పార్వతీదేవి కుంకుమతో తయారైన శివలింగం


పార్వతిదేవి
దక్షిణాన ఉన్న దేవగిరి పై సుధర్ముడు, సుదేహ అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. అనేక పూజలు, నైతిక కార్యక్రమాలు చేసేవారు. కానీ ఆ దంపతులకు సంతానం లేక బాధపడేవారు. ప్రత్యేకించి పొరుగువారు ఎత్తిపొడుపు మాటలు, మనసుకు నొప్పి కలిగించే మాటలు ఎక్కువగా బాధపడేవారు. తన భర్తను ఇంకొక పెళ్ళి చేసుకొమ్మని లేకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని సుదేహ పోరుపెట్టేది. ఇంక చేసేది లేక సుదేహ చెల్లి అయిన ఘుశ్మను పెళ్ళి చేసుకున్నాడు సుధర్ముడు. వివాహానికి ముందే వారిని చూసి ఈశ్ష్యపడనని వాగ్దానం చేస్తుంది. వివాహం అయిన తరువాత అక్కచెల్లెల్లిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. కొంతకాలానికి ఘుశ్మ తల్లి అయ్యి మగబిడ్డకు జన్మనిస్తుంది. రోజులు గడుస్తున్న కొద్ది సుదేహకు ఘుశ్మను తన బిడ్డను చూసి ఈశ్ష్య కలగటం ప్రారంభిస్తుంది. ఆ ఈశ్ష్యా, ద్వేషంతో సుదేహ, ఘుశ్మ నిద్రిస్తుండగా తన బిడ్డ ను తీసుకుపోయి, ఆ బిడ్డను చంపి ఆ కళేబరాన్ని దగ్గరలోని మడుగులో విసిరేస్తుంది.

మరునాడు ఉదయం, ఆ బాలుని హత్య కారణంగా కుటుంబం అంతా దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. తీవ్ర దుఃఖం లో కూడా ఘుశ్మ చాలా సాధారణంగా ఉండి, తన దైనందిన పూజా కార్యక్రమాల్ని ఆపకుండా చేస్తూ, ఆ చెరువు ఒడ్డుకు వెళ్ళి 100 శివలింగాల్ని చేసి వాటిని పూజించి, పూజానంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా చనిపోయిన తన కొడుకు ఆ చెరువు ఒడ్డున సజీవంగా కనిపించాడు. ఆమె ఎంతో సంతోషించింది. అంతలో శివుడు కూడా అక్కడ ప్రత్యక్షమై ఆమె కొడుకు హత్యా రహస్యాన్ని చెప్పి సుదేహను సంహరిస్తానని చెప్పాడు. కానీ ఘుశ్మ ఆమెను చంపవద్దని చేతులు జోడించి ప్రాదేయపడుతూ, తన సోదరి సుదేహ తప్పును క్షమించి వదిలిపెట్టమని వేడుకుంది. ఘుశ్మ ప్రజోపకారార్థం శివుణ్ణి అక్కడే ఉండి పోవలసినదిగా కోరింది. శివుడు ఆమె కోరికను అంగీకరించి ఘుష్మేశ్వర మహాదేవ అనే పేరుతో తన పార్థివ శివలింకంతో అక్కడే వెలిసాడు.

ఇంకో కథనం ప్రకారం ఒకనాడు శివుడు, పార్వతీ కామ్యక వనంలో విహరిస్తుండగా పార్వతీదేవికి దాహం వేసిందట. అప్పుడు పరమశివుడు పాతాళం నుండి భోగవతి నీటిని రప్పించి ఆమె దాహం తీర్చాడట. అది నీటి కొలనుగా మారి శివాలయ తీర్థంగా పేరు గాంచింది. పార్వతీ మాత తన పాపిటను అలంకరించుకోవటానికి కుంకుమ, కేసరిలను శివాలయ తీర్థంలో కలిపిందట, ఆమె చేతిలో ఉన్న కుంకుమతో శివలింగం తయారైందట. ఆ లింగం నుండి ఒక దివ్య జ్యోతి ఉద్భవించగా పార్వతీదేవి ఆ దివ్యజ్యోతి లింగాన్ని ఒక రాతి లింగం లో ఉంచి, లోకకళ్యాణం కోసం అక్కడ ప్రతిష్ఠించిదట. ఆనాటి నుండి ఆ జ్యోతిలింగాన్ని కుంకుమేశ్వరుడిగా పేరువచ్చింది. సాక్షాత్తూ పార్వతీమాత ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఆ జ్యోతిర్లింగానికి గొప్ప మహత్తు వచ్చిందటారు. ఈ ఆలయం మహారాష్ట్రలో ఔరంగబాద్ జిల్లాలో ఉంది. ఔరంగబాదు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం.

కొత్తది పాతది