శివుడినే మెప్పించిన భక్తుడు

 తన భక్తితో సాక్షాత్తూ పరమశివుడినే తన దగ్గరకు రప్పించుకుని చావులేని వరం పొందిన వాడు. చంధ్రశేఖరాష్టకం, మహామృత్యుంజయ మత్రం రచించిన మహాపురుషుడు. మృకండు మహర్షికీ, మరుద్వతికీ పరమశివుని వరంతో పుట్టినవాడు "మార్కండేయమహర్షి". పిల్లలు లేని మృకండు మహర్షి ఆయన భార్యతో కలిసి కాశీక్షేత్రానికి చేరి శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్యపూజలు చేస్తుంటారు. ఒకనాడు వారి భక్తికి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వారిని పరిక్షించదలచి కేవలం 16 ఏళ్ళు మాత్రమే బ్రతకగలిగిన మంచివాడు కావాలా లేక చిరాయువు కలిగిన చెడ్డవాడు కావాలా అని అడిగితే స్వామి ఆయుష్షు లేక పోయినా ఫరవాలేదు మాకు మంచివాడైన పుత్రుణ్నే ప్రసాధించమని కోరుకుంటారు. అలాగే కానీ అని వరం ఇస్తాడు పరమశివుడు. కొంతకాలానికి మగబిడ్డని ప్రసవిస్తుంది మరుద్వతి. మృకండు మహర్షి కొడుకు కాబట్టి ఆయనకు మార్కండేయుడు అని నామకరణం చేస్తారు. 7 సంవత్సరముల రెండునెలలు నిండగానే మార్కండేయునికి ఉపనయనం చేస్తారు. సప్తర్షులు మార్కండేయుని ధీర్షాయుష్మంతుడవుతాడని ఆశీర్వదిస్తారు. మృకండు మహర్షి నిజంగానే నాబిడ్డ ఆయుర్ధాయం కలుగుతుందా అని అడగగానే వారికి శివుడు చెప్పిన మాట తెలుస్తుంది. వారు మార్కండేయుడ్ని బ్రహ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళి చెప్తే బ్రహ్మ దేవుడు మార్కండేయున్ని శివారాధన చేయమనిచెప్పి ఆయన కూడా పరమశివున్ని వేడుకుంటారు. సమయం రానే వచ్చింది. మార్కండేయుని తేజస్సు చూసి యమభటులు తన ప్రాణాన్ని తీయడానికి భయపడితే ఆ యముడే వచ్చి మార్కండేయుని ప్రాణాలను తీయడానికి తన యమపాశాన్ని మార్కండేయుని మెడపైకి విసురుతాడు. అప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని హత్తుకుని ఉంటాడు. ఆ యమపాశం శివలింగం చుట్టుకుని ఉంటుంది. మార్కండేయుడు రక్షించమని పరమశివున్ని వేడుకున్నప్పుడు ఆ భక్తిని చూసి పరమశివుడు వచ్చి యమధర్మరాజు గుండెలపై తన్ని మార్కండేయున్ని ఎప్పటికీ మరణం లేని వరాన్ని ఇస్తాడు. పరమశివుడ్ని తన భక్తితో కట్టేసి వరాన్ని పొంది చిరంజీవిగా ఇప్పటికీ జీవించే ఉన్నారు. అప్పడు పరమశివుడు వచ్చి మార్కండేయునికి వరాన్ని అందించిన ప్రదేశంమే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని కురుక్షేత్ర జిల్లాలో షహాబాద్ మార్కండ పట్టణంలో మార్కండేశ్వర మహాదేవాలయం ఉంది. ఆలయ గోడలపై యముని తో యుద్ధం చేసిన పరమశివుడు మార్కండేయునికి అమరత్వాన్ని ప్రసాదించిన బొమ్మలు మనకు దర్శనం ఇస్తాయి. త్రేతాయుగ సమయంలో ధశరదుడు చనిపోయిన తరువాత రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు కూడా అయోధ్యలో లేని సమయంలో రాజ్యానికి రాజు లేకపోతే చాలా నష్టాలు జరుగతాయని వశిష్ట మహర్షి దగ్గరకు వచ్చి చెప్పిన ఋషులలో మార్కండేయ మహర్షి కూడా ఉంటారు. భరతుడు అరణ్యంలో నుంచి తీసుకువస్తానని శ్రీరామున్ని కలిసినప్పుడు కూడా మార్కండేయ మహర్షి ఉంటారు. ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాసం లో కూడా ధర్మరాజు దగ్గరకు వచ్చి నీతిబోధ చేస్తారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో ఉత్తరకాశీ జిల్లాలో యమునోత్రి పుణ్యక్షేత్రానికి ట్రెకింగ్ మార్గంలో ఉన్న మార్కండేయ తీర్థంలో ఉన్నారని ఇక్కడే మార్కండేయ పురాణాన్ని జైమినికి చెప్పారని పురాణాలలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బిలాస్ పూర్ కి 20 కిలోమీటర్ల దూరంలో మార్కండేయ మహర్షి ఆలయం ఉంది. ఇక్కడ ఆలయాలనికి ఎంతోమంది పెళ్ళి అయి పిల్లలు లేని జంటలు వచ్చి మార్కండేయ మహర్షికి పూజలు చేస్తారు. ఈ ఆలయం లో ఉన్న నీటికొలనులో ఎన్నో ఔషధగుణాలు కలిగి ఉన్నాయని ఇందులో స్నానాలు చేస్తే శారీరక, మానసిక రోగాలు పోయి ప్రశాంతంగా ఉంటారని భక్తుల నమ్మకం. అక్కడ విగ్రహానికి కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నదని అక్కడి వారి నమ్మకం. ఎప్పుడైనా బిలాసపూర్ వెళ్తే అక్కడ మార్కండేయ మహర్షి ఆలయాన్ని సందర్శించండి. అన్ని యుగాలు పూర్తి అయ్యాక ప్రళయం వచ్చి అంతా నీటిమయం అయినప్పుడు నీటిపై తేలుతు రావిఆకు పై ఉన్న విష్ణుమూర్తి(వటపత్ర సాయి) తో మట్లాడారని కూడా పురాణకధలలో ఉంది.

కొత్తది పాతది