పురువంశ మహారాజు దుష్యంతుడు మహావీరుడు అందగాడు కూడా. ఒకసారి అతడు వేటకోసం అడవికి వెళ్ళాడు. ఒక జింకను తరుముకుంటూ వెళ్ళిన అతడు ఆ వనంలో ఉంటున్న కణ్వమహర్షి ఆశ్రమానికి వచ్చేసాడు. అక్కడ కణ్వమహర్షి పెంపుడు కూతురు శకుంతలను చూసాడు. శకుంతల అందచందాలు చూస్తూ నిలబడిపోయాడు దుష్యంతుడు.శకుంతల స్నేహితులైన అనసూయ, ప్రియంవద లు దీనిని గమనించి ఆ రాజు దగ్గరికి వెళ్ళి స్వామీ ఇది కణ్వమహర్షి ఆశ్రమం, మహర్షి యాత్రకు వెళ్ళారు. ఆమె ఆయన కూతురు శకుంతల. మీరు ఈ ఆశ్రమమునకు వచ్చిన కారణం తెలియచేయండి. అని దుష్యంతుని తో అన్నారు. దానికి ఆ రాజు నేను కణ్వమహర్షి ఆశీసులను పొందడానికే వచ్చాను. ఈమె మహర్షి కుతురా. అని ప్రశ్నించాడు. ఆ ఇద్దరూ ఈమె రాజర్షి విశ్వామిత్రునికి, దేవలోక నర్తకి అయిన మేనక కు జన్మించింది. వారు వనంలో వదిలివెళ్ళినపుడు శాకుంత పక్షులచే కాపాడబడినది కనుక ఈమెకు శకుంతల అని మహర్షి నామకరణం చేసి ఇక్కడకు తెచ్చి పెంచుకుంటున్నారు.
ఆమెను ఒప్పించి గాంధర్వ విధి ప్రకారం దుష్యంతుడు, శకుంతల ను పెళ్ళిచేసుకుని తన రాజముద్ర గల ఉంగారాన్ని ఆమె వేలికి తొడిగాడు. కొన్ని రోజుల తరువాత దుష్యంతుడు, శకుంతల తో నేను రాజధానికి వెళ్ళాలి. నేను మళ్ళీ వచ్చి మీ తండ్రి ఆశీసులను పొంది, నియమానుసారం నిన్ను తీసుకువెళతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఆ రాజు మాటప్రకారం తిరిగి రావటానికి వీలుపడలేదు. రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు దూర్వాస మహర్షి శకుంతల ఉన్న ఆశ్రమానికి వచ్చారు. బయటనిలబడి పిలువగా శకుంతల, దుష్యంతుని గురించి ఆలోచిస్తూ ఆ మాట వినిపించుకోదు. దూర్వాస మహర్షికి కోపం వచ్చి శకుంతల ను చూసి నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తూ నన్ను పట్టించుకోలేదో అతను నిన్ను మరచిపోవుగాక అని శపిస్తారు. ఇది గమనించిన శకుంతల స్నేహితులు మహర్షి కాళ్ళ మీద పడి నమస్కరించి స్వామీ శకుంతల ను క్షమించమని వేడుకుంటారు. అప్పుడు మహర్షి నేను ఇచ్చిన శాపానికి తిరుగులేదు. కాని దుష్యంతుడు తన జ్ఙాపకార్ధంగా ఇచ్చిన వస్తువును చూస్తే తనకు అంతా గుర్తుకువస్తుంది. అని శాపంలో మార్పుచేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ స్నేహితులు దూర్వాసుడు వచ్చిన సంగతి, తనకి శాపం ఇచ్చిన సంగతి శకుంతలకు చెప్పరు. తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చిన కణ్వమహర్షి తన జ్ఙానదృష్ఠితో జరిగినదంతా గ్రహిస్తారు. శకుంతల భాద పడకు నీవు చేసుకున్న గాంధర్వ వివాహం శాస్త్రసమ్మతమే నీవు వెంటనే వెళ్ళి నీ భర్తను కలుసుకో అని చెప్పి పంపిస్తారు. ఆశ్రమం నుంచి బయలుదేరిన శకుంతల నది లో ప్రయాణం చేస్తుండంగా ప్రవాహంలో తన చేయిపెట్టి ఆడుకుంటున్నప్పుడు వేలికి ఉన్న ఉంగరం జారి నదిలో పడిపోతుంది. శకుంతల రాజ్యానికి చేరుకుని సభలో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళి నిలబడగానే దుష్యంతుడు ఎవరమ్మా నీవు ఎక్కడనుంచి వచ్చావు అని అనగానే శకుంతల ఆశ్చర్యంగా చూసి నేను నీ భార్య శకుంతలను మీరు కణ్వమహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు నన్ను గాధర్వవివాహం చేసుకున్నారు అని జరిగినదంతా వివరించగా దూర్వాస మహర్షి శాపం కారణంగా రాజుకి ఏమి గుర్తు ఉండకపోవడం వల్ల దుష్యంతుడు నేను ఇంతవరకు నిన్ను చూసింది ఎరుగను నీవు నా భార్యవా అని రాజు అనగా శకుంతల నిశ్చేష్ఠురాలయింది. మహారాజా నన్ను సరిగా చూడండి. నన్ను పెళ్ళి చేసుకుని త్వరగా వచ్చి తీసుకువెళతానని చెప్పింది మరచిపోయారా అలా అయితే ఈ ఉంగరాన్ని కూడా మీరు మరచిపోయారా అని వేలికి ఉన్న ఉంగరాన్ని చూపించేసరికి ఉంగరం లేకపోవటం వల్ల ఆమెకు ఏమి చేయాలో తోచక నిలబడిపోతుంది. ఇదో నాటకం లాగా ఉంది అని మహారాజు కోపంతో ఆమెను వెళ్ళగొడతాడు. ఆమె చాలా భాదపడి గట్టిగా ఏడుస్తూ మూర్ఛపోయింది. అప్పడు దేవలోకం నుండి ఆమె కన్నతల్లి అయిన మేనక దిగివచ్చి ఆమెను ఎత్తుకు వెళ్ళి మరీచి మహర్షి ఆశ్రమంలో విడిచిపెట్టింది. ఇక్కడ దుష్యంతుని దగ్గరకు ఒక రాజభటుడు వచ్చి ఆయనకు ఒక ఉంగరం యిచ్చి దీనిని చేప కడుపు నుండి తీసినట్లు ఒక జాలరి చెపుతున్నాడు అని చెప్తాడు. ఆ ఉంగరాన్ని చూడగానే రాజుకు అంతా గుర్తుకువచ్చి శకుంతలకు అన్యాయం చేసానని అనుకుని భాదపడతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకనాడు దుష్యంతుడు ఇంద్రుని కోరిక మేరకు దేవలోకం వెళ్ళి వస్తుండగా రధసారధి రధాన్ని మరీచి మహర్షి ఆశ్రమం దగ్గర రధాన్ని ఆపుతున్నప్పుడు అక్కడ ఒక బాలుడు సింహం పిల్ల నోటిని చీలుస్తూ ఉండటం చూసాడు. ఋషికుమారా సింహం పిల్లను రెచ్చగొడుతున్నావే జాగ్రత్త అని ఆ పిల్లవానితో రాజు అంటాడు. నేను ఋషికుమారున్ని కాదు మహారాజు అయిన దుష్యంతుని కుమారున్ని అని ఆ బాలుడు సమాధానం చెప్తాడు. ఆహా ఈ బాలుడు నా కుమారుడే అన్నమాట అని బాలుని దగ్గరకు వెళ్ళబోతుంటే అక్కడకు శకుంతల వస్తుంది. శకుంతల ను చూసిన దుష్యంతుడు నన్ను క్షమించు అని అంటుండగా శకుంతల ఇదంతా దూర్వాస మహర్షి శాపం వల్లనే జరిగింది ఇందులో మీ తప్పులేదు అని వీడే మీ కుమారుడు భరతుడు అని తన బిడ్డను రాజుకు అప్పగిస్తుంది. ఆ విధంగా దుష్యంతుడు శకుంతలు దగ్గరవుతారు. కొంతకాలం తరువాత దుష్యంతుడు భరతునికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగిస్తాడు. భరతుని కీర్తి ప్రపంచమంతా వ్యాపించడంతో మనదేశానికి భరత ఖండం అనే పేరు వచ్చింది.