ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో మూకచింతపల్లి అనే గ్రామంలో జన్మించాడు వేమన. యువప్రాయంలోనే వేమన దేశదిమ్మరిగా తయారయ్యాడు. పైగా ఘాటుగా మాట్లాడేవాడు. ఇలాంటి నిర్లక్ష్యపు మనిషి ఐనందున బంధుమిత్రులు ఇతనిని ద్వేషించేవారు. కానీ వేమన వదిన మాత్రం అతనిని ఎంతో ప్రేమతో చూచుకొనేది. పనికిరాని వాడని పేరు గాంచిన వేమనలో మంచి పరివర్తన తీసుకురావడానికి అతని వదిన ప్రయత్నించింది. నాయనా వేమా మన ఊరి ప్రజలు నిన్ను నిందించడం నాకు చాలా బాధగా ఉంది. మన భవనంలో బంగారు నగలు తయారుచేసే చోటు ఉంది కదా. నువ్వు రోజూ అచ్చటికి వెళ్ళి అక్కడ పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయా చూడొచ్చుగా అని తన వదిన వేమనను అడిగింది. వేమన తన వదిన భాదను చూసి కాదనలేకపోయాడు. తన వదిన చెప్పినట్లుగా రోజు అక్కడికి వెళ్ళి దగ్గరుండి పనులన్నీ చేయించేవాడు. అక్కడ అభిరాామాచారి అని ఒక స్వర్ణకారుడు ఉండేవాడు. మంచి నైపుణ్యం కలవాడు. అతను పనికి రోజూ ఆలస్యంగా రావటం చూసిన వేమన అతనితో, ఆచారీ నువ్వెందుకు రోజూ ఆలస్యంగా వస్తున్నావు. సరిగ్గా సమయానికి రాలేవా అని మందలించాడు. ఉదయం ఆలస్యం కావడం నిజమే. కానీ సాయంత్రం ఆలస్యంగా వెళుతున్నాను కదా, అని అభిరామాచారి బదులుచెప్పాడు. వేమన అవన్నీ నాకు తెలియదు. నిర్ణీత సమయానికి రావాలి, వెళ్ళాలి. అలా కాకపోతే నువ్వు ఉద్యోగానికి రావలసిన పని లేదు. అని గట్టిగా అన్నాడు. సరే ప్రయత్నిస్తాను. అని ఆచారి సమాధానం చెప్పిఅలాగే రోజు ఆలస్యంగా వస్తున్నాడు. పని బాగాచేసేవాడిని వదులుకోలేని వేమన రోజూ ఆచారి ఆలస్యంగా ఎందకు వస్తున్నాడో కనుక్కోవాలి అని, మరుసటి రోజు ఉదయాన్నే ఆచారి ఇంటికి వెళ్ళాడు వేమన. ఆచారి పొద్దున్నే లేచి, కాలకృత్యములు తీర్చుకుని, పూజకు కావలసిన పళ్ళు, పువ్వులు తీసుకుని ఇంటినుంచి బయలుదేరి ఊరి బయట కొండ గుహలో ఉన్న ఒక సన్యాసి ని కలుసుకుని ఆ పళ్ళు, పువ్వులు ఆ స్వామికి ఇచ్చి నమస్కరించాడు. ఇదంతా చాటు నుండి గమనిస్తున్నాడు వేమన. ఆ స్వామి ఆచారితో నాయనా నీ భక్తి ప్రపత్తులకు మెచ్చుకున్నాను. నేను రేపు సమాధి చేరుకుంటాను.
అందువల్ల సూర్యోదయానికి ముందే వచ్చెయ్. ఇదంతా చూస్తూ ఉన్న వేమన, ఆచారి, స్వామిని కలుసుకోకుండా చేద్దాం, అతనికి బదులు నేనే ఆ ఉపదేశాన్ని స్వీకరించాలి అనుకుని తన వదిన దగ్గరికి వెళ్ళి వదినా రేపు మధ్యాహ్నం వరకు ఆచారిని ఇక్కడే ఉండిపోయేలా పని అప్పగించు, ఇంటికి పంపించవద్దు కారణం తరువాత చెప్తాను. అనగానే అలాగే చేస్తాను అని ఆచారిని పిలిచి అతను ఇంటికి వెళ్ళటానికి వీలులేకుండా పని అప్పగించింది. ఓరి భగవంతుడా ఇదేమి పరీక్ష మహనీయుని ఉపదేశం పొంది తరించాలి అనుకున్న నన్ను ఇలా బయటికి వెళ్ళకుండా చేసారే అని ఆచారి చాలా భాదపడ్డాడు. ఇదిలా ఉండగా మరుసటిరోజు సూర్యోదయానికి ముందే లేచి వేమన పూజా సామగ్రి తీసుకుని ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి స్వామి నేను అభిరామాచారి శిష్యుణ్ణి ఆయన రావడానికి వీలుపడలేదు. బదులుగా నన్ను మీ దగ్గరకు పంపించారు. అని వేమన అంటాడు. అన్నీ తెలిసిన ఆ స్వామి నాయనా నేను నీకు దివ్యజ్ఞానాన్ని ప్రసాదిస్తాను. కానీ నీవు అభిరామాచారికి చెప్పి, ఆయన నుండే నీవీ జ్ఞానాన్ని స్వీకరించాలి, అప్పుడే అది ఫలిస్తుంది. అనగానే వేమన నేను చేసిన తప్పును మన్నించి జ్ఞానోపదేశం చేయండి. ఆచారి ద్వారానే నేను స్వీకరిస్తాను. అనగానే ఋషి వేమనకు మంత్రోపదేశం చేసి ఆచారి ద్వారానే ఫలాన్ని పొందు అని ఆశీర్వదించి పంపించారు. వేమన ఆచారి దగ్గరకు వచ్చి నా తప్పును క్షమించు. గుహలో ఉన్న ఆ మహర్షి నాకు అనుగ్రహించిన మంత్రాన్ని నీకు చెప్తాను. తర్వాత నీవు దానిని నాకు ఉపదేశించి, ఆశీర్వదించు అంటాడు. ఆహా భగవంతుడు ఎంత కరుణామయుడు నన్నెలా ఆదుకున్నాడు అని వేమన దగ్గర నుండి మంత్రాన్ని స్వీకరించి తిరిగి వేమనకు ఉపదేశం చేసాడు. ఆ మంత్రోపదేశం స్వీకరించిన వేమన పనికిరాని వాడిగా ఊర్లు తిరుగుతున్న వేమన లో పెద్ద మార్పు వచ్చింది. ఆ మహనీయుని మంత్రోపదేశ బలంతో సకలశాస్త్రసారవేత్తగా, వేమన యోగిగా పరిణమించి పామరులు కూడా అర్థం చేసుకునేలా తత్త్వసారాన్ని వేలకొలది పద్యాల రూపంలో ప్రజలకు అందించి ఎనలేని సేవ చేసారు.