|
మహాకాళేశ్వరుడు |
ఒకానొకనాడు అవంతిక పట్టణంలో వేదప్రియుడు అనే ఒక బ్రాహ్మణుడు తన కుమారులైన దేవప్రియుడు, ప్రియమేదుడు, సుక్రుతుడు, ధర్మవాహి నలుగురు కుమారులతో కలిసి నిత్యం శివారాధన చేస్తుండేవారు. వారు పూజ చేయడం వల్ల ఆ నగరం, ప్రజలు అంతా సుఖసంతోషాలతో ఉండేవారు. అక్కడే రత్నమాల పర్వతం పైన ధూషణుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు ధర్మాన్ని ధ్వేషించి ఆ నగరంలో ఉండే బ్రాహ్మణులను, పూజ చేసే భక్తులను బాధించడం మొదలుపెట్టాడు. వారి పూజలను చేయనివ్వకుండా చేస్తూ ఉండేవాడు. అయినా వేదప్రియుడు వారు కుమారులు కలిసి ఎలా అయినా పూజ ఆపకుండా నిత్యం చేస్తూ ఉండేవారు. ధూషణుడు ఆ వేదప్రియుని దగ్గరకు వచ్చి వారిని బాధిస్తున్నప్పుడు కొలను లో నుంచి పరమేశ్వరుడు వచ్చి ఆ ధూషణుడినీ వాడి సైన్యాన్ని భస్మం చేసాడు. శివుడు ఆ బ్రాహ్మణ కుటుంబమును, భక్తులను వరం కోరుకొమ్మని అడుగగా వారు అందరూ స్వామిని అక్కడే జ్యోతిర్లింగ రూపంగా నివసించమని కోరటం వల్ల పరమేశ్వరుడు వారందరి కోరిక మేరకూ ఆ స్థలం లోనే జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. ఆ అవంతికా పట్టణమే ఇప్పుడు వ్యవహారంలో ఉజ్జయినీ గా మారింది. ఆ పరమేశ్వరుని రూపమే మహాకాళేశ్వరుని గా ఆవిర్భవించాడు. ఈ క్షేత్రంలో శివలింగాలు మూడు అంతస్థులలో ఉండడం విశేషం. మొదటి అంతస్థులో మహాకాళేశ్వరునిగా, రెండవ దానిలో ఓంకారేశ్వరునిగా, మూడవ దానిలో నాగచంద్రేశ్వరునిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. నాగచంద్రేశ్వర లింగాన్ని నాగపంచమి రోజున మాత్రమే దర్శనం చేసుకోగలం. ఇక్కడ మహాకాళేశ్వరుడు ఉన్న ప్రాంతం క్రింద శంఖుయంత్రం ఉంటుంది. దీనికి గుర్తు గానే ఇక్కడ శంఖాన్ని ఊదుతారు.
ఈ ఆలయం లో ప్రత్యేకత ఏంటంటే స్వామి వారికి ఇక్కడ భస్మహారతి విశిష్టంగా జరుగుతుంది. స్వామి వారికి భస్మహారతి ఇస్తూ శంఖాలు ఊదుతూ, ఢమరుకం వాయిస్తూ, హరహర మహాదేవ అనే నినాదానలతో ఆ ప్రాంతం అంతా ఒక పెద్ద జాతరగా మారిపోతుంది. ఆ సంఘటన మన జీవితంలో ఒక్కసారి అయినా చూడాలి. బ్రహ్మదేవుడు కూడా భస్మహారతితో స్వామి వారిని పూజ చేసాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ క్షేత్రానికి మహాస్మశానం అని పేరు. క్షిప్రానది ఇక్కడే ప్రవహిస్తుంది. ఈ నదీ స్నానం చేసి మహాకాళేశ్వరుని దర్శంచుకుంటే సర్వ పాపములు పటాపంచలు అవుతాయని భక్తుల నమ్మకం. ఈ ఉజ్జయినీ క్షేత్రంలో అమ్మవారు మహంకాళి మాతగా దర్శనం ఇస్తారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఇది కూడా ఒకటి. మోక్షాన్ని ఇచ్చే ఏడు నగరాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి. ఈ ఉజ్జయినీ నగరంలోనే శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు తమ గురువు అయిన సాంధీపముని దగ్గర విద్యను నేర్చుకున్నారు. ఇక్కడే సాంధీపముని ఆశ్రమం ఉంది. ఇక్కడే కాలభైరవుని ఆలయం కూడా ఉంది. అక్కడ మద్యాన్ని కాలభైరవునికి ప్రసాదంగా ఇస్తారు.