శివతాండవం |
కొన్ని రోజుల తరువాత ఒక ఆవు ఆ పంట దగ్గరకి వచ్చి మేస్తుంటే గౌతమమహర్షి దానిని తరమడానికని ఒక దర్భను ఆవు మీదకు విసిరాడు. ఆ దర్భ ఆవుకి తగిలి అక్కడిక్కడే మరణించింది. పార్వతీదేవి స్నేహితురాలైన జయ ఆవు రూపంలో అక్కడకు వచ్చింది. గౌతమమహర్షికి గోహత్యా దోషం వచ్చింది. ఈ పాపం నుంచి బయటపడే మార్గాన్ని చెప్పమని ఆ ఋషులను అడిగాడు. వారు పరమశివుని కోసం తపస్సు చేసి గంగానది లో స్నానం చేస్తే గో హత్య పాపం పోతుందని చెప్పారు. గౌతమమహర్షి బ్రహ్మగిరి శిఖరం పై 1000 సంవత్సరములు తపస్సు చేసాడు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షం అయ్యి గంగను తనకు ఇచ్చాడు. కానీ గంగ పరమశివుని వదిలి వెళ్ళనని చెప్పడంతో పరమశివుడు ఆగ్రహంతో తాండవం చేసి తన జటను తీసి శిఖరం పై కొట్టగానే ఆ చర్యకు గంగ భయపడి బ్రహ్మగిరిపై కనిపించింది. తరువాత త్రయంబక తీర్థంలో దర్శనమిచ్చింది. అలా బలవంతంగా గంగను ఉంచినందుకు కోపంతో గౌతమమహర్షిని స్నానం చేయనియ్యకుండా అదృశ్యం అవుతుంది. గంగా తీర్థం, వరాహతీర్థం, రామలక్ష్మణ తీర్థం, గంగాసాగర్ లలో దర్శనమిచ్చినా గౌతముడు స్నానం చేయలేకపోతాడు. గౌతముడు మంత్రం ప్రయోగించి గడ్డితో చుట్టుముట్టి గంగ ప్రవాహాన్ని అక్కడే నిలిచిపోయేటట్టుగా చేసాడు. ఆ తీర్థానికే కుశావర్త అని పేరు వచ్చింది.
ఈ కుశావర్త తీర్థం నుండే గోదావరి నది సముద్రం వరకూ ప్రవహిస్తుంది. ఇక్కడే గౌతముడు గోవును చంపిన పాపం నుండి విముక్తుడయ్యాడు. గంగాదేవి గౌతముని పాపం నుండి విముక్తున్ని చేసిన తరువాత స్వర్గానికి బయలుదేరబోతే పరమశివుడు కలియుగం అయ్యేవరకూ గంగను భూమిపై ఉండమని ఆజ్ఞాపించాడు. గంగాదేవి కూడా శివుణ్ణి ప్రజల సంక్షేమార్థం తనతో పాటుగా అక్కడే ఉండవలసినదిగా కోరింది. శివుడు గంగాదేవి కోరికను మన్నించి, లోక కళ్యాణార్థం పార్వతీ దేవితో సహా తానే స్వయంగా త్రయంబకేశ్వరునిగా వెలిసాడు.