పరమశివుని త్రిశూలం పై ఉన్న నగరం


శివుని త్రిశూలం
భగవంతుడే స్వయంగా నిర్గుణం (రూపం లేని) నుంచి సగుణం (రూపు ఉన్న)గా, సగుణుడి నుంచి శివునిగా మారి, స్త్రీ, పురుషులుగా వేరు వేరు రూపాలు ధరించాడు. తరువాత ప్రకృతి పురుషుని ఉత్తమ సృష్టి చేయవలసినదిగా శివుడు బ్రహ్మను కోరి, దీని గురించి ప్రకృతి పురుషుని తపస్సు చేయమని ఆదేశించాడు. ప్రకృతి పురుషుడు తపస్సు చేయడానికి మంచి ఆరాధనా స్థలాన్ని ఇవ్వమని అడుగగా, నిర్గుణుడైన శివుడు ప్రకాశంతో వెలిగిపోతున్న పంచకోషి అనే ఆరాధనా స్థలాన్ని సృష్టించాడు.

శివుని గురించి విష్ణుమూర్తి కూడా ఇదే ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేస్తుండగా, అనేక జలధారలు ప్రతక్షమయ్యాయి. ఈ అధ్భుతాన్ని చూసి విష్ణుమూర్తి తన తలను ఆ నీటిలో ముంచగా తన చెవి నుంచి మణి ఒకటి జారి పడిపోయింది. ఆ రోజు నుండి ఆ ప్రాంతానికి మణికర్ణిక తీర్థం అనే పేరు వచ్చింది. ఆ 500 గజాల జల ప్రాంతం శివుని త్రిశూలం పై ఉంటుంది. అందులోనే విష్ణు భగవానుడు, ఆయన భార్య లక్ష్మీదేవి నిద్రించారు. శివాజ్ఞతోనే తన కమలం నుంచి విష్ణుమూర్తి, బ్రహ్మదేవుళ్ళు జనించారు. అనంతరం బ్రహ్మదేవుడు శివుని ఆజ్ఞమేరకు 50 కోట్ల యోజనాలు, 14 లోకాలుగా ఈ సర్వజగత్తును సృష్టించాడు. కర్మ బంధానాలతో ముక్తిని పొందటానికే శివుడు ఈ పంచకోషి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఉంచాడు. శివుడు స్వయంగా తానే ఆ ప్రాంతాన్ని వదలటానికి లేకుండా తన జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించాడు. కొంతకాలం తరువాత ఈ నగరం కాశీగా శివునిచే భూలోకంలో స్థాపించబడింది. బ్రహ్మదేవుని పని అయిన తరువాత కూడా కాశీ నశించిపోదు, కానీ ప్రళయం సంభవించినప్పుడు మాత్రం శివుడు తన త్రిశూలంపైన ఈ నగరాన్ని ఉంచి వినాశనం కలగకుండా కాపాడతాడు.

అందవల్లనే కాశీలోని అవిముక్తేశ్వర లింగం ఎల్లప్పుడూ విరాజిల్లుతూనే ఉంటుంది. ఎక్కడా ముక్తి పొందలేని వారు కాశీలో ముక్తి పొందగలరు. గొప్ప ధార్మిక పుణ్యక్ష్తేత్రమైన పంచకోషి సకల పాపాలను హరిస్తుంది. అందువల్లనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వురులు, దేవతలంతా తమ తనువు ఈ ప్రదేశంలోనే చాలించాలని కోరుకుంటారు. రుద్రుని కోరికమేరకు శివపార్వతులు ఇక్కడనే స్థిరంగా ఉండిపోయారు.మోక్షాన్ని కలిగించే ఏడు నగరాలలో కాశీ క్షేత్రం ముఖ్యమైనది. ఈ క్షేత్రంలో పరమశివుడు విశ్వనాధుడిగా పూజలు అందుకుంటున్నాడు. ద్వాదశ జ్యోతర్లింగాలలో ఒకటి అయిన కాశీ క్షేత్రంలో గంగా నది ప్రవహిస్తుంది. ఈ కాశీక్షేత్రాన్నే వారణాసి గా కూడా పిలుస్తారు. వరుణ, అసి అనే రెండు నదులు ఈ క్షేత్రం వచ్చి గంగానదిలో కలవటం వల్ల వారణాసిగా పేరు వచ్చిందంటారు. ఈ క్షేత్రంలో ముఖ్యమైనని స్నాన ఘట్టాలు. గంగా నదీతీరం అంతా ఎన్నో స్నానఘట్టాలు ఉన్నాయి. దశాశ్వమేధ ఘాట్, మణికర్ణిక ఘాట్, సిండియా ఘాట్, మన మందిర్ ఘాట్, అస్సీ ఘాట్, లలిత ఘాట్ ఇలా చాలా స్నాన ఘాట్ లు ఉన్నాయి. ముఖ్యంగా భక్తులంతా మణికర్ణిక ఘాట్ లోనే గంగలో స్నానాలు చేస్తారు. ఈ క్షేత్రం హిందువులకే కాకుండా బౌద్థులకు, జైనులకు కూడా పుణ్యక్షేత్రంగా ఉంటుంది. ఈ క్షేత్రంలో సతీదేవి చెవిపోగు పడి కాశీ విశాలాక్షిగా కొలువై ఉంటుంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి ఈ కాశీ విశాలాక్షి. అంతేకాకుండా ఇక్కడ అన్నపూర్ణేశ్వరీ దేవిగా కూడా అమ్మవారు పూజలందుకుంటున్నారు. ఈ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారి అయినా దర్శించి గంగా నదీ స్నానం చేసి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్ష స్థితికి చేరుకోవాలని ప్రతీ భక్తుడు కోరుకుంటాడు. 

కొత్తది పాతది