్రలో ఉంటుంది. అన్ని జీవరాసులు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాభి నుండే పోషిస్తుంది కాబట్టి ఈ ప్రదేశం సమస్త సృష్టిని అమ్మవారు తన నాభి స్థానం నుండి పోషిస్తుంది. ఇక్కడ అమ్మవారు పరమశివుని కళ్యాణం చేసుకోవటానికి కాత్యాయనీదేవి గా తపస్సు చేస్తుంది. ఈ ఆలయం లో అమ్మవారు సుగంధ కుంతలాంబ గా కూడా పూజలు అందుకుంటుంది. జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు ఇక్కడకు వచ్చినప్పుడు అమ్మవారు ఉగ్రరూపం లో ఉండి గర్భగుడి అంతా వేడిగా ఉండడం గమనించి అందరూ అమ్మవారి ని దర్శంచుకోవాలని ఇక్కడ ఆలయం లో శ్రీచక్రం స్థాపించి అమ్మవారిని శాంతపరచారు. ఇక్కడే అమ్మవారిని ఉద్దేశించి సౌందర్యలహరి ని రచించారు. దశరధ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసి అమ్మవారి నాభిస్థానాన్ని పూజించటం వల్ల దశరధునికి ఒక పాప పుట్టిందని మార్కండేయ పురాణం చెప్తుంది. ఈ ఆలయం లో కామాక్షి దేవి తన రెండు చేతులలో చెరకు గడ, చిలుకను, పాశమును, అంకుశమును ఐదు పువ్వుల గుత్తిని ధరించి ఉంటుంది. దండయాత్రల నుండి కాపాడటానికి అమ్మవారి బంగారు విగ్రహాన్ని దాచి పంచలోహాలతో తయారుచేసిన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. దండయాత్ర అయినపోయిన తరువాత ఆ బంగారు విగ్రహాన్ని తంజావూరు లో పశ్ఛిన మాసి వీధిలో శ్యామశాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక మందిరంలో ఉంచారు. ఇప్పటికీ ఆ బంగారు కామాక్షి అమ్మవారు పూజలు అందుకుంటుంది. 

ఈ ఆలయంలో వినాయకుడు ఢంకా వినాయకుడి గా దర్శనమిస్తాడు. ఏకాంబరేశ్వర, సుగంధ కుంతలాంబ వివాహ మహోత్సవాన్ని ఢంకా భజాయించి అందరికీ తెలియజేస్తాడు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే కామాక్షి ఆలయంలో ఉత్సవ కామాక్షి తల్లికి విగ్రహానికి ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు ప్రియభక్తుడిలా, పరమశివునికి ఎదురుగా ఉన్న నంది లా అమ్మవారికి ఎదురుగా ఉంటారు. ప్రతి దేవాలయంలో అమ్మవారు, పరమశివుడు పక్కపక్కనే ఉండి దర్శనం ఇస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం అమ్మవారు ఒక్కరే దర్శనం ఇస్తారు. ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో స్వామి ఏకామ్రనాధునిగా దర్శనం ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత. ఏ ఆలయంలో అయిన స్వామివారి బీజాక్షరాలు ఒక యంత్రం మీద రాసి పీఠం కింద ఉంచి దాని మీద స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయటం ఆనవాయితీ. కాని ఈ అమ్మవారి ఆలయంలో అమ్మవారి భీజాక్షరాలు రాసిన యంత్రాన్ని అమ్మవారి విగ్రహానికి ఎదురుగా ఉంచి ఆ యంత్రానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కామాక్షి ఆలయంలో అరూపలక్ష్మి దేవి దర్శనం ఇస్తుంది. కామాక్షి అమ్మవారిని దర్శించుకుని పూజారి ఇచ్చిన కుంకుమను అరూపలక్ష్మికి ఇచ్చి ఆ కుంకుమను ప్రసాదంగా తీసుకుంటే భర్తను నింధించిన దోషం పోతుంది. స్త్రీపురుషులు ఎవరైనా ఈ అరూపలక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాపవిమోచనం కలుగుతుంది. పరమశివున్ని వివాహం చేసుకోవడానికి కాత్యాయనీ దేవిగా పార్వతీదేవి ఇక్కడ పరమశివుని సైకత లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేస్తుంది. తనను పరీక్షించడానికి పరమశివుడు గంగా ప్రవాహాన్ని ఆ సైకత లింగం వైపు ప్రవహించమని ఆదేశిస్తాడు. ఆ గంగా ప్రవాహం నుండి ఆ సైకత లింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుంటుంది. ఆ ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మవారి గాజుల ముద్రలు, కుచ ముద్రలు పడిన శివలింగాన్ని ఇప్పటికీ చూడవచ్చు. శోకాపహంత్రీ సతాం అని అమ్మవారి ధ్యానంలో ఉండి ఎవరైతే అమ్మవారిని సతతం మనఃస్ఫూర్తిగా కొలుస్తారో వాళ్ళ భుడం తట్టి నేనున్నా అని అమ్మవారు ముందుకు నడుపుతుంది. ఆ అమ్మవారి కరుణా కాటాక్షం ఎళ్ళవేళలా మనందరి మీదా ఉండాలని కోరుకుంటూ. సర్వేజనాఃసుఖినో భవంతు. 

కొత్తది పాతది