పాండవుల సూత్రధారి

      
Srikrishna with Dharmaraja and Arjuna
శ్రీకృష్ణుని ధర్మబోధ
మహాభారత యుద్ధం జరుగుతున్న సమయంలో పదిహేడవ రోజు సాయంత్రం సమయం అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునికి రధ సారధి గా ఉండి యుద్ధం లో రధాన్ని నడుపుతున్నాడు. శ్రీకృష్ణుడు రధాన్ని కర్ణుని వైపు తీసుకుని వెళ్లి అర్జునునితో "అర్జునా! ఈ రోజు నువ్వు కర్ణుణ్ణి వధించాలి. గుర్తున్నదా!" అని అర్జునునితో అన్నాడు. అప్పుడు అర్జునుడు " ఆ జ్ఞాపకమున్నది కృష్ణా కర్ణుణ్ణి యుద్దంలో సంధించడానికి ఎంతోకాలం నుండి వేచియున్నాను. అతనిని చంపటానికి నా గాండీవం ఉట్టిపడుతున్నది. ఎక్కడ? ఆ కర్ణుడు ఎక్కడా? " అని అర్జునుడు ఆవేశం తో కర్ణుణ్ణి వదించడానికి ఉత్సాహం తో ఉన్నాడు. "అదుగో అర్జునా కర్ణుడు నీ బాణం ను తీసి కర్ణుని పై సంధించు" అని కృష్ణుడు కర్ణుణ్ణి చూపించాడు. దానికి అర్జునుడు చూసి " కృష్ణా! ఇదేమి వేళాకోలం, అతడు మా అన్నయ్య ధర్మరాజు కదా" అని ఆశ్చర్యంగా శ్రీకృష్ణునితో అన్నాడు. " పార్థా! నువ్వు పొరపాటు పడుతున్నావు, కర్ణునితో యుద్దము చేసి ఓడిపోయిన నీ అన్నయ్య శరీరమంతా గాయములు తగిలి డేరా లో పడుకుని వుండడం నేనే స్వయంగా చూశాను. నీ దృష్టి దోషం ఉంది సరిగ్గా చూడు." అని శ్రీకృష్ణుడు అర్జునితో అన్నాడు. కృష్ణుని మాటలు అర్జునుడు నమ్మలేదు. అందువల్ల అర్జున్ని తనవెంట తీసుకుని కృష్ణుడు ధర్మరాజు ఉండే దగ్గరకి తీసుకుని వెళ్ళి ధర్మరాజుని చూపించి  " అర్జునా నువ్వు నా మాటలు నమ్మలేదు, అదుగో మీ అన్నయ్య అవస్థను చూడు" అని చూపించాడు. ధర్మరాజు యుద్ధం లో ఓడిన ఆయాసంతో మంచం పై పడుకుని ఎంతో విచారంతో ఉండగా అర్జున్ని చూసిన ధర్మరాజు " నాకు తెలుసు! నా తమ్ముడు విజయుడు, కర్ణుణ్ణి చంపియే వచ్చియుంటాడని, కర్ణుని వధించావా అర్జునా" అని ఆనందంతో అర్జునుడ్ని పట్టుకున్నాడు. "లేదు అన్నయ్యా! నేను రణరంగానికి ఇంకా వెళ్ళలేదు. ముందు, మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను" అని అర్జునుడు ధర్మరాజు తో అన్నాడు. కర్ణుని చేతిలో ఓడిపోయి వచ్చిన ధర్మరాజు కోపంతో "ఎందుకు? నేను ఇంకా ఉన్నానా, పోయానా అని చూడడానికి వచ్చావా? కర్ణున్ని హతమారుస్తానని ఎంతకాలం గానో డంబములు పలుకుతున్నావే! కర్ణుని హతమర్చని నీవు ఎందుకు చేతిలో గాంఢీవం ధరించియున్నావు? " అని ధర్మరాజు కోపంతో అనగానే అర్జునుడు తన ఒర నుండి కత్తిని తీసి ధర్మరాజు వైపు ముందుకు దూకాడు. అంతలోనే కృష్ణుడు " అర్జునా! ఇది ఏమి నువ్వు చేయబోయేది? నీ ప్రాణములతో సమానమైన అన్నయ్యను చంపడానికి చూస్తున్నావా?" అనగానే అర్జునుడు " కృష్ణా నా అన్నయ్య నాకు దైవముతో సమానము. కానీ నా గాంఢీవమును దూషించిన వారిని చంపుతానని నేను ప్రతిజ్ఞ చేసియున్నాను. అన్నయ్య కంటే సత్యపరిపాలన ముఖ్యము కదా. ఇప్పుడు అన్నయ్యను చంపకుండా వదిలిపెడితే నేను మాట తప్పిన వాడిని అవుతాను. ఇప్పుడు ఏమి చేయాలో మీరే సెలవివ్వండి" అని కృష్ణున్ని అడిగాడు.
             దానికి శ్రీకృష్ణుడు "అర్జునా నీ గాంఢీవమును దూషించిన ధర్మరాజుని కదా నీవు హతమర్చాలి. గౌరవనీయులైన పెద్దలను మర్యాద లేకుండా 'నీవు, రా, పో' అని ఏకవచనం లో సంభోదిస్తే చాలు. అది వారిని చంపుటతో సమానము. అందువల్ల నీవు ఇప్పుడు వెళ్లి నీ అన్నను ఏకవచనం లో సంబోదించుము. అందువల్ల అతడు అనుభవించే చిత్రవధ అతనిని చంపినట్లు అవుతుంది. నీ శపథమూ నెరవేరుతుంది." అనగా కృష్ణుడు చెప్పినట్లే అర్జునుడు ధర్మరాజుతో ఏకవచనం తో సంభోదిస్తూ, "అన్నయ్యా! నీవు ఏ యుద్దమునకు వెళ్లియున్నావు? నీకేమి సామర్థ్యమున్నది, కర్ణుని చేతిలో ఓటమిపాలై వచ్చిన నువ్వు నన్ను, నా గాంఢీవమును దూషించినంతటి వాడివా" అని ధర్మరాజు ను ఏకవచనం లో అని వెంటనే అర్జునుడు ఆత్మహత్య చేసుకోవటానికి తన కత్తిని తీసుకుని పోడుచుకోవటానికి ప్రయత్నించగా శ్రీకృష్ణుడు ఆపి, " ఎంతటి నీచమైన కార్యమునకు సాహసించావు, ఆత్మహత్య మహాపాపం" అని అనగా అర్జునుడు " అన్నయ్య ధర్మస్వరూపుడు. దైవసమానుడు. అట్టివారిని ఏకవచనంతో పిలిచినందు కంటే ఆత్మహత్య పాప కార్యమా, ఆయనను అలా దూషించిన నేను ఇక ప్రాణాలతో ఉండరాదు. కృష్ణా దయచేసి నన్ను ఆపకు" అని అర్జునుడు తను చేసిన తప్పుకు భాదపడుతున్నాడు. శ్రీకృష్ణుడు "అర్జునా శాంతించు. నా మాట విను. నీ అన్నయ్యను అనునయించిన మాటలే నీకు కుడా అన్వయిస్తాయి. తన్ను తాను పోగుడుకుంటే ఆత్మహత్య చేసుకున్నట్లే, అందుకే నిన్ను నీవు కొంత పోగుడుకో అర్జునా అది నీ ఆత్మహత్యకు సమానమవుతుంది.
                 కృష్ణుడు అలా చెప్పేసరికి అర్జునుడు " నేను మహావీరుడను. ప్రపంచమును, భూమండలమును జయించిన గాంఢీవిని, పాశుపతాశ్త్రము పొందినవాడను. దేవరాజ్య పట్టభిషిక్తుడను." అని అర్జునుడు తనని తానే పొగుడుకున్నాడు. వెంటనే అర్జునుడు ధర్మరాజు పాదాలపై పడి క్షమాభిక్ష వేడుకున్నాడు. "ధర్మరాజా అర్జునుడు విజయుడై రమ్మని ఆశీర్వదించి పంపించు" అని కృష్ణుడు ధర్మరాజు తో అనగా " కిరీటీ విజయీభవ యుద్దాన్ని జయించి మహావీరుడవై రా నాయనా" అని ధర్మరాజు అర్జున్ని ఆశీర్వదించి "మాధవా! వాసుదేవా! కేశవా! దారితప్పిపోతున్న కురుక్షేత్ర యుద్దాన్ని విజయోన్ముఖంగా చేసిన సుత్రదారివి కదా! నాలోనుండి నీవు అందజేస్తున్న ఆశీస్సులను నేనే అందచేసేదను. అని ధర్మరాజు తన మనస్సులో అనుకున్నాడు. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు పాండవుల తో ఉండి వారిని సదా కాపాడుకుంటూ వారి యోగ క్షేమాలు చూసుకుంటూ వారి విజయానికి ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా ఉండి వారిని రక్షించుకుంటూ ఉన్నారు.
కొత్తది పాతది