జరత్కారుడు అనే ఒక ముని పెళ్ళిచేసుకోను అని బ్రహ్మచారిగా ఉండటానికి నిశ్చయించుకున్నాడు. తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళాడు. అలాకొంత కాలం తపస్సు చేసుకున్నాడు. ఒకనాడు అడవులలో తిరుగుతుండగా ఒక చెట్టుకి కొంతమంది మునులు తలక్రిందులుగా వేలాడటం చూసాడు. వాళ్ళ కిందన రెళ్ళుపొదలు ఉన్నాయి. ఆ రెళ్ళుపొదలను ఒక ఎలుక వచ్చి తింటూఉంది. అది చూసి ఆశ్చర్యపోయిన జరత్కారుడు ఆ మునులతో అయ్యా మీరెవరు ఇలా తలక్రిందులుగా వేలాడటం ఏమిటి ఆ ఎలుక రెళ్ళును తినటం ఏమిటి అని వారిని అడిగాడు. దానికి వారు నాయనా మేము మీ తాతాముత్తాతలము నీవు పెళ్ళి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోవటం వలన మాకు మోక్షం లేకుండా ఇలా తలక్రిందులుగా వేలాడి ఉన్నాం. ఆ ఎలుక యమధర్మరాజు మేము చేసిన పుణ్యాలు అయినంతవరకు ఆ రెళ్ళు పొదలను తింటూ ఉంటుంది. అవి అన్ని అయిపోగానే మేము అథఃపాతాలానికి పడిపోతాము. మాకు ఇంకెప్పటికీ ఊర్ధ్వలోకాలకు వెళ్ళే అవకాశం ఉండదు. మాకు మోక్షం ఉండదు. నీవు పెళ్ళి చేసుకుని పుత్రున్ని కంటే తప్ప మాకు మోక్షం కలుగదు. కనుక నాయనా మీ పూర్వీకులమైన మమ్ములను రక్షించే భాద్యత నీదే. అని వారు జరత్కారునితో అన్నారు. వారి మాటలు విన్న జరత్కారుడు అయ్యో నేను ఎంత తప్పుచేసాను. నేను పెళ్ళిచేసుకోకపోవటం వల్లనే మా పూర్వీకులకు ఈ దురవస్త అనుకుని సరే అయితే నేను పెళ్ళిచేసుకుంటాను కానీ నా పేరుతో కలిగిన స్త్రీతో అయితేనే నేను వివాహం చేసుకుంటాను. అని వారితో చెప్పి అక్కడనుండి వెళ్ళిపోతాడు.
తన తల్లి కోరిక తీర్చలేదని జనమేజయుడు చేసిన యజ్ఞంలో పడి నాశనం అవ్వమని సర్పాలకు శాపం పెడుతుంది. అప్పుడు ఆ సర్పాలన్నీ బ్రహ్మను వేడుకుంటే వాసుకి సోదరి అయిన జరత్కారువు ని అదే పేరు గల మునికి ఇచ్చి వివాహం చేస్తే వారికి పుట్టిన పిల్లవాడే మిమ్మల్నందరినీ కాపాడతాడని వారికి వరం ఇస్తారు. వారనుకున్నట్లుగానే జరత్కారుడికి, జరత్కారువుకి వివాహం చేస్తారు. వారికి పుట్టిన వాడే అస్తీకుడు. అస్తీకుడు జనమేజయుడు చేసే యజ్ఞానికి వెళ్ళగానే, జనమేజయుడు ఏం కావాలని అడుగగా అస్తీకుడు నీవు చేసే సర్పయాగం ఆపెయ్యమని కోరగా ఆ ముని కోరిక మేరకు ఆ యాగాన్ని ఆపేస్తాడు. ఆ విధంగా వారివురి వివాహం వల్ల ఆ మునులకు మోక్షం కలిగి, స్వర్గానికి చేరుకున్నారు. ఆ సర్పాలకు ప్రాణం నిలబడింది.
అందుకే సనాతన ధర్మంలో వివాహానికి అంత పెద్దపీట వేసింది. వివాహం చేసుకుని పిల్లలను కని, పిండప్రదానాలు చేస్తే తప్ప పూర్వకులకు మోక్షం కలుగదు.