విభీషణుడు రామునికి శరణాగతి |
పుట్టుకతో రాక్షసుడైనా ధర్మబద్దంగా తన జీవితాన్ని గడిపిన వ్యక్తి రావణాసురుడి తమ్ముడు అయిన విభీషణుడు. విస్రవసునికి, కైకసి కి పుట్టిన మూడవ సంతానం విభీషణుడు. కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మ గారు ప్రత్యక్షం అయి నీకు ఏ వరం కావాలో కోరుకోమంటే "నేను జీవించి ఉన్నంత వరకూ నా మనస్సు, నేను ధర్మబద్ధంగా నడుచుకొనే విధంగా ఉండాల"ని వరం కోరుకున్న వాడు. ధర్మం కోసం రావణాసురున్ని సీతాదేవి ని రామునికి అప్పచెప్పమని చెప్తే దానికి రావణాసురుడు ఆగ్రహించి విభీషణున్ని రాజ్యం నుంచి వెళ్ళమని చెప్తాడు. అప్పుడు విభీషణుడు తల్లి కైకసి సలహామేరకు రాముని దగ్గరకు చేరి తనతో స్నేహం చేసి రావణాసురుని మరణ రహస్యం చెప్పి రావణసంహారానికి రామునికి సహాయం చేసాడు. రావణ సంహారం తరువాత లంక రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేసుకుని ధర్మంగా రాజ్యపాలన చేసినవాడు. తమిళనాడులో శ్రీరంగనాధ స్వామి ఆలయం రావడానికి కారణం విభీషణుడే. రాముడు రావణసంహారం తరువాత సీతాదేవితో కలిసి అయోధ్య వెళ్ళాక అక్కడ రాముని పట్టాభిషేకం లో రాముడు తన నిజ అవతారం అయిన విష్ణువుగా ప్రత్యక్షం అయి విభీషణునికి విమాన విగ్రహం ఇచ్చి లంకా పట్టణంలో ప్రతిష్టించమని ఇస్తారు. అది తీసుకుని వెళ్ళిన విభీషణుడు మార్గ మధ్యలో విశ్రాంతి కోసం కావేరి నది ఒడ్డున ఆ విగ్రహాన్ని పెట్టి పూజలు నిర్వహిస్తాడు. ఆ తరువాత ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళబోతే ఆ విగ్రహం ఎత్తలేకపోతాడు. ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహం రాకపోతే. విష్ణువు ప్రత్యక్షం అయి తను అక్కడే శ్రీరంగనాథ స్వామిగా ఉంటానని చెప్పాడు. అదే ఇప్పుటికీ ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయం. ఎప్పటికీ ధర్మబద్ధంగా నడుచుకోవాలని రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచాలని రాములవారు విభీషణునికి మరణం లేని వరాన్ని ఇస్తారు. మహాభారతం లో ధర్మరాజు రాజసూయ యాగ సమయంలో కూడా విభీషణుడు వస్తాడు. ఆ యాగంలో కృష్ణుని పాదాలు పట్టుకుంటాను కానీ సాధారణ మానవుడు కాబట్టి నేను ధర్మరాజు పాదాలు పట్టుకోనని చెప్తాడు. తరువాత కృష్ణుడు తన అహంకారాన్ని పోగొట్టడానికి కృష్ణుడు ధర్మరాజు పాదాలు పట్టుకుంటే విభీషణుడు కూడా పాదాలు పట్టుకుంటాడు. తమిళనాడు రాష్ట్రంలో పంబన్ ద్వీపం దగ్గర ఉన్న ధనుష్కోడి లో రామాలయం లో ఎప్పుడూ వచ్చి విభీషణుడు రామున్ని దర్శనం చేసుకుంటాడని ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే రావణుడు చనిపోయిన తరువాత విభీషణునికి లంకారాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేసాడు. ఇక్కడ నుండే రామసేతు కట్టి లంకానగరానికి బయలుదేరి వెళ్ళారు. రాముడు సీతా దేవితో కలిసి అయోధ్యకు బయలుదేరివెళ్ళినప్పుడు రామసేతును నాశనం చేయమని విభీషణుడు రామున్ని కోరడం వల్ల శ్రీరాముడు తన బాణంతో రామసేతును నాశనం చేసారు. ఆప్రాంతాన్నే "యాడ్ ధనుష్కోడి" అంటారు. అంటే "బాణం యొక్క ముగింపు" అని అర్ధం. 8 మంది చిరంజీవులలో విభీషణుడు కూడా ఒకరు. శ్రీలంకలో సింహలేసీ ప్రజలు నాలుగురు బుద్ద దేవుళ్ళలో విభీషణున్ని ఒక దేవునిగా కొలుస్తారు. లంకతిలక విరహ అనే బౌద్థ దేవాలయంలో విభీషణుడు అతని భార్య అయిన సరమ విగ్రహాలు ఉన్నాయి.