|
రామేశ్వరుడు |
శ్రీరాముడు సీతాదేవి కోసం అన్వేషిస్తూ రామసేతు కట్టి లంకకు చేరి రావణాసురున్ని యుద్ధంలో హతమార్చినప్పుడు రామునికి బ్రహ్మహత్యాపాతకం అంటింది. దానినుండి తప్పుకోవడానికి శివలింగాన్ని ప్రతిష్ఠించాలని తలచి హనుమంతునికి కైలాసం నుండి శివలింగాన్ని తెమ్మవి ఆజ్ఞాపిస్తాడు. హనుమంతుడు కైలాసానికి వెళ్ళి శివలింగం తెచ్చే లోపు కాలాతీతం అయినందున సీతాదేవి అక్కడే ఉన్న ఇసుక తో ఒక చిన్న లింగాన్ని చేసి దానిని రామనాధేశ్వరునిగా ప్రతిష్ఠించాడు శ్రీరాముడు. ఇప్పుడు ఈ శివలింగమే గుడి గోపురంలో కొలవబడుతుందని భక్తుల నమ్మకం. హనుమంతుడు కైలాసం నుంచి తెచ్చిన శివలింగం విశ్వలింగం గా ప్రధానంగా ఈ విశ్వలింగాన్నే పూజించవలసినదిగా శ్రీరాముడు సూచించాడు. అదే ప్రకారంగా ఇప్పటికీ ఈ విశ్వలింగాన్నే ప్రధానంగా పూజిస్తుంటారు. గర్భగుడిలో ఈ రెండు శివలింగాలు పూజింపబడుతుంటాయి. ఈ ఆలయం తమిళనాడులో రామనాధపురం జిల్లా రామేశ్వరం లో ఉంది. ఈ ఆలయం 12 వ శతాబ్థంలో పాండ్యరాజుల కాలంలో విస్థరింపబడింది.
భారతదేశంలో తమిళనాడురాష్ట్రంలో రామేశ్వరం చుట్టూ గల ద్వీపాలలో 64 తీర్థాలు ఉన్నాయి. స్కాంధ పురాణం ప్రకారం వీటిలో 24 ముఖ్యమైనవి. వీటిలో 22 తీర్థాలు రామనాధస్వామి దేవాలయంలోనే ఉన్నాయి. 22 సంఖ్య రాముని యొక్క అమ్ములపొదిలో గల 22 బాణములను సూచిస్తుంది. వాటిలో ప్రదాన తీర్థం అగ్నితీర్థం. అదే బంగాళఖాతం. ఈ రామేశ్వర ఆలయానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. పవిత్ర హిందూ చార్ ధామ్ లలో భద్రీ, పూరీ, ద్వారక లతో పాటూ ఈ రామేశ్వరం కూడా ఒకటి. నాలుగు దిక్కులలో ఉన్న ఈ చార్ థామ్ లలో దక్షిణ దిక్కులో ఉన్న ఈ రామేశ్వరం ఆలయంలో గంగా నది తో పరమశివుని అభిషేకిస్తే మోక్షాన్ని పొందుతారని నమ్మకం. కొందరు భక్తులు కాశీ క్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్న గంగాజలాన్ని తీసుకువచ్చి రామేశ్వరాలయంలో స్వామికి అభిషేకం చేసి, రామేశ్వరం లో ఉన్న ఇసుకను తీసుకువెళ్ళి మళ్ళీ కాశీ గంగలో కలపటం ఒక గొప్ప పవిత్రమైన చర్యగా భావిస్తారు.