పదహారు సార్లు దాడిచేసినా మళ్ళీ నిలబడిన మహాపుణ్యక్షేత్రం


 
somanath alayam
సోమనాధ ఆలయం
పదహారుసార్లు దండయాత్ర చేయబడి అరబ్బులు, గజనీ మహమ్మద్, అల్లాఉద్దీన్ ఖిల్జీల ద్వారా పడగొట్టబడి, మహమ్మద్ బేక్తా అనేవాడి చేత శివలింగాన్ని ముక్కలు చేయించి అక్కడ మసీదు నెలకొల్పబడినా మళ్ళీ అన్ని సార్లు ఆలయనిర్మాణం చేయబడిన మహాపుణ్యక్షేత్రం, ద్వాదశజ్యోతిర్లింగాలలో మొట్టమొదటి క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో, సౌరాష్ట్రలో ఉన్న పరమశివుని ఆలయం "సోమనాథక్షేత్రం". స్థలపురాణం ప్రకారం చంద్రుడు కి దక్షుడు తన 27 మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేస్తే, అందులో ఉన్న రోహిణి తో మాత్రమే ఉంటూ మిగతావాళ్ళని పట్టించుకోవటం లేదని వాళ్ళ తండ్రికి చెప్తే దక్షుడు, చంద్రున్ని క్షయవ్యాధి తో బాధపడమని శపిస్తాడు. అప్పుడు చంద్రుడు ఆ శాపం నుండి తప్పుకోవడానికి ఇక్కడి కి వచ్చి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేస్తుంటాడు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై అందరి భార్యలను సమానంగా చూసుకొమ్మని చెప్పి తన వ్యాధినుండి కొంత ఉపశమనం కలిగిస్తాడు. ఇక్కడే సోమనాథునిగా ఉంటానని చంద్రునికి మాట ఇస్తాడు. ఈ క్షేత్రాన్నే ప్రభాసతీర్థం అని కూడా అంటారు. ఇక్కడ శివలింగం క్రిందభాగంలో ఎటువంటి ఆధారం లేకుండా గాలిలో ఉంటుంది. ముందుగా చంద్రుడు ఈ ఆలయాన్ని బంగారంతోనూ, తరువాత రావణాసురుడు వెండి తోనూ, తరువాత శ్రీకృష్ణుడు కొయ్యతోనూ కట్టారని ప్రతీతి. భీముడు రాతితోనూ పునర్నిర్మించారని చెబుతారు. యాదవ రాజైన వల్లభాయి, గుర్జరా ప్రతిహరా రాజైన నాగబటా, మాళ్వారాజైన భోజి, చోళంకి రాజు భీందేవ్, సోరాష్ట్రరాజైన మహాపాదావ, ఇలా చాలామంది రాజులు ఈ ఆలయాన్ని ఎన్నిసార్లు విధ్వంసం చేసినా మళ్ళీ పునర్నిర్మించారు. ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ రాళ్ళతోనే ఇక్కడ మసీదు కట్టాడు. పూనా పేష్వా, నాగపూర్ కు చెందిన బోన్ స్లే, ఖోలాపూర్ కు చెందిన ఛత్రపతి భోన్ స్లే, ఇండోర్ కు చెందిన హౌల్కార్ రాణి అహల్యాబాయి, గ్వాలియర్ కు చెందిన శ్రీమంత్ పతిభువా వీల్లందరూ కలిసి ఆ మసీదును తరలించి, అక్కడ మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసారు. భారత స్వాతంత్య్రానంతరం సర్దార్ వల్లభాయి పటేల్ అధ్యక్షతన అక్కడ ప్రజలందరి ధన సహాయంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించబడింది. ఇక్కడే హిరణ్, కపిల, సరస్వతీ నదుల త్రివేణి సంగమంగా కూడా ఈ క్షేత్రం ప్రసిద్థికెక్కింది. ద్వాదశజ్యోతిర్లింగాల దర్శన యాత్రకు బయలుదేరిన భక్తులు ఈ క్షేత్రం మొట్టమొదట చూసి ఇక్కడ నుండి బయలుదేరతారు. ఓం నమఃశివాయ....

కొత్తది పాతది