పంచారామ క్షేత్రాలు
పరమశివుడికి సర్వేశ్వరుడు అనే పేరు ఉంది. అంటే అంతటా ఉన్న పరమేశ్వరుడు బాహ్యప్రపంచంలో కనబడకుండా అన్ని ప్రాణులందు ఆయన నివసించి ఉన్నాడు. భాగవతంలో పోతనామాత్యులవారు అంటారు
నీయంద సంభవించు
నీయంద వసించి యుండు నిఖిలజగంబుల్నీ
యంద లయము బొందును
నీ యుదరము సర్వభూత నిలయము రుద్రా
ఓ రుద్రా. ఈ జగమంతా నీలోనే సృష్టి మొదలై, నీలోనే రక్షించబడుతూ, నీలోనే అంతం అయిపోతుంది. సర్వభూతకోటి నీ ఉదరంలోనే నివసించి ఉంటాయి అని అంటారు. అలాంటి సర్వవ్యాపకుడైన పరమశివుడు మానవకంటికి కనిపించేటట్టుగా మనల్ని అనుగ్రహించడానికి భూమిపై స్వయంబువుగా వెలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. జ్యోతిస్వరూపునిగా ఆవిర్భవించిన ద్వాదశ జ్యోతిర్లింగ ప్రదేశాలు. ఐదు లింగాలుగ ఆవిర్భవించిన పంచభూతలింగాలు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో వెలసిన పంచారామ క్షేత్రాలు ఇలా ప్రతీ ఆవిర్భావానికి వెలసిన క్షేత్రాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఈ విడియోలో పంచారామ క్షేత్రాల విశేషాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు సనాతనఇన్ఫో చానెల్.
ఆంధ్రప్రదేశ్లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. స్కాందపురాణం ప్రకారం హిరణ్యకశిపుని మనవడైన తారకాసురుడనే రాక్షసుడు పరమశివుని గురించి ఘోరతపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతే కాకుండా బాలుడి చేతిలో తప్ప ఇంకెవరివల్లా తనకు మరణం లేకుండా ఉండేలా వరం పొందుతాడు. ఆ వర గర్వంతో తారకాసురుడు దేవతల్ని బాధించడం వల్ల దేవతలందరూ శివున్ని వేడుకుంటారు. తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్థిస్తారు. దేవతల కోరిక మేరకు కుమారస్వామి ఉద్భవిస్తాడు. ఆయనను దేవతలకు సేనాని గా నిలిచి తారకాసురున్ని సంహరిస్తాడు. తారకాసురుడు నేలకూలడంతో అతని యందున్న ఆత్మలింగం 5 ఖండాలుగా మారింది. దేవతలు ఆ 5 లింగం ముక్కలను 5 చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచారామ క్షేత్రాలుగా పిలవబడుతున్నాయి. అవి దక్షారామం, కుమారారామం, క్షీరారామం, భీమారామం, అమరారామం.
1) అమరారామంః- ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో కృష్ణానదీ తీరాన ఉంది. అమరేశ్వరుని గా పూజలు అందుకుంటున్న పరమశివుడి లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రాన్నే పురాణాల్లో క్రౌంచతీర్థంగా పిలవబడింది. దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించారు. అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతాన్ని అమరావతి అనే పేరు వచ్చిందని స్థలపురాణం. గర్భాలయంలో 15 అడుగుల ఎత్తులో ఉన్న మహాశివలింగం దంతం రంగులో ఉంటుంది. ఈ శివలింగం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో తలపై మేకు కొట్టినట్టు చెబుతారు. ఆ సమయంలో అక్కడ రక్తం వచ్చిందని ఇప్పటికీ ఆ రక్తపు మరక ఉంటుంది. అందుకు సంబందించి ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి. ప్రతీ సంవత్సరం విజయదశమి రోజు, మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామివారికి, అమ్మవారికి కళ్యాణోత్సవం జరిపిస్తారు. ఇక్కడ అమ్మవారు బాలచాముండికా దేవిగా పూజలు అందుకుంటుంది. త్రిగుణాలకు అతీతంగా ఉంటాడు అనే భావనతో ఈ ఆలయ ప్రాకారాలు మూడు గా ఉంటుంది. మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు, జ్వాలాముఖీదేవి, మధ్య ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు, కుమారస్వామి, ఆంజనేయ స్వామి ఉంటారు. ధ్వజస్తంభం దగ్గరగా సూర్యుడు ప్రతిష్టితమై ఉంటాడు. ఆలయ ప్రధాన ద్వారం ఆనుకునే స్నానఘట్టం ఉంది. ఈ ఆలయంలోనే శంకరాచార్యులు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమా మహేశ్వరుడు, దత్తాత్రేయుడు, అగస్త్యేశ్వరుడు, పార్థివేశ్వరుడు, సోమేశ్వరుడు, నాగేశ్వరుడు, కోసలేశ్వరుడు, మహిషాసురమర్థిని, వీరభద్రుడు లాంటి దేవతా విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు. ఆలయంలో ఉన్న అమరేశ్వరుడు మెరుస్తూ నిలువెత్తుగా నిలబడి, భక్తులను ఆశీర్వదిస్తుంటాడు.
2) దక్షారామంః- తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్రాక్షారామంగా పిలవబడే ఈ నగరం అసలు పేరు దక్షారామం. దక్షప్రజాపతి ఈశ్వరుని మీద కోపంతో నిరీశ్వర యాగం చేసిన చోటు ఇదే కాబట్టి దీనికి దక్షారామం గా పేరువచ్చింది. సతీదేవి తన భర్తను అవమానించి నందుకు యోగాగ్నిలో పడి మరణించింది. ఆ కోపంతో వీరభద్రున్ని సృష్ఠించి దక్షయజ్ఞాన్ని నాశనం చేయించాడు శివుడు. ఇది కాలాంతరంలో ద్రాక్షారామంగా మారింది. ఇక్కడ పరమశివుడు భీమేశ్వరునిగా, అమ్మవారు మాణిక్యాంబ గా పూజలు అందుకుంటున్నారు. ఈ క్షేత్రం పంచారామాల్లో ఒకటిగానే కాకుండా అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ క్షేత్ర పాలకుడు లక్ష్మీనారాయణులు. శివాలయం తో పాటు విష్ణవాలయం కూడా ఉన్న దివ్యక్షేత్రం. త్రిలింగ క్షేత్రంగా, దక్షిణ కాశీగా పేరుపొందింది దక్షారామం క్షేత్రం. పూర్వం వేదవ్యాసుల వారు కాశిలో నివసించేవారు. ఒకసారి కాశీవిశ్వేశ్వరుడు వ్యాసుల వారిని పరీక్షించడానికోసం ఆయనకు, ఆయన శిష్యులకు భిక్ష దొరకకుండా చేసాడు. దానికి వేదవ్యాసుడు కోపంతో కాశిని శపించబోయాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి ఆయనకి, శిష్యులకు భిక్ష పెడుతుంది. వ్యాసుడు కాశీని శపించాలనుకోవడం వలన శివుడు వ్యాసున్ని తన శిష్యులతో కలిసి కాశీని వదిలి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించాడు. దానికి వ్యాసుడు బాధపడుతుంటే అన్నపూర్ణాదేవి ఆయన్ని దక్షారామం వెళ్ళి అక్కడ భీమేశ్వరుని సేవించమని, అక్కడ ఉంటే కాశీలో ఉన్న ఫలితం ఉంటుందని చెప్పగా వ్యాసుడు తన 300 మంది శిష్యులతో కలిసి దక్షారామంలో వచ్చి అక్కడ నివశించాడు. దీనికి గుర్తుగా ఆలయంలో ఒక స్తంభం మీద వ్యాసుని విగ్రహం చెక్కబడి ఉంటుంది. ఈ ఆలయంలో భీమేశ్వరస్వామి లింగరూపం 14 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండు అంతస్థులలో ఉంటుంది. లింగం సగభాగం నల్లగా, మిగిలిన సగభాగం తెల్లగా ఉంటుంది. అర్థనారీశ్వరుడు అనడానికి ఇదొక నిదర్శనం. గుడి లోపల వీరముడి ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. ఈయనకి జుట్టుముడి వేసి కొప్పులాగా ఉంటుంది. ఇక్కడ ఒకే పానవట్టంమీద 108 చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి. వాటిని దర్శిస్తే అన్ని శివాలయాలు దర్శించినంత ఫలం. ఇక్కడ నవగ్రహ మండపం, అష్టదిక్పాల మండపం ఉంది.
3)సోమారామంః- పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గునుపూడిలో సోమారామ క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామివారు సోమేశ్వరునిగా, అమ్మవారు ఉమాదేవిగా పూజలు అందుకుంటున్నారు. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్థనస్వామి ఆలయం అంటారు. ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు. అందుకే మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే ఈ శివలింగం అమావాస్య రోజున గోదుమ రంగులోకి మారుతుంది. మళ్ళీ పౌర్ణమి రోజుకి యధారూపంలోకి వచ్చేస్తుంది. చంద్రుని కళలు ఎలా అయితే పౌర్ణమి, అమావాస్య కు మారుతుందో అలా ఇక్కడ శివలింగం కూడా మారుతుంది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు క్రింద అంతస్థులోనూ, అన్నపూర్ణాదేవి పై అంతస్థులోను ఉంటుంది. ఇక్కడ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్థనస్వామి. చంద్రుడు తన గురువు అయిన బృహస్పతి భార్య తారను మోహించాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ఈ శివలింగాన్ని సోమేశ్వరునిగా పిలుస్తారు. ఈ ఆలయంలో పుష్కరిణి ఉంది చంద్రపుష్కరిణి గా పిలిచే ఈ కోనేరు లో స్నానం ఆచరిస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. దేవాలయం ముందు భాగంలో రెండునందులు, ధ్వజస్థంభం వద్ద ఒకటి, ఆలయ ప్రాంగణంలో మరొకటి, చంద్రపుష్కరిణిలో ఇంకొక నంది ఇలా ఐదు నందులు ఉండడం వల్ల ఈ ఆలయాన్ని పంచనందీశ్వరాలయం అని కూడా అంటారు. ఈ ఆలయ నిర్మాణంలో ఓ ప్రత్యేకత ఉంది. మొదటి ప్రాకారమునందున్న పెద్దనందీశ్వరుని కొమ్ములమధ్య నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. దేవాలయం ముందున్న రాతి గట్టునుండి చూస్తే పైఅంతస్థులో గల ఆలయంలోని అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఇలాంటి నిర్మాణం దేశంలో మరెక్కడా లేదు. తూర్పు చాళుక్యరాజైన చాళుక్యభీముడు మూడోశతాబ్థంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. శ్రీరాముడు, హనుమంతుడు, ఆదిలక్ష్మి, కుమారస్వామి, నవగ్రహాలు, సూర్యుడు, గణేశుని విగ్రహాలు కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయ సమీపం లోనే భీమవరం గ్రామదేవత దర్శనం కూడా చేసుకోవచ్చు.
4)కుమారభీమారామంః- తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో వెలసిన పరమశివుడ్ని కుమారభీమేశ్వరునిగా కొలుస్తారు. ఇక్కడ శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించిన కారణంగా కుమారరామం గా పేరువచ్చింది. 14 అడుగుల ఎత్తున రెండు అంతస్థుల మండపంగా ఉన్న ఈ శివలింగాన్ని రెండవ అంతస్థుకి వెళ్ళి పూజలు చేస్తారు. ఈ ఆలయాన్ని చాళుక్యరాజు భీముడు నిర్మించాడు. ద్రాక్షారామ ఆలయాన్ని కూడా ఈయనే నిర్మించారు. అందుకే రెండు ఆలయాలు శైలి ఒకేలా ఉంటుంది. నిర్మాణం జరిగిన తరువాత కుమారభీమేశ్వరునిగా పేరు వచ్చింది. నిర్మాణ సమయంలో ఈ శివలింగం అంతకంతకు పెరుగుతూ ఉండడం వల్ల శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారని స్థానికులు చెప్తారు. ఇక్కడ అమ్మవారు బాలాత్రిపురసుందరిగా పూజలు అందుకుంటుంది. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉంటారు. ఈ ఆలయం లో వినాయకుడు, కాల భైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువుదీరి ఉన్నారు. గుడిలో స్వామివారికి ఎదురుగా మండపంలో ఉన్న6 అడుగుల నంది విగ్రహం ఏకశిలచే చెక్కబడింది. ఆలయంలో మండపం నూరు రాతిస్తంభాలను కలిగి ఉంటుంది. ఛైత్ర, వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలను సాయంత్రం పూట అమ్మవారి పాదాలను తాకుతుంది. శివరాత్రి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి, బాలత్రిపురసుందరికి వైభవంగా వివాహ మహోత్సవాలు చేస్తారు. బయట ప్రాకారపు గోడకు నాలుగు దిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలుంటాయి. ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సూర్య ద్వారం అంటారు. ఆలయం చుట్టూ రెండవ ప్రాకారపు గోడను ఆనుకుని పొడవైన మంటపాలు రెండు అంతస్థులుగా ఉన్నాయి. ఈ మండపాలకు నాలుగు మూలలా సరస్వతీదేవి, కుమారస్వామి దేవతామూర్తులు మందిరాలు ఉన్నాయి. ప్రధానాలయానికి పశ్చిమంగా నూరుస్తంభాల మండపం ఉంది. వీటిల్లో ఏ రెండు స్తంభాలు ఒకే పోలికతో ఉండవు. ఆనాటి శిల్పుల నిర్మాణ శైలికి ఇది నిదర్శనం. ఊయల మండపంలో రాతి ఊయల ఉంటుంది. అది ఊపితే ఊగుతుంది.
5)క్షీరారామంః- పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉండే ఈ క్షేత్రంలో పరమశివుడు రామలింగేశ్వరస్వామిగా అమ్మవారు పార్వతీదేవి గా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం లో శివలింగాన్ని సాక్షాత్తూ విష్ణుమూర్తి ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్థనుడు. తొమ్మిది అంతస్థులతో 125 అడుగుల ఎత్తులో రాజగోపురం ఉంటుంది. చివర అంతస్థు వరకు వెళ్ళడానికి లోనికి మెట్లు ఉన్నాయి. ఇక్కడ శివలింగం రెండున్నర అడుగుల ఎత్తులో ఉండి, ప్రతీ సంవత్సరం ఉత్తరాయణ, దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో సూర్య కిరణాలు పెద్దగోపురం నుండి శివలింగం పై పడతాయి. ఆదిశంకరాచార్యుడు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు శ్రీచక్రం ప్రతిష్ఠించారు. శివలింగం పైభాగం మొనదేలి ఉండడం వలన ఇక్కడి స్వామివారిని కొప్పురామలింగేశ్వరుడు అని కూడా అంటారు. ఈ ఆలయంలో వినాయకున్ని ఋణహర గణపతిగా పిలుస్తారు. ఈ ఋణహర గణపతిని దర్శించటం వలన అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుందని భక్తులు భావిస్తారు. ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం కూడా ఉంది. పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలుడికోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుండి పాలధారలు పొంగి వచ్చాయి. ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. ఇక్కడే ఆలయంలో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో పుష్కరిణిని సృష్టించాడు. దానికే రామగుండం గా వ్యవహరిస్తారు.