అష్ఠాదశశక్తిపీఠాలు రావటానికి కారణం

 

అష్టాదశశక్తిపీఠాలు
బ్రహ్మ సృష్టిని అభివృద్థి చేయడం కోసం మనువులను, ప్రజాపతులను సృష్ఠించాడు. ఆ ప్రజాపతులలో దక్షుడు కూడా ఒకడు. దక్షుని భార్య ప్రసూతి.  ఆ దక్షునికి 60 మంది కుమార్తెలలో 24 మందిని చంద్రునికి ఇచ్చి వివాహం చేసాడు. దక్షుని చిన్న కూతురు అయిన సతీదేవి తన చిన్నతనం నుండి శివుని మీద ప్రేమతో తననే వివాహం చేసుకోవాలి అని నిశ్చయించుకుంటుంది. దక్షుని కోరికమేరకు అమ్మవారి అనుగ్రహం తో సాక్షాత్తూ ఆ పరాశక్తే సతీదేవిగా దక్షునికి కుమార్తెగా జన్మించింది. కానీ ఆ దక్షునికి మాత్రం సతీదేవిని శివునికి ఇచ్చి వివాహం చేయటం ఇష్టంలేదు. కానీ తన స్వయంవరంలో శివుడ్ని పిలవకపోయినా దండను ఆకాశంలోకి విసిరి శివుడ్ని వేడుకుంటుంది దానికి శివుడు ఆ దండను స్వీకరించి ఆ సభలో ప్రత్యక్షం అవుతాడు. ఇంక చేసేదేం లేక సతీ దేవిని శివునికి ఇచ్చి వివాహాం చేస్తాడు. చంద్రుడు తన 24 మంది భార్యలలో రోహిణి తోనే ఉండి మిగతావాళ్ళని పట్టించుకోవటం లేదని దక్షుడు ఆగ్రహించి చంద్రుడికి క్షయ గ్రస్తుడు కమ్మని శాపం పెట్టాడు. అప్పడు చంద్రుడు పరమశివుని వేడుకుంటే తనకి అభయం ఇస్తాడు. దానికోసం దక్షుడికి ఇంకా పరమశివుడంటే కోపం పెరిగిపోతుంది. దేవతలందరూ కలిసి సభ చేర్చినప్పుడు దక్షుడు అక్కడికి వస్తే పరమశివుడు లేచి నిలబడలేదని కోపం తెచ్చుకుని శివుడిని నింద చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. 

తరువాత దక్షుడు నిరీశ్వరయాగం పేరుతో ఒక యాగాన్ని తలపెడతాడు. దానికి సమస్త దేవతలనీ ఆహ్వానించి శివుడిని ఆహ్వానించకుండా, ఆ యాగ హవిస్సు కూడా శివుడికి లేకుండా చేద్దాం అని ప్రారంభిస్తాడు. అందరూ అనుకుంటున్న మాట విని సతీదేవి తన తండ్రి చేస్తున్న యాగాన్ని చూడటానికి బయలుదేరుతుంది. దానికి శివుడు మనల్ని ఆహ్వానించలేదు. పిలవకుండా ఎలా వెళ్తాము. అలా వెళ్తే అక్కడ అవమానం పొందుతాము అని చెప్పినా సతీదేవి వినిపించుకోదు. సరే నీ ఇష్టం అని చెప్పి పరమశివుడు ఊరుకుంటాడు. యాగానికి వెళ్ళిన సతీదేవి ని అక్కడ దక్షుడు కనీసం పలకరించడు. దక్షుడికి భయపడి అక్కడ ఉన్న వారు కూడా ఎవరూ పలకరించడు. దక్షుడు సతీదేవిని పలకరించకుండా ఉండటమే కాకుండా శివుడి ని నచ్చినట్టు కోపంతో నింద చేస్తూ ఉంటాడు. ఆ అవమానం తట్టుకోలేక శివ నిందని కూడా నేను భరించలేను అని చెప్పి యోగాగ్ని రగిల్చి అందులో పడి చనిపోతుంది. అది తెలిసిన పరమశివుడు భయంకరమైన కోపంతో ప్రచండమైన నాట్యం చేస్తూ తన జటాజూటాన్ని పెకిలించి నేల మీద కొట్టగానే భయంకరమైన ఆకారంతో వీరభధ్రుడు అవతరిస్తాడు. ఆ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి ఆ దక్షున్ని, ఆ యాగానికి వచ్చిన వారినీ నాశనం చేయ్యమని ఆదేశిస్తాడు. శివుని ఆదేశానుసారం వీరభధ్రుడు ఆగ్రహావేశంతో తన సైన్యాన్ని వెంటబెట్టుకుని ఆ యజ్ఞశాలను అక్కడికి వచ్చినవారిని వీరభధ్రుడు దండిస్తూ దక్షుని శిరస్సును ఖండిస్తాడు. పరమశివుడు సతీదేవి కాయాన్ని భుజాన వేసుకుని పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు. సృష్టి ఆగిపోతుంది. తన కర్తవ్యాన్ని వదిలి అలాగే తిరుగుతూ ఉండిపోతాడు. 

అప్పుడు దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని వేడుకుంటారు సృష్టి నాశనం అయిపోతుంది పరమశివుడు అలాగే ఉండిపోతే ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోతుంది మీరే ఈ సమస్యకు పరిష్కారం చేయండని అందరూ అడిగినప్పుడు. విష్ణుమూర్తి తన సుదర్శనచక్రంతో సతీదేవి కాయాన్ని ముక్కలుముక్కలుగా చేస్తాడు. ఆ అవయవాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి. అయితే ఆ శక్తిపీఠాలు ప్రపంచం అంతా కలిసి 108 అని, 51 అని 18 అని వ్యవహారంలో ఉన్నాయి. అందులో ముఖ్యమైన శక్తిపీఠాలు 18 గా వ్యవహారంలో ఉన్నాయి. వాటినే అష్టాదశశక్తిపీఠాలుగా మనందరికీ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. అవి

1. శ్రీలంక దేశం లో శాంకరీ దేవి

2. తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురంలో కామాక్షిదేవి

3. పశ్చిమబెంగాళ్  రాష్ట్రంలో కలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ప్రద్యమ్ననగరంలో శృంకలా దేవి

4. కర్ణాటక రాష్ట్రంలో మైసూరు (క్రౌంచపట్టణం) లో చాముండేశ్వరీదేవి

5. తెలంగాణా రాష్ట్రంలో అలంపురంలో జోగులాంబ

6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలం భ్రమరాంబికాదేవి (ఇక్కడే మళ్ళిఖార్జునిగా పరమశివుడు దర్శనం ఇస్తాడు. ఇది  ద్వాదశజ్యోతిర్లింగాలలో ఒకటి).

7. మహారాష్ట్ర రాష్ట్రంలో కౌల్హాపురంలో మహాలక్ష్మి

8. మహారాష్ట్ర రాష్ట్రంలో నాందేడ్ జిల్లాలో మహార్ (మహూర్యే) ఏకవీరీకా దేవి

9. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినీలో మహంకాళిదేవి (ఇక్కడ మహాకాళేశ్వరుడిగా శివుడు దర్శనం ఇస్తాడు. ఇది  ద్వాదశజ్యోతిర్లింగాలలో ఒకటి) 

10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురంలో పురుహూతికాదేవి.

11. ఒరిస్సా రాష్ట్రంలో జాజ్ పూర్ ఓడ్యా గిరిజాదేవి

12. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షారామం (ద్రాక్షారామం)లో మాణిక్యాంబా. (ఇక్కడే దక్షుడు యాగం చేయటానికి పూనుకుని తల తెగిపడిన స్థలం కనుక దీనికి దక్షారామం గా పేరువచ్చింది. కాలక్రమంలో ద్రాక్షారామంగా వ్యవరించబడుతుంది)

13. అసోం రాష్ట్రంలో గౌహతి (హరిక్షేత్రం) కామరూపి

14. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లో ప్రయాగ లో మాధవేశ్వరీ

15. హిమచల్ ప్రదేశ్ రాష్ట్రంలో లో కాంగ్రా వద్ద జ్వాలాక్షేత్రం లో వైష్ణవీదేవి

16. బీహారు రాష్ట్రంలో గయా లో మాంగళ్యగౌరీదేవి

17. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి (కాశీక్షేత్రం) విశాలాక్షీదేవి. ( ఇక్కడ ద్వాదశజ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వనాథుడు దర్శనం ఇస్తాడు.)

18. జమ్మూకాశ్మీర్ లో సరస్వతీ దేవి (ఇక్కడ అమ్మవారిని ఖీర్ భవానీ అని అంటారు.)

కొత్తది పాతది