శ్రీ మహావిష్ణువు ఒకనాడు రాక్షసులతో పదివేల సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయాడు. తను యుద్ధం చేసిన ధనస్సు నేలకు ఆనించి దాని మీద మెడ ఆనించి గాఢనిద్రలో మునిగిపోయాడు. ఇంతలో దేవతలందరూ ఒక పెద్ద యజ్ఞం చేసారు. విష్ణువు కోసం అంతటా వెతికి చివరికి ఆయన ఉన్న స్ధలానికి వచ్చి సర్వేశ్వరుని గాఢనిద్రను చూసి ఆలోచనలోపడ్డారు. ఎలాలేపాలో తెలియలేదు. అప్పుడు ఒక చెదపురుగుని ధనస్సు వింటి నారిని కొరకమన్నారు. ఆ పని చేస్తే హోమసమయంలో పక్కనపడిన అన్నం చెదకు ఇస్తామన్నారు. ఆ చెద వెళ్ళి నారిని కొరికింది. ధనస్సు ఒకవైపు జివ్వున పైకిలేచింది. ఒక పెద్ద శబ్ధం పుట్టింది. ఆ ధనస్సు విసురుకు విష్ణువు శిరస్సు ఎగిరిపోయింది. దేవతలకు భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఓ దేవదేవా మా అజ్ఞానాన్ని మన్నించండి. ఇప్పుడు మేం ఏం చేయాలి అని గట్టిగా విలపిస్తున్న దేవతలకు బ్రహ్మగారు ఇలా చెప్పాడు, దేహధారి అయిన వారందరికీ కాలానుసారంగా శుభాశుభాలు అనుభవింపక తప్పదు. పూర్వం శివుడు నా తల నరికాడు. అలాగే శివలింగం తెగి బూడిదలో పడిపోయింది. ఈ చర్య జరగడం వల్ల ఆంతర్యం ఏదో ఉండే ఉంటుంది. మా త్రిమూర్తులకు శక్తి నిచ్చే ఆ జగదంబని ప్రార్ధించండి. మనలకు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. అని దేవతలకు ఆదేశించారు. బ్రహ్మగారి ఆదేశానుసారం దేవతలందరూ వేదాలతో కలిసి ఓ జగన్మాతా, మాతా నీవే సకల ప్రాణులలోను, స్మృతి రూపాల్లోనూ ఉంటావు. త్రిమూర్తులనూ, దిక్పాలకులనూ నువ్వే సృష్టించి వారిచేత సృష్టి, స్థితి, లయలు చేస్తుంటావు. తల్లీ ఘోరమయిన తప్పు జరిగిపోయింది. దేవతలను క్షమించి, విష్ణువును బ్రతికించు అన్ని అమ్మవారిని వేడుకున్నారు. ఆ దేవతల ప్రార్ధనకు జగన్మాత ఆనందించి, దేవతలారా కారణం లేనిదే కార్యం జరగదు. ఒకసారి విష్ణువు లక్ష్మిని చూసి నవ్వారు. నన్ను చూసి ఎందుకిలా నవ్వుతున్నారు. సవతిని ఎవరినైనా తెస్తున్నాడా, సవతి పోరు కంటే భర్త లేకపోయినా పరవాలేదు. నన్నుచూసి నవ్విన తలతెగిపోవాలి. అని శపించింది. ఆనాటి లక్ష్మి శాపం ఇలా జరగడానికి ఒక కారణం. ఇందువల్ల ఒక మహత్కార్యం జరుగుతుంది. హయుడు అనే గుర్రం తలగల రాక్షసుడు సరస్వతీ నదీ తీరాన నా తామసశక్తిని గూర్చి తీవ్రమైన తపస్సు చేసాడు. తనలాగే గుర్రం తల కలవాని చేత తప్పించి ఇంకెవ్వరిచేత చావులేకుండా వరం కోరుకున్నాడు. ఆ వర గర్వంతో లోకాల్ని వేధిస్తున్నాడు.
ఒక గుర్రం తల తెచ్చి విష్ణువు మొండానికి అతికించండి. ఇలా పరాశక్తి ఆదేశానుసారం విష్ణువు హయగ్రీవుడై, హయుడనే రాక్షసునితో యుద్ధం చేసి అతణ్ణి సంహరించాడు. ఆ తరువాత హయగ్రీవుడు బిల్వదళ, తులసీదళాలతో శ్రీ చక్రార్చన చేసి తన విష్ణువు ఆకారాన్ని తిరిగిపొందాడు. మంత్రాలలో శ్రీవిద్య, పురాల్లో శ్రీపురం, శక్తులలో పరాశక్తి శ్రేష్ఠమైనవని శ్రీమహావిష్ణువే స్వయంగా తన శిష్యుడయిన అగస్త్యునికి తెలియచేసారు. జగత్రయ సామ్రాజ్యానికి పట్టమహిషి అయిన అమ్మవారిని లలితా సహస్రంతో సమస్త లోకాలకు శ్రీవిద్యోపాసన, లలితాసహస్రనామం అందించారు.
జగన్నాటక సూత్రదారి అయిన శ్రీమహావిష్ణువు ఈ నాటకం ఆడి లక్ష్మీదేవి చేసిన శాపాన్ని, ఆ హయుడనే రాక్షసున్ని సంహరించడానికి తన తల తెగిపడి హయగ్రీవ అవతారం రావడానికి ఇంత చేయవలవచ్చింది. అన్ని విద్యలకు, జ్ఞానం కలగడానికి శ్రీమహావిష్ణువు అవతారం అయిన హయగ్రీవున్ని ఉపాశన చేస్తారు. దేవీభాగవతంలో ఉన్న ఈ ఆఖ్యానం ఎన్నో శుభాలను అందిస్తుంది.