రాముడు దేవుడు కాదు అనే చెప్పాలి. రావణాసురుడు మరణం లేకుండా వరం పొందినప్పుడు సమస్త దేవ, దానవ, కిన్నెర, కింపురుష, యక్ష, గంధర్వుల చేతిలో చావు రాకుండా ఇవ్వమని, ఇంతమంది చేతిలో చావు రాకుండా సామాన్య మానవుడు నన్ను ఏం చేయగలడని మానవున్ని నేను అసలు అడగను అని బ్రహ్మతో అంటాడు. రాముడు దేవుడే అయితే నవ మాసాలు ఒక తల్లి గర్భంలో ఆ చీకటి ప్రాంతంలో ఇరుకుగా ఉండి పుట్టవలసిన అనసరం లేదు. కేవలం రావణ సంహారానికి మాత్రమే జన్మించి ఉంటే ఉత్తర ఖాండ ఉండవలసిన పనిలేదు. రావణున్ని యుద్ధంలో చంపిన తరువాత కూడా రాముడు సీత తో కలిసి అయోధ్య వెళ్ళి పట్టాభిషేకం చేసుకుని 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి రామరాజ్యం తీసుకువచ్చాడు. నారదుడు, వాల్మీకి మహర్షి దగ్గరకు రాగానే అయనను అడిగిన ప్రశ్న గుణవంతుడు, వీరుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత కలవాడు, ఎల్లప్పుడూ సత్యాన్నే పలికేవాడు, యుక్తి కలిగినవాడు, అన్ని ప్రాణులను సమధృష్టితో చూసేవాడు, సమస్త విధ్యల యందు ఆరితేరినవాడు, సమర్ధుడు, అందరితోనూ మంచిగా ఉండేవాడు, ఇంద్రియాలను గెలిచినవాడు, అసూయలేనివాడు ఇన్ని లక్షణాలు కలిగిన సాధారణ మానవుడు ఇప్పుడు నా కంటికి కనిపించేవాడు ఉన్నాడా అని అడిగితే ఉన్నాడు అని రాముని గురించి చెప్తాడు. ఆ నారదుడు చెప్పిన మాటలే బ్రహ్మ వరంతో రామాయణాన్ని రచించారు వాల్మీకి మహర్షి. అంటే మానవుని గా పుట్టినప్పుడు ఇవన్నీ ఉండవలసిన అనసరం ఉంది.
ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడుతూ, మానవుడు ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరిస్తూ దేవుడు అయ్యాడు తప్పా నిజానికి రామున్ని ఆదర్శంగా తీసుకుని ఆయనలా ధర్మాచరణ చేస్తూ ఉన్న మనం కూడా దేవుళ్ళమే అవుతాము. ఒక అన్న తమ్ముడి తో ఎలా ఉండాలి, ఒక కొడుకు తండ్రితో ఎలా ఉండాలి, ఒక మిత్రుడు ఇంకొక మిత్రునితో ఎలా ఉండాలి, ఒక భర్త భార్యతో ఎలా ఉండాలి, ఒక శిష్యుడు గురువుతో ఎలా ఉండాలి, ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు ప్రజలతో ఎలా ఉండాలి, ఒక మనిషి సాటి మనిషితో, సాటి ప్రాణులతో ఎలా ఉండాలి అని మనకు చూపించి బ్రతికిన వ్యక్తి రాముడు. మనం కూడా అలా బ్రతకగలం చిరస్థాయిగా. రాజ్యాన్ని పోగొట్టుకుని అడవులపాలయ్యానని భాదపడ్డాడు. బంగారు జింక కోసం వెళ్ళి అది మాయ అని తెలుసుకుని తిరిగి వచ్చి చూసే సరికి సీత కనిపించకపోతే విలవిలలాాడుతూ సీతారాముని గా ప్రాణ త్యాగానికి కూడా సిద్దపడితే లక్ష్మణుడు అపాడు. తను మిత్రునిగా భావించి వచ్చిన జటాయువు మరణిస్తే తట్టుకోలేకపోయాడు. అన్ని కష్టాలు పడి సీతను చేరుకుని రావణ సంహారం చేసి 14 సంవత్సరాలు అడవులో బ్రతికి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేస్తూ ఉన్నప్పుడు ఎవడో ఏదో అన్నాడని సీతమ్మను వదిలివేసే పరిస్థితి వస్తే రాజాారామునిగా దానిని కూడా నెగ్గుకువచ్చాడు. ఇలా ఒకటి కాదు ఎన్నో ఉంటాయి రామాయణం చదివితే. ధర్మాన్ని కాపాడి దానిని సంరక్షించే భాద్యత మానవునిదే అని తెలియచేయడానికి పూర్తి మానవునిగానే బ్రతికి మనిషిగా పుట్టినందుకు మన జీవితాల్ని సార్థకత చేసుకునే విధంగా రాముడు మనకు స్ఫూర్తినిచ్చాడు. సీతమ్మ తల్లి సాక్షాత్తూ లక్ష్మీదేవి అయినా ఆ తల్లి కూడా ఎన్నో కష్టాలు పడి వాటిని తట్టుకుని మనలు ఆదర్శప్రాయంగా నిలిచారు. రామాయణం చదవండి, చదివించండి. రామాయణం ఒక మనిషి కథ అని మనం చదివితేనే మనల్ని గట్టెక్కిస్తుంది. సర్వేజనా సుఖినోభవంతుః, లోకాఃసమస్తాఃసుఖినోభవంతుః. జై శ్రీరామ్.