|
అంజనీపుత్రుడు |
అంజనీ పుత్రుడు అయిన ఆంజనేయుడు అసలు పేరు సుందర. పరమశువుని అంశతో వాయుదేవుని అనుగ్రహంతో కేసరికీ, అంజనీదేవి కి పుట్టిన ఆంజనేయుడు ఒకనాడు బయట ఆడుకుంటుండగా సూర్యున్ని ఒకపండు అనుకుని దానిని తినడానికి సూర్యునికి దగ్గరగా వెళ్ళబోతే, ఇంద్రుడు వచ్చి తన వజ్రాయుధంతో ఆంజనేయుని దవడ మీద కొడతాడు. అప్పుడు ఆ దెబ్బకు దవడ కొంచెం సొట్ట పడి స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు వాయుదేవుడు కోపంతో గాలి వీచటం ఆపేస్తాడు. గాలి లేక ఊపిరి తీసుకోలేక ప్రపంచంలో అన్ని జీవులు చచ్చిపోతుంటే బ్రహ్మదేవుడు వచ్చి ఆంజనేయున్ని లేపి చావు లేని వరాన్ని, బ్రహ్మాస్త్రం కూడా తనను ఏమీ చేయలేదని వరం ఇస్తాడు. ఇంద్రుడు కూడా దవడ సొట్ట పడినందు వల్ల హనుమంతుడు గా పేరు ఇచ్చి, ఏ ఆయుధాలు, చివరికి వజ్రాయుధం కూడా తనని ఏమీ చేెయలేదని వరం ఇస్తాడు. సూర్యుడు తన తేజస్సులో నూరో వంతు ఇచ్చి, సమస్త విద్యలు నేర్పిస్తాడు. వరుణుడు నీటి వల్ల మరణం ఉండదని, యముడు యమపాశం కూడా తనని ఏమీ చేయలేదని, కుబేరుడూ, విశ్మకర్మ, ఈశానుడు కూడా వరాలు ఇచ్చారు. హనుమంతుడు సూర్యుని దగ్గర సకల శాస్త్రాలు నేర్చుకుని నవ వ్యాకరణ పండితుడుగా పేరు పొందాడు. సీతారాముల్ని కలపడానికీ, రామ రావణ యుద్ధంలో ఎంతో ప్రత్యేక పాత్ర పోషించారు ఆంజనేయ స్వామి. తనకి ఉన్న వరాల కారణంగా హనుమ యాగాలు, యజ్ఞాలు చేస్తున్న ఋషుల దగ్గరకు వెళ్ళి అక్కడ అల్లరి పనులు చేస్తుంటే వారు ఆంజనేయస్వామికి తన శక్తి మరచిపోయి అవసరం అయినప్పుడు ఎవరైనా గుర్తు చేస్తే తన శక్తి మళ్ళీ తనకు వస్తుందని చెప్తారు. సీతాదేవిని వెతుక్కుంటు వెళ్ళినప్పుడు లంకకు వెళ్ళేముందు సముద్రాన్ని దాటడానికి జాంబవంతుడు తన శక్తిని గుర్తుచేసి సముద్రాన్ని దాటి సీతామాతను కలుస్తారు. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఆంజనేయస్వామి విగ్రహాలు ఉన్నాయి.
భారతదేశంలో వీధి వీధికి రామాలయం, హనుమంతుని విగ్రహం ఉంటాయి. కొన్ని శాస్త్రాలు పెళ్ళి అయితేనే నేర్చుకోవాలని సూర్యుని కూతురు అయిన సువర్చలాదేవిని ఆంజనేయస్వామికి ఇచ్చి వివాహం చేస్తారు. పెళ్ళి అయినా కూడా ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నారు. రామయణం, సుందరాకాండం మొత్తం స్వామి సాహసాలు, సీతాదేవిని కలిసి తన రామలక్ష్మణుల గురించి చెప్పి తన బాధను తీర్చి, రావణున్ని కలిసి నీతి చెప్పి తను వినకపోతే రాక్షస సంహారం చేస్తాడు. అంజనీ సుతుడు అవడం వల్ల ఆంజనేయుడని, కేసరి కొడుకు అవటం వల్ల కేసరి నందనుడు అని, వాయు పుత్రుడు అని, హనుమంతుడని స్వామికి పేర్లు. ఆంజనేయ దండకం, హనుమాన్ చాలీసా, ఆంజనేయస్తోత్రం మొదలైనవి చాలా స్తోత్రాలు స్వామి గురించి ఉన్నాయి. భయాలు, గ్రహదోషాల నివారణకు, రక్షణకు, ఆరోగ్యానికి, మృత్యు భయం పోవడానికీ ఆంజనేయస్వామిని ఆరాధిస్తారు. తమిళనాడులో రామేశ్వరం ప్రాంతంలో గందమాధన పర్వతం పై స్వామి ఇప్పటికీ ఉన్నట్టు నమ్ముతారు. త్రేతాయుగంలో రామున్నీ, ద్వాపరయుగంలో భీమున్ని, కలియుగంలో తులసీదాసు హనుమంతుని దర్శనం చేసుకుని హిందీ లో రామచరిత మానస ను రాసే వ్రాసారు. రామదాసు స్వామి, రాఘవేంద్ర స్వామి, స్వామి రాందాస్, శ్రీ సత్యసాయి బాబా ఆంజనేయస్వామిని కలిసి దర్శనం చేసుకున్నారు. "యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం" ఎక్కడెక్కడ రామ కథ, రామ మంత్రం పలుకుతారో, అక్కడ ఆంజనేయస్వామి ఉంటారు.