కుంభకర్ణుని కొడుకు భీముడు

భీమేశ్వరస్వామి
ద్వాదశ జ్యోతిర్లింగాలలో 6వ దైన భీమశంకర క్షేత్రం మహారాష్ట్రలో పూణేకు 127 కిలోమీటర్ల దూరం లో ఉంది. పూణే జిల్లా భావగిరి గ్రామంలో సహ్యాద్రి పర్వతాలలో డాకిని అనే కొండపైన పరమశివుడు భీమశంకరునిగా పూజలందుకుంటున్నాడు. కృష్ణా నదికి ఉపనది అయిన భీమానది ఇక్కడే పుట్టింది. ఇక్కడ భీమనాధుడు శాకినీ, డాకినీ మొదలైన రాక్షస సమూహలతో పూజలందుకుంటున్నాడు.

పూర్వం ఈ కొండలపై కర్కటి అనే రాక్షస స్త్రీ నివసిస్తూ ఉంటుంది. తన కొడుకు పేరు భీముడు. భీముడు ఒకనాడు తన తల్లి ని నా తండ్రి ఎవరని ప్రశ్నిస్తాడు. అప్పడు కర్కటి "లంకాధిపతి అయిన రావణుని తమ్ముడు కుంభకర్ణుడే నీ తండ్రి అని చెప్పి, శ్రీరాముడు యుద్ధంలో మీ తండ్రిని, పెదతండ్రిని చంపిన తరువాత నేను ఇక్కడికి వచ్చి ఉండిపోయానని చెప్తుంది. నా తల్లిదండ్రలయిన కర్కటుడు, పుష్కసి అగస్త్యమహర్షి శిష్యుడైన సుతీక్ష్ణుడు అనే వాడిని తినబోయారు. ఎంతో తపస్సంపన్నుడైన సుతీక్ష్ణుడు వారిని భస్మం చేసాడు. నా అనే వారు లేక బిక్కుబిక్కుమంటూ నేను ఒక్కదాన్నే బ్రతుకుతున్నాను. నీ తండ్రి మహావీరుడు కనుక నీవు కూడా వీరునిగా నీ తండ్రి పేరు నిలబెట్టు" అని కర్కటి, భీమునితో తనకు జరిగినదంతా చెప్తుంది. దానికి కోపించిన భీముడు విష్ణుమూర్తిని వారి భక్తులను నాశనం చేస్తానని చెప్పి బ్రహ్మదేవుని కొరకు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన ధైర్యాన్ని వరంగా ప్రసాదిస్తాడు. ఆ వరగర్వంతో భీముడు దేవతల మీద యుద్ధానికి వెళ్ళి దేవేంద్రున్ని ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకుంటాడు. తరువాత భూమి అంతా తిరిగి సాధువులను, మహర్షులను భాదించాడు. సుదక్షిణుడు అనే రాజు కామరూప దేశాన్ని పాలిస్తుండేవాడు. ఆ రాజు పై దండెత్తి రాజ్యాన్ని కైవసం చేసుకుని ఆ రాజు ను చెరసాలలో బంధిస్తాడు. సుదక్షిణుడు పరమశివ భక్తుడు అవటం వల్ల ఆ చెరసాలలోనే మట్టితో శివలింగాన్ని చేసి నిత్యం పూజలు చేస్తుండేవాడు. దానికి కోపించిన భీముడు ఆ పూజలు ఆపమని రాజుకు చెప్తాడు. అయినా ఆపడం లేదని తన కత్తి తీసి ఆ శివలింగాన్ని ముక్కలు ముక్కలు చేస్తానని కత్తి ఎత్తి ఆ శివలింగాన్ని కొట్టేలోపల పరమశివుడు ఆ శివలింగం నుంచి వచ్చి భీమున్ని భస్మం చేస్తాడు. భీమున్ని శివుడు చంపాడని తెలుసుకున్న తారకాసురులు శివుని పై యుద్ధానికి వెళ్తారు. పరమశివుడు చెమటోడ్చి వారిని సంహారం చేసారని ఆ చెమటే అక్కడ భీమానదిగా పారింది. భీమాసురిని తల్లి కర్కటి తన కుమారుని గురించి ధీనాతిదీనంగా ప్రార్ధించింది. తన కొడుకు పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని వరం కోరుకుంది. అప్పుడు పరమశివుడు అక్కడే జ్యోతిర్లింగంగా వెలసి భీమశంకరునిగా సహ్యాద్రి పర్వతముల పై వెలిసాడు.

కొత్తది పాతది