పునర్జన్మలేకుండా చేసే ఆలయం

 

శ్రీశైలం బంగారుగోపురం
మన సనాతన ధర్మంలో "శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే" అని అంటారు. శ్రీశైల శిఖరం దర్శనం చేసుకుంటే మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరం లేకుండా మోక్షాన్ని చేరుకోవచ్చు అని శాస్త్రం. చూడడం అంటే మామూలుగా చూస్తే సరిపోదు. అక్కడ ఉన్న నంది విగ్రహాన్ని రోలు ఆకారంలో ఉన్న దానిలో నవధాన్యాలు వేసి అటూఇటూ తిప్పుతూ దూరంగా ఉన్న ఆలయ శిఖరం వైపు చూసినప్పుడు ఆ శిఖరం గానీ కనిపిస్తే ఆ వ్యక్తి పునర్జన్మ నుండి విముక్తులవుతారు. పూర్వం వినాయకునికీ, కుమారస్వామికిీ వివాహ విషయం గురించి ఒక ముల్లోకాలు తిరిగి ఎవరైతే ముందు వస్తారో వారికి వివాహం చేస్తామన్నప్పుడు, కుమారస్వామి తన నెమలి వాహనం మీద వేగంగా వెళ్ళిపోతాడు. గణపతి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పరమశివుడు నారాయణ మంత్రాన్ని జపించమని చెప్తారు. గజాననుడు ఆ నారాయణ మంత్రాన్ని జపిస్తూ శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు. అక్కడ కుమారస్వామి నదీ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు తన అన్నయ్య అంతకుముందే వచ్చి వెళ్ళి తనకు ఎదురవుతాడు. ఆ విధంగా 33 కోట్ల తీర్థాలలో అలాగే కనిపిస్తాడు. తిరిగి కైలాసానికి వచ్చినప్పుడు అన్నయ్యకు సిద్థి, బుద్థిని ఇచ్చి వివాహం చేస్తారు. ఎక్కడికీ వెళ్ళలేదని ఇక్కడి నుండే అంతా చేసాడని తెలుసుకుని తను కోపించి అక్కడ నుండి వెళ్ళిపోయి క్రౌంచ పర్వతానికి వెళ్ళి ఉండిపోతాడు. అక్కడ ఉన్న ప్రదేశాన్నే కుమారబ్రహ్మచారి అని పేరు వచ్చింది. తన తల్లిదండ్రులు అయిన శివపార్వతులు, కుమారస్వామిని చూడటానికి వెళ్ళినప్పుడు కుమారస్వామి అక్కడ నుండి వెేరే చోటుకి వెళ్ళిపోతాడు. దేవతల కోరిక మేరకు శివపార్వతులు ఇద్దరూ అక్కడే ఉండిపోయారని ప్రసిద్థి. ఆ ప్రాంతమే ఇప్పుడు శ్రీశైలంగా వ్యవహిరించబడుతుంది. ఈ కథే కాకుండా శ్రీశైలం ఆలయ గోడలపై ఇంకో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. చంద్రావతి యువరాణిగా పుట్టి, తన రాజబోగాలు వదులుకొని తపస్సు చేయ నిశ్చయించుకుంటుంది. ఆమె కదలి వనంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఒక కపిల ఆవు చెట్టు దగ్గరకు వచ్చి తన పాలను నేల మీదకు వదలటం గమనిస్తుంది. అలా ప్రతీ రోజూ చేయడం చూస్తుంది. అప్పుడు ఆ యువరాణి అక్కడున్న నేలను తవ్వి చూడగానే అక్కడ ఒక శివలింగం కనబడుతుంది. ఆ శివలింగం చాలా ప్రకాశవంతంగా అగ్నిలో ఉన్నట్లు కనబడుతుంది. ఆ శివలింగాన్ని తీసి అక్కడే ఒక ఆలయాన్ని కట్టి అక్కడ దొరికే మల్లేపూవులతో రోజూ శివలింగాన్ని పూజ చేసేదని ఆ విధంగా మల్లిఖార్జునునిగా వ్యవవహింపబడుతున్నాడని అంటారు. ఇక్కడ శివలింగాన్ని పూజిస్తే అపారమైన సంపద, కీర్తి, ప్రతిష్ఠలు కలిగి ఆయురారోగ్యాలతో తులతూగుతారని భక్తుల నమ్మకం. పాతళగంగ, సాక్షిగణపతి, పాలదార-పంచదార, ఆదిశంకరులు తపస్సు చేసిన ప్రదేశం, హటకేశ్వరం, భీముని కొలను, కదళీవనం మొదలైనవి ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు. రామునిచే ప్రతిష్ఠించబడిన 1000 లింగాలు, పాండవులు ప్రతిష్ఠించిన 5 లింగాలు ఇక్కడ ఉంటాయు. అష్టాదశ శక్తి పీఠాలలో బ్రమరాంబికాదేవి ఇక్కడ మరొక ప్రసిద్థి. 

కొత్తది పాతది