భీముడు |
మరుసటి రోజు ఎప్పటిలాగే భీముడు ఆలస్యంగా లేచి వచ్చేసరికి అందరూ భాదగా కూర్చొని ఉన్నారు, ఎందుకు అందరూ అలా ఉన్నారని భీముడు ప్రశ్నించేసరికి ధర్మరాజు " కృష్ణున్ని విందుకు పిలవటానికి వెళితే అయన రావటానికి అంగీకరించటం లేదు." అని అంటాడు. "ఓ ఇంతేనా ఇదిగో నేను ఇప్పుడే వెళ్లి కృష్ణున్ని పిలిచి నా వెంట తీసుకుని వస్తాను" అని అనగానే అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. అందులో అర్జునుడు " ఏమిటి నేను పిలిస్తేనే రాని కృష్ణుడు నువ్వు పిలవగానే వస్తాడా?" అని వేళాకోలంగా నవ్వుతాడు. భీముడు దానిని పట్టించు కోకుండా " పంచాలి! నీవు విందు తయారుచేయు! నీ అన్నయ్యకు బంగారు పళ్ళెములో విందు ఏర్పాటుచేయు, కృష్ణున్ని తీసుకుని వస్తాను" అని భీముడు కృష్ణున్ని తీసుకురావటానికి వెళుతుంటే అందరూ నవ్వుతూ ఉన్నారు. భీముడు ఎవరు లేని ప్రదేశమునకు వెళ్లి తన గదను ఆకాశం వైపు విసిరి " కృష్ణా! నీవు తక్షణమే వస్తావా?రావా? రాకపోతే ఈ గద నా తలపై పడుగాక, నా ప్రాణములు పోవు గాక" అని గట్టిగా అరిచాడు. శ్రీకృష్ణ భగవానుడు భక్తసులభుడు కదా భీముడు అలా అరిచే సరికి వెంటనే అక్కడకు ప్రత్యక్షం అయి ఆ గద భీముని పై పడకుండా పట్టుకున్నాడు. భీమసేనుని సంతోషంగా కౌగలించుకుని ఇద్దరూ కలిసి అరణ్యం లో ఉన్న వారి ఇంటికి వచ్చేసరికి "అందరూ స్వామి కృష్ణ రావయ్య రా" అని ఎంతో సంతోషంగా కృష్ణున్ని ఆహ్వానించారు. అర్జునుడు పరాభవంతో తలవంచుకుని ఉన్నాడు. అతని అహంకారం నశించింది. " భీముని నిజమైన భక్తి వల్లనే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు. అతను అందరిముందూ నేను గొప్ప భక్తుడనని అహంకారంతో ప్రవర్తించడు అందువల్లే శ్రీకృష్ణుడు తన భక్తి కి దాసుడై తన కోరిక తీర్చాడు. అలాంటి నిజమైన భక్తియే భగవంతునికి ప్రియము." అని అందరూ అనుకున్నారు.