తులసి మొక్క

                 వేదవతి తండ్రి అయిన కుశధ్వజుడికి ధర్మధ్వజుడు అనే తమ్ముడున్నాడు. అతని భార్య మాధవీదేవి. కార్తీకపూర్ణిమ శుక్రవారంనాడు లక్ష్మీదేవి వారిరువురికి కూతురుగా పుట్టింది. ఆ బిడ్డకు తులసి (సాటిలేనిది) అని పేరు పెట్టారు. తులసి బ్రహ్మ గురించి తపస్సు చేసి శ్రీమన్నారాయణుడు భర్తగా కావాలని వరం కోరుకుంది. నారాయణ అంశతో జన్మించిన శంఖచూడుడు భర్త అవుతాడని. ముల్లోకాలలోను పూజింపబడతావని బ్రహ్మ తులసికి వరం ఇచ్చారు. బ్రహ్మే స్వయంగా శంఖచూడుడికి, తులసికి వివాహం చేసాడు. శంఖచూడుడికి, అతని భార్య శీలభంగం అయితే తప్ప మరణం లేదని వరమిచ్చాడు. 

                శంఖచూడుడు దేవతలతో యుద్ధం చేసి వారిని జయించాడు. దేవతలందరూ, బ్రహ్మ, శివులను తీసుకుని వైకుంఠానికి వెళ్ళారు. శ్రీహరిని పూజించారు. నారాయణుడు తులసిని, శంఖచూడుడుని మోసం చేసి మీకు జయం కలిగిస్తానని వారితో చెప్పారు. నారాయణుడు శివునికి త్రిశూలం ఇచ్చాడు. శివుడు, కుమారస్వామి, భద్రకాళి, వీరభద్రుడు, నంది, ప్రమదగణాలు, ఏకాదశరుద్రులు, అష్ఠభైరవులు, అష్టవసువులు, ద్వాదశాదిత్యులు, ఇంద్రాది దేవతలు, సకలదేవ, యక్ష, గంధర్వులతో శంఖచూడుడి మీదకు దాడిచేసారు. తులసి భయపడింది. శంఖచూడుడు తులసి త్రిమూర్తులపైన పరాశక్తి ఉంది. ఆ శక్తి జనంతో జనాన్ని, సృష్టించి, రక్షించి, సంహరిస్తుంది. సుఖ, దుఃఖాలు రెండు సమానంగా చూడు. అని తులసితో చెప్పి మనస్సులో శ్రీహరిని తలుచుకుని యుద్ధానికి బయలుదేరాడు. శివునికి, కుమారస్వామికి, భద్రకాళికి నమస్కరించాడు. వారు ఇతనికి ఆశీస్సులు అందిచారు. శంఖచూడుడిని చూసి నందీశ్వరాదులు, ఇతర దేవతాగణం అనుకోకుండానే లేచి నిలబడ్డారు. ఎవరి కర్తవ్యం వారు చేయాలి కాబట్టి యుద్ధం మొదలుపెట్టారు. శంఖచూడుని దెబ్బకు కుమారస్వామి మూర్ఛపోయాడు. కాళి అతనిని ఎత్తుకుని శివుని దగ్గర దించింది. శివుడు కుమారస్వామిని పునర్జీవున్ని చేసాడు. కాళి శంఖచూడుల మధ్య యుద్ధం జరిగింది. కాళి ప్రయోగించిన అస్త్రాలను శంఖచూడుడు ఖండింసాడే తప్ప ఏ ఆయుధము తిరిగి ప్రయోగించలేదు. కాళికి నమస్కరించి ఉండిపోయాడు. కాళి అతనిని మెచ్చుకుని వెళ్ళిపోయింది. అప్పుడు శ్రీహరి ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో శంఖచూడుని దగ్గరికి వెళ్ళి నారాయణ కవచాన్ని దానం అడిగాడు. శంఖచూడుడు కాదనకుండా నారాయణ కవచాన్ని ఆ బ్రాహ్మణునికి దానం చేసేసాడు. తరువాత శ్రీహరి శంఖచూడుని వేషంలో వెళ్ళి తులసిని చేరి ఆమె పాతివ్రత్యం భంగం చేసాడు. వెంటనే శివుడు తన త్రిశూలంతో శంఖచూడుని సంహరించాడు. నిజం తెలుసుకున్న తులసి శ్రీహరిని రాయివికమ్మని శపించింది. అప్పుడు శ్రీహరి తలసి తో శంఖచూడుడు నా అంశతో జన్మించినవాడే. నీవు మహాలక్ష్మి అంశ. నీవు గండకీ నదిగా పుణ్యనది అవుతావు ఆనదిలో నేను సాలగ్రామంగా ఉంటాను. 


నీ జుట్టు తులసి చెట్టుగా ముల్లోకాలలోను పూజింపబడుతుంది. అని వరం ఇచ్చాడు. ధర్మాత్ముడైన శంఖచూడుని అస్తికల నుండి శంఖం పుట్టింది. శంఖంలో పోస్తే కాని తీర్థం కాదని, అన్ని అభిషేకాలకు శంఖం వాడాలని, శంఖం పూజా మందిరంలో పూజింపబడాలని జగన్మాత శాసించింది. 

            ఆ విధంగా తులసి మొక్క రావడానికి, నారాయణుడు సాలగ్రామంగా మారడానికి, శంఖం పుట్టుక జరిగింది.


        

కొత్తది పాతది