ఆయోధ్యను శ్రీరాముడు ఆదర్శంగా పాలిస్తున్నాడు. ఆయన అవతార కాలం సమాప్తమై, వైకుంఠానికి తిరిగి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది. దీని గురించి యమధర్మరాజు, శ్రీరామునితో రహస్యంగా మాట్లాడ నిర్ణయించాడు. అందువల్ల ఆయన ఒక ఋషి వేషంలో వచ్చాడు. "ప్రభూ నేను మీ దగ్గర అవతార రహస్యం గురించి ఏకాంతంగా మాట్లాడటానికి వచ్చాను, ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు." అని ఋషి చెప్పగా, శ్రీరాముడు "సరే అర్థమైంది మనం మాట్లాడుతున్న గదిలోకి ఎవరూ రాకూడదని ఆజ్ఙ జారీ చేస్తాను అంటారు." "అది చాలదు. ఆజ్ఙను ఉల్లంఘించి లోపలికి వచ్చేవారు ఎంతవారైనా శిరశ్ఛేదం చెయ్యాల్సిందే" అని ఋషి రామునితో అంటారు. సరే అని శ్రీరాముడు లక్ష్మణున్ని పిలిచి "లక్ష్మణా ఎవ్వరినీ లోపలికి రానియ్యకు వస్తే శిరశ్ఛేదమే" అని లక్ష్మణున్ని కాపుగా పెడతారు. "అలాగే అన్నయ్య" అని లక్ష్మణుడు కూడా ఎవ్వరినీ లోపలికి వెళ్ళనివ్వకుండా అక్కడే ఉంటారు. శ్రీరాముడు, ఋుషి రూపంలో ఉన్న యమధర్మరాజు గది లో మాట్లాడుకుంటున్న సమయంలో దూర్వాస మహర్షి రాముని కలుసుకోవడానికి అక్కడకు వస్తారు. ఆయనను చూసిన లక్ష్మణుడు ఆయనను సాదరంగా ఆహ్వానించి "మహర్షీ స్వాగతం మీ రాక మా భాగ్యం. రండి దయచేయండి. కొంత విశ్రాంతి తీసుకోండి" అని మహర్షి కి సపర్యలు చేస్తుంటే, "ముందు నేను శ్రీరామున్ని దర్శించాలి. ఆ తర్వాతే తక్కినవన్నీ" అంటారు.
"మునిశ్రేష్ఠా కొంత ఓపిక పట్టండి. ఎప్పుడూ రాని ఒకరితో అన్నయ్య చాలా ముఖ్యమైన విషయం చర్చిస్తున్నారు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే నేనే స్వయంగా మిమ్ము శ్రీరామ దర్శనం కోసం తీసుకువెళతాను." అని లక్ష్మణుడు దూర్వాస మహర్షితో అనగానే. మహర్షి "ఏమిటి ఎప్పుడూ రాని వాడా? నేను కూడా ఎప్పుడు రాని వాణ్ణే వచ్చాను. నీవు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఓ లక్ష్మణా నేను ఇప్పుడే శ్రీరామున్ని చూసి తీరాలి. అందుకు నువ్వు సమ్మతించకపోతే ఈ అయోధ్యానగరం భస్మమైపొయ్యేలా శపిస్తాను." అని మహర్షి కోపంగా అంటారు. దూర్వాసుని స్వభావం తెలిసిన లక్ష్మణుడు "ఇదేమి అగ్నిపరీక్ష అన్నయ్య ఆనతిని ఉల్లంఘించి లోపలికి వెళితే నా తల మాత్రమే పోతుంది. లోకపోతే అయోధ్యానగరమంతా భస్మమైపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి అనుకొని నా తల పోయినా ఫరవాలేదు. అయోధ్యావాసుల ప్రాణాలే నాకు ముఖ్యం" అనుకొని లోపలికి ప్రవేశించి దూర్వాస మహర్షి రాకను శ్రీరామునికి తెలియజేస్తాడు. లోపల ఉన్న ఋషి లక్ష్మణున్ని చూచి శ్రీరామునితో "నేను వెళ్ళకముందే ఈయన లోపలికి ఎలా వచ్చారు. సరే నేను వచ్చిన పని ముగిసింది. ఇక సెలవు తీసుకుంటాను. అని ముని వేషంలో ఉన్న యమధర్మరాజు వెళ్ళిపోతారు." యమునికి మాట ఇచ్చినట్లు ఇప్పుడు లక్ష్మణున్ని ఏం చేయాలా అని రాముడు తికమకపడ్డాడు. అయినా దూర్వాసుని చిరునవ్వుతో పలకరించి అతిధి మర్యాదలు చేసారు. దూర్వాసుడు వెళ్ళిపోయిన తరువాత శ్రీరాముడు తమ్మున్ని చూసి దుఃఖిస్తుండగా, లక్ష్మణుడు ఇదే కాల మహిమ అన్నయ్య నా కోసం దుఃఖించకు నీ మాట తప్పకుండా నా శిరశ్ఛేదానికి ఉత్తర్వులు జారీ చెయ్యి. అంటారు. శ్రీరాముడు ఏం చేయాలో అని ఆలోచిస్తూ తన మంత్రులతోను, వశిష్ఠుని తోనూ సంప్రదించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి శ్రీరామా భాదపడకు మంచి నడవడి ఉన్నవాళ్ళకి బహిష్కరించడం శిరశ్ఛేదంతో సమానం, అందువల్ల మాట నిలబెట్టుకోవాలి అంటే లక్ష్మణున్ని బహిష్కరించి వొదిలెయ్యి అది చాలు అని అంటారు. ఈ సలహాను పాటించ నిర్ణయించారు శ్రీరాముడు. "ప్రియ లక్ష్మణా నా కోసం నీవు చేసిన త్యాగాలన్నిటికన్నా ఈ త్యాగం ఎంతో గొప్పది. నా మాట నిలబెట్టుకోవటానికి నిన్ను త్యాగం చేసి బహిష్కరిస్తున్నాను." అని లక్ష్మణున్ని శ్రీరాముడు బహిష్కరించాడు. రాములవారి పాదాలకు నమస్కరించి మీ ఆజ్ఞను శిరసావహిస్తానని చెప్పి ఎవరితోనూ మాట్లాడకుండా అడవులకు వెళ్లి తపస్సు చేసుకోసాగాడు. తర్వాత సరయూనదిలోకి దిగి అన్నయ్య కనిపించని ప్రపంచంతో నాకు ఇంకేం పని అనుకొని ఆ నదిలో మునిగి తన అవతారం పరిసమాప్తి చేసుకున్నాడు. ఈ వార్త తెలిసిన శ్రీరాముడు కూడా లక్ష్మణుడు లేని ఈ జీవితం ఎందుకు అని దుఃఖిస్తూ రాముడు కూడా తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి పయనం అయ్యారు. ఆ విధంగా శ్రీరాముడు తన అవతారాన్ని విడిచిపెట్టాలంటే లక్ష్మణుని దూరం చేయ్యాలని యముడు ఈవిధంగా చేయవలసివచ్చినది.