ఒకానొక సమయంలో లంకాపతి అయిన రావణుడు కైలాసానికి వెళ్ళి అక్కడ శివుని కోసం కఠోర తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ తపస్సు చేసే సమయంలో ఎండా, వానా, చలి, ఆకలి దప్పికలు తెలియకుండా వాటన్నిటినీ భరిస్తూ తపస్సు చేసిన కూడా శివుడు ప్రత్యక్షం అవ్వలేదు. దానితో రావణాసురుడు తన పది తలలను ఒక్కొక్కటి గా నరికి శివలింగానికి అర్పించటం ప్రారంభించాడు. అలా తన 9 తలలు నరికి అర్పించి పదవ తల నరకపోతుంటే పరమశివుడు ప్రత్యక్షం అయ్యి తన చర్యను ఆపి గాయపడిన రావణున్ని నయం చేసాడు. తిరిగి రావణుని తలలను ఇచ్చి వరం కోరుకొమ్మని అడిగాడు పరమశివుడు. అందుకు రావణుడు మీ ఆత్మలింగం కావాలని ఆ ఆత్మలింగం లంకలో ప్రతిష్టిస్తానని చెప్పాడు. పరమశివుడు రావణుని కోరికను మన్నించి ఆత్మలింగాన్ని ఇచ్చి మధ్యలో ఎక్కడా వదలకూడదని వదిలితే అక్కడే ప్రతిష్ఠించబడిపోతుంది అని షరతు పెడతాడు శివుడు. సరే అని రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని లంకకు బయలుదేరతాడు.పరమశివుడు
పరమశివుడు కైలాసాన్ని వదిలి రావణునితో లంకకు వెళ్ళిపోతున్నాడని తెలిసిన దేవతలు అందరూ కలిసి విష్ణుమూర్తిని దర్శించి మీరే ఎలాగైనా రావణుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకుని వెళ్ళనివ్వకుండా చెయ్యమని కోరారు. విష్ణువు తనలీలతో రావణాసురుని కడుపులో కదలిక ఏర్పరచి కాలకృత్యము తీర్చుకునే పరిస్థితి వచ్చేటట్లు చేసారు. రావణాసురుడు అప్పుడు ఆ ఆత్మలింగాన్ని అక్కడే ఉన్న గొర్రెలకాపరికి ఇచ్చి తన లఘుశంక తీర్చుకోవడనికి వెళ్తాడు. ఆ గొర్రెలకాపరి ఆత్మ లింగం బరువును మోయలేక అక్కడే నేలమీద పెట్టి వెళ్ళిపోతాడు. రావణుడు వచ్చి ఆ ఆత్మిలింగాన్ని మళ్ళీ తీయడానికి ప్రయత్నించి విఫలుడవుతాడు. ఇంక చేసేదేం లేక ఇది దేవతల పని అని గ్రహించి అక్కడే పూజలు చేస్తాడు. అదే ఇప్పుడు దేవఘర్ గా పిలవబడుతుంది. అక్కడ పరమశివున్ని బైధ్యనాథ్ గా వ్యవహరిస్తారు. ఈ క్షేత్రం జార్ఖంట్ రాష్ట్రంలో ఉంది.