శ్రీశైలం భ్రమరాంబికాదేవి |
అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవది అయిన భ్రమరాంబికా దేవి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైల క్షేత్రంలో ఉంది. సతీదేవి మెడ పడిన ప్రాంతం. పూర్వ కాలంలో అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రి మంత్ర జపంతో బ్రహ్మ గురించి తపస్సు చేసి చావులేని వరాన్ని ఇమ్మంటాడు. మరణం అనేది అందరికీ సమానమే ఎవ్వరూ శాస్వతంగా ఉండిపోకూడదు అది ధర్మవిరుద్ధం అని అరుణాసురుడి కి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు బ్రహ్మ. అయినా వినకుండా రెండు కాళ్ళు, నాలుగు కాళ్ళు ఉన్నవాళ్ళు నన్ను చంపకుండా వరం ఇమ్మని కోరుకుంటాడు. దానికి చెసేదేం లేక బ్రహ్మ వరం ఇస్తారు. ఆ వర గర్వంతో దేవతలను, ఋషులను, ప్రపంచాన్ని బాధలుపెట్టడం ప్రారంభిస్తాడు. అప్పుడు వారందరూ కలిసి అమ్మవారికి వారి భాదలు మొరపెట్టుకుంటారు. దానికి అమ్మవారు ఆ రాక్షసుడు గాయత్రి దేవిని వాడు ఎల్లవేళలా పూజచేస్తుంటాడు. ఆ పూజ ఫలితం వల్ల వాడిని ఎవ్వరూ ఏమీ చేయ్యలేరు. వాడు గాయత్రీ దేవిని పూజ చేయనీయకుండా చేస్తే వాడికి ఆ శక్తి నశిస్తుంది అప్పుడు ఆ అరుణాసురుడ్ని నేను నాశనం చేస్తానని అమ్మవారు దేవతలతో చెప్తారు. అప్పడు దేవతలందరూ కలిసి ఓ ఉపాయం ఆలోచించి, దేవతల గురువు అయిన బృహస్పతి అరుణాసురుడి దగ్గరుకు వెళ్ళి నీవు గాయత్రిదేవిని ఎలా పూజిస్తున్నావో అలాగే దేవతలు కూడా గాయత్రిదేవిని పూజిస్తుంటారు అని చెప్తారు. దానికి అరుణాసురుడు ఛీ దేవతలు పూజించిన ఆ దేవినే నేను ఎందుకు పూజ చేయాలి అని వాడు గాయత్రీదేవిని పూజించడం మానేస్తాడు. అప్పుడు అమ్మవారు ఆరుకాళ్ళతో భ్రమరీ(తేనెటీగ) రూపం తీసుకుని అలాగే కొన్ని వేల భ్రమరములను సృష్టించి అరుణాసురుడ్ని, వాడి సైన్యాన్ని నాశనం చేసి లోకాలను కాపాడుతుంది. అప్పుడు అదే రూపంతో పరమశివుడు వెలసిన శ్రీశైలం మళ్లిఖార్జున స్వామి పూజిస్తుంది. అప్పుడు పరమశివుడు దేవీ నువ్వు ఇక్కడే బ్రమరాంబికాదేవి గా నివాసం చేసుకుని ఉండు అని చెప్పగానే ఎనిమిది చేతులతో, సిల్కు చీరతో అమ్మవారు భ్రమరాంబిక దేవి గా అక్కడ ఉండిపోతుంది. ఆ గర్భగుడిలో అగస్త్య మహర్షి అయిన లోపాముద్ర విగ్రహం కూడా ఉంటుంది. గర్భగుడి ముందు శ్రీచక్రం కూడా ప్రతిష్టించారు. ఈ శ్రీశైల క్షేత్రానికి శ్రీగిరి, సిరిగిరి, శ్రీపర్వతం, శ్రీనగం అనే పేర్లు కూడా ఉన్నాయి. కృతయుగంలో నరశింహస్వామి, త్రేతాయుగంలో సీతారాములు, ద్వాపరయుగంలో పాండవులు, ఎంతోమంది మహర్షులు, మునులు, రాజులు, గురవులు, భక్తులు మళ్లిఖార్జునస్వామిని, బ్రమరాంభికాదేవి ని దర్శించుకున్నారు.