గురు సాక్షాత్ పరర్బహ్మ తస్మైశ్రీ గురవేనమః
అని మన సనాతన ధర్మంలో గురువుకు అంత ప్రాధాన్యత ఇచ్చింది. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు, గురువే పరబ్రహ్మము. గురుపూర్ణిమనే వ్యాసపూర్ణిమ అని కూడా అంటారు. ఆషాడ శుద్ధ పూర్ణిమ నాడు పరాశరమహర్షికి, దాశరాజు పుత్రిక అయిన సత్యవతి కి పుట్టారు. వ్యాసమహర్షి. ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. గురువుగా నిలచి వేదాలను విభాగం చేసి వేదవ్యాసునిగా కీర్తిగడించాడు. పద్దెనిమిది పురాణాలు, ఎన్నో స్తోత్రాలు, పంచమవేదమయిన శ్రీమహాభారతాన్ని రచించి తన శిష్యులందరీకీ తన జ్ఞానాన్ని బోధచేసి లోకానికి వాటన్నిటినీ అందించి మనకు గురువు అయ్యారు. అందుకే వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అంటారు. అంటే ఈ లోకం లో ఉన్న జ్ఞానం అంతా వ్యాసుని నుంచి వచ్చినదే. అంతటి మహాత్ముడైన వ్యాసుడు జన్మించిన రోజు ఆయనకే కాకుండా ఈ లోకంలో ఉన్న గురువులందరీకీ పూజలు చేసుకోవటం ఆనవాయితీ. ప్రతీ కల్పంలోనూ సాక్షాత్తూ ఆ నారాయణుడే వ్యాసునిగా జన్మించి లోకానికి జ్ఞాన బోధ చేస్తారు. అందుకే గురువులందరీకీ పేరుపేరున నమస్కారం చేయాలంటే శాస్త్రంలో నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమామ్ అస్మదాచార పర్యంతా వందేగురు పరంపరామ్. అనే శ్లోకం చదివితే ఆ మహావిష్ణువు దగ్గరనుండి మొదలై, మధ్యలో ఉన్న వ్యాసుని తో పాటుగా ఇప్పుడు మన గురువు వరకూ అందరీకీ నమస్కారం చేసినట్లే. శాస్త్రంలో గురువులు 5 విధాలుగా ఉంటారు అని నిర్ణయించింది. బోధకగురువు, వాచికగురువు, సూచకగురువు, పరమగురువు, నిషిద్ధగురువులు గా ఉంటారు. మనకు విద్యాబుద్ధులు నేర్పించే గురువును బోధక గురువు అంటారు. వేదాల్ని అధ్యయనం చేయించేవాడు వాచికగురువు. ఆత్మజ్ఞానాన్ని బోధ చేసేవాడు పరమగురువు. తంత్రశాస్త్రాలు నేర్పించేవాడు నిషిద్ధగురువు. గుకారశ్చంధకారశ్చ రుకారస్తు నిరోధకృత్ అంధఃకార వినాశిత్వా గురురుధ్యభిదీయతే. అంధకారం అనే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగులోకి దారి చూపించినవాడు గురువు. అలాంటి గురువులందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
శ్రీ గురుభ్యోనమః