పార్వతీదేవి గృహప్రవేశానికి రావణుడు పౌరహిత్యం

 

శాంకరీదేవి ఆలయం, శ్రీలంక
దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి శరీరాన్ని శివుడు తన భుజంపై వేసుకుని తిరుగుతున్నపుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండాలుగా కోసినప్పుడు తన శరీరభాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా పడినప్పుడు తొడ భాగం శ్రీలంకలో ట్రిన్కోమలి ప్రదేశంలో పడింది. ఈ ప్రదేశాన్నే తిరుకోనేశ్వరం అని కూడా అంటారు. ఆ ప్రదేశంలోనే శాంకరీదేవి గా అమ్మవారు ఆవిర్భవించారు.  

 పూర్వం పార్వతీ దేవి, శివుడు తన పిల్లలతో కలిసి ఒక సుందరమైన భవనాన్ని కట్టుకుని అక్కడ నివసించాలి అని అనుకుంటుంది. ఆ విషయం పరమశివునికి చెప్తే ఆయన యోగులకే యోగి, భవనం స్మశానం అనే తేడాలు ఆయనకి ఉండవు కాబట్టి ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటాడు. తరువాత పార్వతీదేవి కోరిక కాబట్టి దేవశిల్పి విశ్వకర్మను పిలిచి ఒక సుందరమైన భవనం కట్టమని ఆదేశిస్తాడు. విశ్వకర్మ శివుని ఆదేశానుసారం లంకలో ఒక అందమైన ప్రదేశాన్ని ఎంచుకుని రత్నాలు, ఆభరణాలతో నిండిన ఒక అద్భుతమైన రాజభవనాన్ని ఏర్పాటుచేశాడు. అందులో మంచినీటి ఫౌంటైన్ లు కూడా ఏర్పాటుచేశాడు. అది చూసిన పార్వతీదేవి ఎంతో ఆనందించింది. ఒక మంచి రోజు చూసుకుని గృహప్రవేశం చేయటానికి నిర్ణయించుకున్నారు. గృహప్రవేశం చేయడానికి పురోహితుడు అవసరం కాబట్టి ఎవరిని ఉంచుదాం అని ఆలోచించుకున్నప్పుడు రావణుడు సకల శాస్త్ర పారంగతుడు కాబట్టి రావణున్ని పౌరహిత్యం చేయమని శివుడు చెప్తాడు. రావణుడు కూడా ఒక మంచి ముహూర్తం చూసి, సకల వేద మంత్రాలతో గృహప్రవేశం చేస్తారు. పార్వతీ దేవి సంతోషించి రావణున్ని ఒక వరం కోరుకొమ్మని అడుగుతారు. పరమశివుడు ఒక నవ్వు నవ్వి బ్రహ్మణులు ఇచ్చిన వాటికి సంతోషిస్తారు కాని అడగకూడదు అని అంటారు. కానీ దానికి రావణుడు కూడా నవ్వి నాకు ఈ భవనం చాలా నచ్చింది. ఈ రాజభవనాన్ని దక్షిణ గా ఇవ్వమని అడుగుతాడు. దానికి పార్వతీదేవి సంతోషంగా భవనాన్ని ఇచ్చేస్తుంది. అలా కాదనకుండా దక్షిణ ఇచ్చినందుకు ఎంతో సిగ్గు పడి రావణుడు పార్వతీదేవిని ఇక్కడే వెలిసి ఉండమని వేడుకుని అక్కడే ఒక అద్భుతమైన శిల్పకళతో కలిగిన పెద్ద గుడి కట్టి శాంకరీదేవి గా పార్వతీదేవిని ప్రతిష్టిస్తాడు. ఆ లంక అమ్మవారి  ఆశీర్వాదంతో ఎంతో సుభిక్షంగా సాగింది. 

కానీ రావణుడు సీతాదేవి అపహరించి లంకకు తీసుకుని వస్తే శాంకరీదేవి కోపంతో వెంటనే సీతాదేవిని రామునికి ఇవ్వమని ఆజ్ఞాపిస్తుంది. దానికి రావణుడు అంగీకరించకుండా సీతాదేవిని అక్కడే బందించి ఉంచుతాడు. అప్పుడు శాంకరీదేవి తన ఆజ్ఞను దక్కరించినందుకు ఆ నగరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. తరువాత రాముడు రావణున్ని సంహరించి విభీషణునికి పట్టాభిషేకం చేసిన తరువాత, విభీషణుడు వెళ్ళి అమ్మవారిని ప్రార్థించి తిరిగి లంకా నగరానికి వచ్చి ఉండమని వేడుకుంటే శాంకరీదేవి వచ్చి లంకలో ఉంటుంది. తిరిగి లంకకు మళ్ళీ కీర్తి ఏర్పడుతుంది. ఇక్కడ ఆలయం కొన్ని సంవత్సరాల తరువాత ధ్వంసం అయింది. ఇప్పుడు ఆలయం అక్కడ కొండశిఖరం మీద ఉన్న కోనేశ్వరం శివుని ఆలయం పక్కన నిర్మించబడింది. హిందూ మహాసముద్రం నేపధ్యంలో ఉన్న ఎత్తైన గోపురంతో ప్రధాన దేవత విగ్రహం ఉంది. ఈ ఆలయం దాదాపు 1000 స్తంభాలతో చిన్న చిన్న మండపాలతో నిర్మించారు. చోళులు, పాండ్యులు మరియు పళ్ళవుల కాలంలో కూడా ఈ ఆలయం ఎంతో అభివృద్థికి కృషి చేశారు. పోర్చుగీసు వలసవాదులు ఇక్కడకు వచ్చినప్పుడు 1505  AD తరువాత ఇక్కడ ఆలయాన్ని ప్రార్థనా స్థలాలను చాలా వరకు ధ్వంసం చేశారు. 1624 ఏప్రిల్ 14న తమిళ నూతన సంవత్సరం రోజున విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్ళినప్పుడు పోర్చుగీసువారు పూజారుల రూపంలో గుడి లోనికి వెళ్ళి విలువైన వస్తువులన్నీ ధ్వంసంచేశారు. తమ ఫిరంగులతో దాడి చేసారు. ఆలయ పైభాగాన్ని దోచుకున్నారు. చివరికి ఒక్క స్తంభం మాత్రమే మిగిలింది. ఆ పరిస్థితిలో భక్తులు త్రికోణేశ్వరస్వామి, శాంకరీదేవి విగ్రహాలను నుయ్యిలో దాచిపెట్టారు. తరువాత శ్రీలంక 1948 స్వాతంత్య్రం తరువాత ఆ విగ్రహాలను బయటకి తీసి తిరిగి ప్రతిష్టించి పూజా కార్యక్రామాలు చేస్తున్నారు. ఇంతటి చరిత్ర ఉన్న శాంకరీదేవి ఆలయాన్ని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి. 

కొత్తది పాతది