వామపాదోల్లసత్ లోహలతాకంటక భూషణా
వర్ధనామూర్ధజా కృష్ణా కాళరాత్రి భయంకరీ
నవరాత్రులలో ఏడవ రోజు అయిన ఆశ్వీయుజ శుద్ధ సప్తమినాడు దుర్గాదేవిని కాళరాత్రి స్వరూపంతో పూజలు చేస్తారు. కాళరాత్రి స్వరూపం చూడటానికి భయంకరంగా ఉన్నా ఆమె సర్వసుభాలను కలిగిస్తుంది. అందుకే ఈ అమ్మవారికి శుభంకరీ అనే పేరు కూడా ఉంది. ఒక చేతిలో ఖఢ్గం, మరొక చేతిలో ఇనుప ఆయుధం, ఒక చేయి వరదముద్ర, మరో చేయి అభయముద్రలతో గాడిద వాహనం పై ఉండి త్రినేత్రములతో శరీరం నళ్ళని ఆకారంతో ఉంటుంది ఈ స్వరూపం. ఈ అమ్మవారిని ఉపాసిస్తే భూత, ప్రేత, పిశాచాలు నుండి భయం పోతుంది. గ్రహబాధలు తొలగిపోతాయి. అగ్ని, జలము, జంతువులు, భయముగాని, శత్రువుల భయం ఏవి ఉండవు. యుద్ధంలో రాక్షసుల దాడిని ఎదుర్కొన్నప్పుడు అమ్మవారి బంగారు రంగు చర్మం పోయి భీకర రూపంతో నల్లగా ఆవిర్భవించిన అవతారం కాళరాత్రి అమ్మవారి అవతారం. శని గ్రహాన్ని కాళరాత్రి దేవి పాలిస్తుందని, ఈ అమ్మవారిని ఆరాధిస్తే జాతకంలో శని గ్రహం ప్రభావం వల్ల ఏర్పడే ప్రతికూల పరిస్థితుల నుండి కాపాడి సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తుందని అమ్మవారిని కాళరాత్రి స్వరూపంలో పూజలు చేస్తారు. కాత్యాయనీ దేవి శుంభ,నిశుంబులతో యుద్ధం చేసే సమయంలో రక్తబీజ అనే రాక్షసుడు ఘోర యుద్ధం చేస్తుంటాడు. వాడి రక్తం చుక్క కింద పడితే అందులో నుండి ఇంకొక రాక్షసుడు పుట్టాలి అనే వరం ఉంటుంది ఆ రాక్షసుడికి. అప్పుడు అమ్మవారు కాళరాత్రి అవతారం లో ఆ రక్తబీజ రాక్షసుడితో యుద్ధం చేస్తూ వాడి రక్తాన్ని కిందపడనివ్వకుండా అమ్మవారు తాగేస్తుంది. ఆ అమ్మవారి రూపాన్ని, భీకరయుద్ధాన్ని చూసి లోకం అంతా భయంతో వణికిపోతుంటారు. దేవతలు అందరూ కలిసి కాళరాత్రిని శాంతింపచేయమని శివున్ని వేడుకుంటారు. అప్పుడు శివుడు ఆ యుద్ధంక్షేత్రానికి వెళ్ళి అక్కడ అమ్మవారి పాదాల కిందకి రావడానికి చూస్తాడు. యుద్ధం చేస్తూ కాళరాత్రిదేవి శివున్ని పాదాలతో మడుతుంది. అది చూసి అమ్మవారు తన భర్తను పాదాల క్రింద చూసేసరికి ఒక్కసారి ఆగిపోయి, నాలుక కొరుక్కొని అపరాద భావనతో యుద్ధం సంగతి మరచిపోయి శాంతిస్తుంది. అందుకే కాళరాత్రి స్వరూపం చిత్రం చూస్తే పాదాల క్రింద శివుడు ఉంటారు. అమ్మవారిని శాంతించడానికి అలా శివుడు చేస్తాడు. ఈ కాళరాత్రి అమ్మవారిని పూజిస్తే గ్రహదోషాలు, భూత, ప్రేత, పిశాచ భయాలు, శత్రువుల భయం అన్నీ పోయి ప్రశాంతంగా ఉంటుంది.