కాకి మరీచి మహర్షి కొడుకైన కశ్యపునికి తామ్రం వల్ల జన్మించిన 8 మంది సంతానంలో ఒకటి. ఈ కాకి నుండే ప్రపంచంలో కాకులన్నీ జన్మించాయి. కాకులు పాపానికి ప్రతీకలు. కాశీరాజు కుమార్తె కళావతి. బాల్యంలోనే శైవపంచాక్షర మంత్రం నేర్చుకుంది. మధుర రాజైన దాశార్హుడిని వివాహం చేసుకుంది. కాని అతడు మహా పాపాత్ముడు. కళావతి కి ఎంతకాలం గడిచిన పిల్లలు కలగలేదు. కళావతి తన భర్తను గర్గ మహర్షి దగ్గరికి తీసుకుని వెళ్ళి తన భాదను చెప్పుకుంది. అప్పుడు ఆ మహర్షి నువ్వు తల్లివి కాలేకపోవటానికి కారణం నీ భర్త చేసిన పాపాలే కారణం అని చెప్పి దాశార్హుడిని ఒక పవిత్రమైన కొలను దగ్గరకు తీసుకుని వెళ్ళి మంత్రాన్ని జపించి ఆ కొలనులో స్నానం చేయమనిచెప్పారు. దాశార్హుడు మహర్షి చెప్పినట్టుగా ఆ కొలనులో స్నానం చేయగా ఆయన చేసిన పాపాలు కాకుల రూపంలో ఆయన శరీరం నుండి ఎగిరిపోయాయి.
ఆవిధంగా కాకులను పాపాల రూపంలో ఉంటాయని భావిస్తారు. మరుత్తుడనే రాజు మహేశ్వర సత్రయాగాన్ని చేయగా దేవతలయైన ఇంద్రుడు, యముడు ఆ యాగానికి వస్తారు. ఆ రాజు సత్రయాగాన్ని చేస్తున్నాడని తెలిసిన రావణుడు ఆ యాగం జరిగే దగ్గరికి వస్తాడు. రావణుడు రాకను చూసిన దేవతలందరూ భయపడి అందరూ రకరకాల పక్షుల రూపంలో అక్కడనుండి వెళ్ళిపోతారు. యముడు కాకి రూపంలో వెళ్ళిపోతాడు. అందుకు కృతజ్ఞతగా యముడు పితృదేవతలకు పెట్టే పిండప్రదానాలు కాకులు మాత్రమే తినాలి అని వరం ఇస్తాడు. అప్పటినుండే పిండప్రదానాలు కాకులకు పెట్టే ఆచారం వచ్చింది.