|
వాలి రావణున్ని సముద్రంలో ముంచుట |
రుక్షుడు అనే ఒక వానరుడు ఉండేవాడు. అతనికి విరజుని యొక్క కూతురు విరజ ను ఇచ్చి పెండ్లిచేసెను. విరజను జూచి ఇంద్రుడు మోహించి ఆ విషయం ఆమెకు చెప్పగా ఆమె అంగీకరించెను. వారి ఇరువురికి మహాబలశాలి ఐన వాలి జన్మించెను. ఆ తరువాత సూర్యుడు విరజను కామించగా ఆమె సూర్యుని పై మనసుపడెను. వారిరువురికి మహాతేజశాలి అయిన సుగ్రీవుడు జన్మించెను. రుక్షుడు తనకు, ఇంద్రసూర్యుల ద్వార కలిగిన ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసి, పెద్ద వాడైన వాలికి కిష్కిందను రాజధాని కి పట్టాభిశక్తున్ని చేసాడు. సుగ్రీవుని సహాయంతో వాలి తన రాజ్యాన్ని, వానరులను పాలించెను. వాలికి, సుషేణుని కూతురు అయిన తారను, సుగ్రీవునికి పనసుని కూతురైన రుమ ను ఇచ్చి వివాహం చేసెను. ఒక నాడు వాలి సూర్యనమస్కారం చేసుకొనుటకు సముద్రమునకు వెళ్ళగా ఆ సమయమున రాక్షసరాజు అయిన రావణుడు వాలి మీదకు యుద్ధం చేయడానికివచ్చెను. రావణుడు వాలి వెనుక నుండి తాకుటకు ప్రయత్నించగా వాలి గమనించి రావణున్ని తన తోక తో గట్టిగా పట్టుకుని సముద్రం లో ముంచి విసిరివేసెను. అలా అన్ని సముద్రములలో విసిరి నేలమీద కొట్టి దూరంగా పడవేసెను. దానికి రావణుడు భయభ్రాంతుడై వాలి కాళ్ల మీద పడి నీతో మైత్రి చేసెదనని శరణువేడెను. అప్పుడు వాలి కనికరించి సరే అని తన ఇంటికి తీసుకుని వెళ్లి ఇద్దరు మిత్రులు గా ఉన్నారు. వాలి రావణునికి అభయమిచ్చి మనిద్దరమూ ఇప్పుడు మిత్రులము కనుక నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను పిలువమని చెప్పాడు. ఆ విధంగా రావణుడు, వాలి మిత్రులైనారు కనుక రాముడు ముందుగా వాలిని చెట్టు చాటుగా చంపి తరువాత సుగ్రీవుని సహాయంతో రావణాసురున్ని చంపాడు. లేకపోతే రామ రావణ యుద్ధం లో రావణుడు వాలి సహాయం తీసుకునే వాడు. ఈ కథ బ్రహ్మండ పురాణంలో ఉంది.