అలంపురీ జోగులాంబ

 

జోగులాంబదేవాలయం, అలంపూర్
తెలంగాణా రాష్ట్రంలో అలంపూర్ లో కొలువై ఉన్న జోగులాంబ సతీదేవి పైపళ్ళు పడిన ప్రదేశంగా పరిగణిస్తారు. తుంగభద్రనదీ ఒడ్డున కృష్ణానదిలో కలిసే ప్రదేశానికి సమీపంలో ఉంది ఈ ఆలయం. ఏడవ శతాబ్దంలో బాదామి చాళుక్యులో చే నిర్మించబడినదీ ఈ ఆలయం. ఈ ఆలయ సమీపంలోనే నవబ్రహ్మలుగా భావించే తొమ్మిది దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ పరమశివుడు బాలబ్రహ్మేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. 1390 లో బహమనీ సుల్తాన్ చే భూస్థాపితం చేయబడింది. విజయనగర చక్రవర్తి రెండవ హరిహరరాయలు తన సైన్యాన్ని బహమనీ సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి పంపి, తరువాత దాడులు జరగకుండా ఆపాడు. ఆలయం పాడైన తరువాత జోగులాంబ అమ్మవారి విగ్రహం అక్కడ నవబ్రహ్మ ఆలయ సముదాయంలో ఉన్న బాలబ్రహ్మ ఆలయం లో ప్రతిష్టించి 2005 వరకూ అక్కడే పూజలు చేసారు. ఆలయాన్ని పునర్నిర్మించిన తరువాత జోగులాంబ అమ్మవారిని పునఃప్రతిష్టించారు. ఇక్కడ అమ్మవారు తలపై తేలు, కప్ప మరియు బల్లితో శవం మీద కూర్చొని ఉంటుంది. జోగులాంబ అమ్మ యోగులకు అమ్మ అనే తెలుగు పదం నుండి వచ్చింది. ఈ ఆలయాన్ని శ్రీశైల క్షేత్రానికి పడమర ద్వారంగా భావిస్తారు. ఈ ఆలయ ప్రస్తావన స్కాంధపురాణంలో కూడా వివరించబడింది. మన ఇంటిలో ఉండి భయపెట్టే బల్లి, కప్ప, తేలు, మనిషి పుర్రే, గబ్బిలం మొదలైనవి ఇంటిని నాశనం చేసే చెడు శక్తులను తరిమికొట్టి ధైర్యాన్ని ప్రసాదించే తల్లిగా అమ్మవారి అవతారం ఉంటుంది కనుకే జోగులాంబగా ఆవిర్భవించింది. అందుకే ఈ అమ్మవారిని గృహచండీ గా కూడా ఆరాధిస్తారు. మన ఇంటిని ఎల్లప్పుడూ కాపాడే తల్లిగా భావిస్తారు. ఈ ఆలయంలో దసరా, మహాశివరాత్రి రోజులలో ఎంతో ఘణంగా పూజలు నిర్వహిస్తారు. ఇందులో ఉండే నవ బ్రహ్మలు స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, తారక బ్రహ్మ, బాలబ్రహ్మ, ఆర్క బ్రహ్మ, కుమార బ్రహ్మ, గరుడ బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మలు కొలువైఉన్నారు. మరో కధనం ప్రకారం కాశీలో నివాసం ఉంటున్న పుణ్యవతి అనే ఒక విధవరాలు ఉంటుంది. తనకు పిల్లలు కలగకుండా తన భర్త చనిపోతాడు. పుణ్యవతి శివభక్తురాలు. శివున్ని ప్రార్థించి తనకు మగ పిల్లాడు కావాలని కోరుకుంటుంది. తను కోరుకున్నట్టుగా మగపిల్లాడిని అనుగ్రహిస్తాడు పరమశివుడు. రససిధ్ధ అని పేరు పెట్టుకుంటుంది. కానీ అక్కడ ఉండే ప్రజలందరూ తండ్రి లేకుండా పుట్టిన పాపాత్ముడు అని తన బిడ్డను ఎల్లప్పుడూ అవహేలన చేస్తుంటారు. దానికి పుణ్యవతి తన బిడ్డకి శివున్ని ఆరాధించమని చెప్తుంది. తల్లి చెప్పినట్టే సిద్ధుడు అలాగే చేస్తుంటాడు. అప్పుడు పరమశివుడు సిద్ధునికి అలంపూర్ లో అందరు దేవతలకూ ఆలయాన్ని నిర్మించమని చెప్తాడు. రససిద్ధ చెప్పినట్టే ఆలయ నిర్మాణానికి పూనుకుంటాడు. ఆలయ నిర్మాణం మధ్యలో విలసత్ అనే రాజు వచ్చి ఆలయాలపై దాడి చేసి అన్నింటిని నాశనం చేసి సిధ్ధుని దగ్గర కమండలం లో ఉన్న నీటిని తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ నీటికి దేనినైనా బంగారంగా మార్చే శక్తి ఉంటుంది. అప్పుడు సిధ్ధుడు ఆగ్రహించి రాజుకు తన సైన్యం, తన రాజబోగాలన్నీ నాశనం అయిపోవాలని శాపం ఇస్తాడు. అంతా నాశనం అయిన రాజు ఆహారం కోసం, నీళ్ళ కోసం అడవులలో తిరుగుతుంటాడు. ఒకరోజు తనకు సహాయం చేసిన ఒక వేటగాడిని కలుసుకుంటాడు రాజు. ఆ వేటగాడు జింకను వేటాడడం కోసం తిరుగుతున్నాడు. అప్పుడు రాజు తనను జింకను వేటాడొద్దని చెప్పిన వినకుండా జింక వెనక పరిగెడతాడు వేటగాడు. జింక దగ్గరకు వెళ్ళిన తరువాత ఆ జింక నన్ను చంపితే ఆ విలసత్ రాజు కి పట్టిన గతే నీకూ పడుతుంది అని మనిషి భాషలో చెప్తుంది. ఆశ్చర్యపోయిన వేటగాడు రాజు దగ్గరకు వచ్చి జరిగినది చెప్తాడు. అప్పుడు రాజు, వేటగాడు కలిసి ఆ జింక దగ్గరకు వెళ్ళి నా పాపానికి పరిహారం చెప్పమని వేడుకుంటాడు. అప్పుడు జింక బ్రహ్మేశ్వర క్షేత్రానికి వెళ్ళి నువ్వు నాశనం చేసిన ఆలయాన్ని పునఃర్నిర్మిస్తే నీ పాపం పోతుందని చెప్తుంది జింక చెప్పినట్టే రాజు వెళ్ళి ఆ ఆలయాలను నిర్మిస్తాడు. తన పాపం పోయి అమ్మవారి అనుగ్రహంతో తన రాజ్యం, సైనికులు తిరిగి వస్తారు.  

కొత్తది పాతది