సదా సర్వకాలము నందు నారాయణ మంత్రమును ఉచ్చరిస్తూ ముల్లోకాలు తిరుగుతున్న నారదుడు ఒకనాడు కైలాసం లో ఉన్న విష్ణుమూర్తి దగ్గరకి వచ్చి " నారాయణా! నీ దివ్యనామము యొక్క గొప్పతనం ఏమిటో ఈ ప్రపంచమునకు తెలుపవలెను" అని నారదుడు సెలవిచ్చెను. అందుకు నారాయణుడు " అలానా! భులోకములోని ఏదేని అతి చిన్న జీవి వద్దకు వెళ్లి నా నామమును వినిపించి చూడు నారదా" అని విష్ణుమూర్తి చెప్పారు. అప్పుడు నారదుడు అలాగే చేస్తాను అని భూలోకానికి దిగివచ్చి కుప్పపెంతల మీద ఉన్న ఒక చిన్న పురుగును చూస్తూ "నారాయణ! నారాయణ!నారాయణ!" అని మూడుసార్లు చెప్పేసరికి ఆ పురుగు చనిపోయింది. నారదుడు అయ్యో ఇదేమి వైపరీత్యం నారాయణ అని అనగానే చనిపోయిందేమి అని వైకుంఠమునకు వెళ్లి విష్ణుమూర్తి తో జరిగింది చెప్పేసరికి స్వామి వారు " అలాగా! అదిగో చూడు! ఒక సీతాకోకచిలుక ఒక పువ్వుపై వాలి ఉన్నది. దాని దగ్గరకు వెళ్లి నా నమమును చెప్పి చూడు!" అని అన్నారు. నారదుడు సీతాకోకచిలుక దగ్గరికి వెళ్లి నారాయణ నామమును చెప్పేసరికి ఆ సీతాకోకచిలుక కూడా వెంటనే చనిపోయింది. నారదుడు స్వామి దగ్గరకు వచ్చి సీతాకోకచిలుక కూడా చనిపోయింది అని చెప్పేసరికి విష్ణుమూర్తి " అదిగో కనిపిస్తున్న ఆ జింక పిల్ల వద్దకు వెళ్లి చెవిలో నా నామమును చెప్పిచూడు" అని అన్నారు. నారదుడు అలానే జింక పిల్ల దగ్గరికి వెళ్లి చెవిలో నారాయణ నామము చెప్పగానే ఆ జింక పిల్ల కూడా వెంటనే చనిపోయింది. నారదుడు మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి "స్వామి! పురుగు చచ్చింది, సీతాకోకచిలుక చచ్చింది, ఇప్పుడు జింక పిల్ల చచ్చింది, అసలు ఏం జరుగుతుంది" అని నారదుడు స్వామి వారిని కారణం అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి "ఇంత మాత్రానికే దిగులు పడకు నారద. అదిగో కనిపిస్తున్నది చూడు. ఒక ఆవుదూడ దాని దగ్గరకు వెళ్లి నా మంత్రమును చెప్పు" అని చెప్పగా నారదుడు "స్వామి మరీ నన్ను పరీక్షించకు. ఇదే నేను చివరిసారిగా నీ నామమును ఉచ్చరించేది" అని ఆ ఆవుదూడ దగ్గరకు వెళ్లి నారాయణ మంత్రమును చెప్పగా ఆ ఆవుదూడ కూడా అంబా అని విల విల తన్నుకుని చనిపోయింది. "నారాయణ సకల జీవరాసులను రక్షించే నీ పావన నామము ఇలా సంహారముతో ముగుస్తున్నదే దీని అంతర్యమేమి?" అని నారదుడు విష్ణుమూర్తి ని ప్రశ్నించాడు. " నారద అంతలో తొందర ఎందుకు? ఇప్పుడు కాశీ రాజు కు ఒక మగ శిశువు పుట్టాడు. అందువల్ల ఆ పట్టణమంతా కోలాహలంగా ఉంటుంది. నీవు ఆ జన్మించిన శిశువు దగ్గరకు వెళ్లి నా నామమును చెప్పు" అని అనగానే వెంటనే నారదుడు "స్వామి నేను ఏం పాపం చేశాను. ఇప్పటివరకు పురుగు, సీతాకోకచిలుక, జింకపిల్ల, ఆవుదూడ మాత్రమే చనిపోయాయి ఇప్పుడు మానవుణ్ణి చంపే కార్యాన్ని నాకు చెప్తున్నావా తండ్రి" అని విష్ణుమూర్తి ని వేడుకున్నాడు. "నారద కంగారుపడకు ఈ ఒక్కసారి నాకోసం ఆ పని చేసిపెట్టు నీకే తెలుస్తుంది" అని నారదునికి చెప్పాడు.
ఇంక చేసేదేం లేక నారదుడు కాశీరాజు అంతఃపురానికి వెళ్ళి కాశీరాజు ను కలుసుకున్నాడు. నారదుణ్ణి చూడగానే కాశీరాజు "స్వామి! ఈ రోజు ఇచ్చటికి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. నా కుమారుడు మంచి పేరు ప్రతిష్టలతో చిరంజీవిగా ఉండాలని మీరు ఆశీర్వదించండి" అని నారదుణ్ణి కోరుకున్నాడు. అలాగే అని చెప్పి నారదుడు ఆ రాజ కుమారుని దగ్గరకు వెళ్లి చెవిలో "నారాయణ నారాయణ" అని అనగానే ఆ బాలుడు లేచి "మహర్షి మీకు నా శతకోటి నమస్కారములు" అని మాట్లాడేసరికి ఇదేమి విడ్డురం అప్పుడే పుట్టిన బాలుడు మాట్లాడటమేమిటి అని నారదుడు ఆశ్చర్యపోయేసరికి ఆ బాలుడు "స్వామి మీకు ఇంకా నారాయణ మంత్ర మహిమ అర్థంకాలేదా" అని నారదుని తో అనగా నారదుడు "అర్థం కాలేదు నాయనా, నీవు వివరించగలవ" అని అడుగగా ఆ బాలుడు " మొదట నేను పురుగుగా ఉంటిని, అప్పుడు మీవల్ల వినిన నారాయణ పావన నామము నన్ను సీతాకోకచిలుకగా చేసింది. అలాగే జింక పిల్లగా మారి, తర్వాత ఆవుదూడ గా మారినది ఆ నారాయణ నామ మహిమ వల్లే తరువాత అత్యంత దుర్లభమయిన ఈ మానవ జన్మ లభించినది కూడా ఆ నారాయణ మంత్రం ప్రభావం వల్లనే స్వామి" అని ఆ బాలుడు వివరించగా "ఆహా ఏమి ఈ భాగ్యం." అని నారాయణ మంత్ర ప్రభావాన్ని తెలుసుకున్న నారదుడు ఎంతో సంతోషించి నారాయణ నారాయణ నారాయణ అంటూ త్రిలోక సంచారం చేసుకోవటానికి వెళ్ళిపోయాడు.