దసరా నవరాత్రులు ఎనిమిదవరోజు మహాగౌరిదేవి

 


        శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః

మహాగౌరి శుభం దధ్యాత్ మహాదేవప్రమోదదా


నవరాత్రులలో ఎనిమిదవ రోజు అయిన ఆశ్వీయుజ శుద్ధ అష్టమి నాడు దుర్గాదేవిని మహాగౌరి అవతారం లో పూజిస్తారు. చీకటి తరువాత వెలుగు వచ్చినట్టుగా, రాత్రి తరువాత పగలు వచ్చినట్టుగా, నల్లని రూపంతో ఉన్న కాళరాత్రి అవతారం తరువాత వచ్చిన తెల్లని రూపంతో ఉన్న అవతారం మహాగౌరి. అమ్మవారు గౌరవర్ణం అంటే తెల్లని రంగు కలిగి ఉన్న స్వరూపం కాబట్టి అమ్మవారిని మహాగౌరి అని పిలుస్తారు. పార్వతీదేవి శివున్ని వివాహం చేసుకోవాలని కొన్ని వేల సంవత్సరాలు ఘోరతపస్సు చేసింది. ఆ తపస్సు చేయడం లో అమ్మవారి చర్మంపై దుమ్ము,దూళి పేరుకుపోయి నల్లగా మారింది. తరువాత శివుడు పార్వతీ దేవిని వివాహం చేసుకోవాలని నిశ్ఛయించుకున్నప్పుడు అమ్మవారి శరీరానికి ఉన్న ధూళిని కడగటానికి గంగానది పవిత్ర జలం ఉపయోగించబడింది. ఆ కారణంగా అమ్మవారి చర్మం తెల్లగా మారి మహాగౌరిగా పేరు తెచ్చుకుంది. ఈ అమ్మవారికే శ్వేతాంబరధరా, బ్రిసృధ, చతుర్భుజి, శాంభవి అనే పేర్లు కూడా ఉన్నాయి. తెల్లటి ఎద్దు వాహనంగా చేసుకుని అభయముద్ర, వరదముద్రలతో, ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరుకం కలిగి నాలుగు చేతులతో ఉంటుంది అమ్మవారి స్వరూపం. గిరి అంటే పర్వతం ఆ పర్వతం యొక్క కూతురు కనుక గౌరి అంటారు అని మరొక కధనం. మహాగౌరి ఆదిశక్తి యొక్క అత్యంత అందమైన మరియు నిర్మలమైన రూపం. ఆమె అందానికి ప్రతీక. ఎవరైనా దేవతను ఆరాధిస్తే, ఆమె ఆ కోరికలు నెరవేరుస్తుంది. ఈ ప్రపంచంలో అన్ని చెడు శక్తుల నుండి అమ్మవారు తన భక్తులను రక్షిస్తుంది. వారణాసి లోని కాశీవిశ్వనాధ ఆలయంలో ఉండే అన్నపూర్ణాదేవి ఆలయాన్ని మహాగౌరి ఆలయం అని కూడా అంటారు. ఇది నవరాత్రులలో ఎనిమిదవ రోజు మహాగౌరి అవతార విశేషాలు.

కొత్తది పాతది