సూర్యవంశంలో త్రిశంకుడనే రాజుకు హరిశ్చంద్రుడు పుట్టాడు. ధర్మాత్ముడు, సత్యవ్రతుడు. హరిశ్చంద్రుడికి పుత్రులు లేకపోవటంతో పుత్రుడు పుడితే వరుణునికి బలి ఇస్తానని మొక్కుకున్నాడు. వరుణుని అనుగ్రహం వలన కుమారుడు కలిగాడు. పెద్ద ఎత్తున సంబరాలు చేసి, దానాలు విపరీతంగా చేసాడు. వరుణుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి రాజా నాకు నీ కొడుకుని బలిస్తానన్నావని గుర్తుచేసాడు. పురిటిశుద్థి అవగానే ఇస్తానని చెప్పి పంపించాడు. ఆ తరువాత ఉపనయనం, తరువాత విద్యాభ్యాసం, తరువాత సమావర్తనం అని ఏదో ఒకటి చెప్తూ కాలయాపన చేస్తూవచ్చాడు. వరుణునికి కోపం వచ్చి హరిశ్చంద్రునికి జలోదరవ్యాధి రావలెను అని శపించాడు. హరిశ్చంద్రుడు అ వ్యాధితో భాదపడ్డాడు. గురువులను సలహా ఆడిగాడు. ధనం ఇచ్చి ఇంకొకలి దగ్గర కొడుకుని కొనుక్కొని బలి ఇవ్వమని సలహా ఇచ్చారు. మంత్రులు ఊరూరా తిరిగి ఒక పేద బ్రాహ్మణుని ముగ్గురు కొడుకులు ఉన్నారని అతని దగ్గరకి వెళ్ళి అడుగగా ఆ బ్రాహ్మణుడు పెద్దకొడుకుని ఇవ్వనని, అతని భార్య చిన్న కొడుకుని ఇవ్వనని అనగా మధ్యలో పుట్టిన శునస్సేపుడు అనే వాడ్ని అమ్మేసారు. ఆ శునస్సేపుడిని యూపస్తంభానికి కట్టి యజ్ఞం ప్రారంభించారు. ఇది విన్న విశ్వామిత్రుడు యజ్ఞసాలకు వచ్చి రాజా నీకోసం ఈ పిల్లవాడిని బలి ఇవ్వటం అన్యాయం. వాడిని వదిలిపెట్టమని అడిగితే, హరిశ్చంద్రుడు వినలేదు. విశ్వామిత్రుడు ఆ బాలునికి వరుణ మంత్రం ఉపదేశించాడు. ఆ బాలుడు వరుణుని ప్రార్థించగా వరుణుడు ప్రత్యక్షమయి బాలుడిని విడిపించాడు. రాజుని రోగ విముక్తున్ని చేసాడు.
తన ప్రార్థన వినలేదని విశ్వామిత్రుడు కోపించాడు. హరిశ్చంద్రుడు ఒకరోజు వేటకు వెళ్ళగా, విశ్వామిత్రుడు వంచనచేసి రాజు సర్వాస్వాన్ని దానంగా గ్రహించాడు. ఇంకా దక్షిణగా రెండున్నర బారువుల బంగారం ఇయ్యక తప్పదన్నాడు. హరిశ్చంద్రుడు, భార్య మాధవీదేవి, కుమారుడు లోహితుడుతో కలిసి వారణాసి చేరాడు. ఒక వృద్ధ బ్రాహ్మణునికి తనభార్యను అమ్మి, ఇంకా మిగిలిన ధనం కోసం తాను ఒక కాటికాపరికి అమ్ముడయ్యాడు. ఆ ధనంతో విశ్వామిత్రునికి ఇయ్యవలసిన దక్షిణ ఇచ్చాడు. హరిశ్చంద్రుడు కాశీనగరానికి దక్షిణంలో ఉన్న స్మశానంలో పనిచేస్తున్నాడు. శవానికి వచ్చిన శుంకం తన యజమానికి ఇస్తుండేవాడు. మాధవీదేవి, లోహితుడు బ్రాహ్మణుడి ఇంట్లో సేవలు చేస్తుండేవారు. ఒకరోజు దర్భలు, సమిధలు కోసం వెళ్ళన లోహితున్ని ఒకపాము కాటువేసింది. ఆ వార్త విన్న మాధవీదేవి పుత్రుని దగ్గరకు వెళదామంటే ముందు పని పూర్తి చేసిన తరువాత వెళ్ళమని ఆ బ్రాహ్మణుడు అన్నాడు. పని అంతా పూర్తి అయిన అడవిలోకి పరుగెత్తి పుత్రుని శవాన్ని తీసుకుని శ్మశానం చేరింది. ఆవిడను పిల్లవాడి శవంతో చూసిన రాజభటులు ఆమె పిల్లలను చంపేదానిగా అనుకుని బంధించి కాటికాపరికి ఆమెను చంపేయ్యమని అప్పచెప్పారు.
ఆ కాటికాపరి తన సేవకుడైన హరిశ్చంద్రునికి మాధవీదేవిని సంహరించే పని అప్పజెప్పాడు. భార్యాబిడ్డలను గుర్తించిన హరిశ్చంద్రుడు తన కర్తవ్య నిర్వహణకు సిద్థపడ్డాడు. హరిశ్చంద్రుడు, మాధవీదేవి అమ్మవారైన ఆ జగదంబను ప్రార్థించారు. అమ్మవారు అనుగ్రహం అయిన వెంటనే, కాటికాపరిగా ఉన్న యమధర్మరాజు, ఆ వృద్ధ బ్రాహ్మణుని గా ఉన్న శివుడు, విశ్వామిత్రుడు, ఇంద్రాది దేవతలు వచ్చి, పుత్రుడైన లోహితుని మీద వాత్సల్యంతో వరుణునికి ఇచ్చిన మాటతప్పడం వల్ల ఇన్ని కష్టాలు పడవలసివచ్చిందని అన్నారు. హరిశ్చంద్రున్ని స్వర్గం లో ఉండమని ఇంద్రుడు విమానం తెస్తే, హరిశ్చంద్రుడు తన ప్రజలున్న దగ్గరే తాను ఉంటానన్నాడు. ఇంద్రుడు హరిశ్చంద్రున్ని, మాధవీదేవిని, అతని రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ దివ్య విమానంలో స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు.