చంద్రఘంటః
పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా
ప్రసాదం తనుతే మహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా
నవదుర్గలలో మూ డవ అవతారం చంద్రఘంటాదేవి. ఆశ్వీయుజ శుద్ధ తదియ నాడు దుర్గాదేవిని చంధ్రఘంటాదేవిగా ఆరాధించి పూజలు చేస్తారు. చంద్రఘంటా దేవినే చండికా, రణచండీ అని కూడా పిలుస్తారు. చంద్రఘంటా అంటే అర్థచంద్రాకారంతో, గంట కలిగి ఉన్నది అని అర్థం. చంద్రఘంటాదేవి ధైర్యానికీ, శక్తికీ, తేజస్సుకూ ప్రతీక. ఆమె తన తేజస్సుతో పూజింజినవారి పాపాలు, ఈతి బాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు దూరం చేస్తుంది. చంద్రఘంటాదేవి పది చేతులతో ఉంటుంది రెండు చేతులు అభయముద్ర, వరద ముద్ర తో ఉండి ఒక చేతిలో త్రిశూలం, ఒక దానిలో గద, ఒక చేతిలో ధనస్సు, ఇంకో చేతిలో బాణం, మరో చేతిలో ఖఢ్గం, ఇంకో చేతిలో కమండలం ఉంటాయి, మరో చేతిలో అక్షమాల, మరోచేతలో కమలం పట్టుకుని ఉంటుంది. సింహం లేదా పులి వాహనం పై కూర్చొని ఉంటుంది. అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు చేతిలోని ఘంట భీకరమైన శబ్థం చేసిందట, కొందరు రాక్షసులు ఆ ఘంటనినాదం కే గుండెలు పగిలి చనిపోయేవారు. అసలు ఈ అవతారం ఎలా వచ్చిందంటే! పరమశివుడు, పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పకున్న తరువాత, పార్వతీదేవి తల్లి దండ్రులయిన మేనకాదేవి, హిమవంతులు వారి వివాహ ఏర్పాట్లుచేస్తారు. పెళ్ళిరోజున శివుడు తన గణాలతో, శ్మశానంలో తనతో ఉండే భూత, ప్రేత, పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడు. వారందరినీ చూసి మేనకా దేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునకు కనిపించి, అందరూ నీ రూపాన్ని చూసి భయపడుతున్నారు కనుక వేషం మార్చమని కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని రూపంతో, దేవతలు, మునులతో కలిసి వస్తాడు. ఆ రూపాన్నిచూసి పార్వతీదేవి కుంటుంబసభ్యులు మేనకా, హిమవంతులు శివున్ని ఆహ్వానిస్తారు. తరువాత శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి చంద్రఘంటా అవతారం ఎత్తింది. శివ, పార్వతుల కుమార్తె కౌషికి గా దుర్గాదేవి జన్నించింది. శుంభ, నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థిస్తారు. ఆమె యుద్ధం చేస్తుండగా, ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు. శుంభుడు తన తమ్ముడయిన నిశుంభునికి కౌషికిని ఇచ్చి వివాహం చేయాలని కోరుకుని ధూమ్రలోచనుణ్ణి ఆమెను ఎత్తుకురమ్మని పంపిస్తాడు. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి, తన పరివారాన్ని సంహరిస్తుంది. తరువాత శుంభ, నిశుంభులను కూడా సంహరిస్తుంది. అలా రెండుసార్లు చంద్రఘంటదేవి అవతారం ఎత్తుతుంది అమ్మవారు. అందుకే చంద్రఘంటదేవి అమ్మవారిని పూజిస్తే, పాపాలు ఈతిబాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు పోయి ధైర్యం, శక్తి, తేజస్సు లభిస్తాయి అని భక్తుల విశ్వాసం.