నారద మహర్షి జన్మ రహస్యం

narada
నారదమహర్షి
      నారద మహర్షి జన్మ వృత్తాంతం గురించి భాగవతం లో మరియు బ్రహ్మ వైవర్త్వ పురాణం లో ఉంది. అందులో ఉండే విషయాలను ఇందులో తెలియచేస్తున్నాను.
   బ్రహ్మ సృష్టి ఆరంభించినపుడు మొట్టమొదట మనువులను, మహర్షులను సృష్టించాడు. అందులో నారద మహర్షి ఒకరు. ఆ మహర్షులను పిలిచి సృష్టి నిర్మాణక్రమం లో భాగంగా స్త్రీలను వివాహం చేసుకోవలసినదిగా ఆదేశించాడు. దానికి నారద మహర్షి బ్రహ్మ కోర్కెను తిరస్కరించాడు. నిత్య బ్రహ్మచారిగా ఉంటానని అందువలన వివాహం చేసుకోనని నారద మహర్షి బ్రహ్మతో అనగా, బ్రహ్మ కోపంతో నారదుని మొదట గంధర్వుడుగా, తరువాత శుద్రుడుగా జన్మించి ఆ తరువాత దేహాన్ని విడిచిపెట్టి కల్పాంతం అయిపోయిన తరువాత మళ్ళీ తను సృష్టి చేసినప్పుడు మానస పుత్రునిగా జన్మించి హరిభక్తుడవు కమ్మని నారద మహర్షిని శపించెను. దానికి నారదుడు కూడా కోపించి "నారాయణుడి భక్తి ననుగ్రహించని వాడు ఏమి తండ్రి? ఏమి గురువు? నిరపరాధినైన నన్ను శపించినావు కావునా మూడులోకాలలో కూడా నీవు పూజలు పొందకుండెదవు గాక " అని తిరిగి బ్రహ్మను శపించెను. బ్రహ్మ శాపం వల్ల మొదటి జన్మలో గంధర్వుని గా ఉపబర్హుడు అను పేరుతో జన్మించి చిత్రరధుడు అనే ఒక గంధర్వుని కుమార్తెలైన ఎబైమందిని అతడు పెళ్ళిచేసుకొనెను. అలా చాలాకాలం పాటు గడిపెను.
                       ఒకనాడు బ్రహ్మలోకమున రంభ నాట్యం చేస్తుండగా ఆమె సౌందర్యమును చూసి ఉపబర్హుడు రేతఃపతనమయ్యెను. వెంటనే బ్రహ్మ కోపించి నీవు గాంధర్వ శరీరమును వదిలి శూద్ర జన్మమును ఎత్తుమని శపించెను. అంతట ఉపబర్హుడు తన యోగ శక్తిచే ప్రాణము వదిలిపెట్టాడు. తరువాత కళావతి అనే ఒక శూద్ర స్త్రీ కి జన్మించాడు. ఆమె వేదవేత్తలైన బ్రాహ్మణుని ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. నారదుడు చిన్ననాటి నుండి తల్లి తో కలిసి ఆ పనిచేసే వారి ఇంటికి వెళుతూ ఉంటాడు. ఆ బ్రాహ్మణులు ఏం పని చెప్తే ఆ పని చేసేవాడు. వారి దగ్గర ఉండి వారు తినిన అనంతరం వారు మిగిల్చిన అన్నాన్ని తినేవాడు. ఎండని, వానని లేకుండా ఎంతో జాగ్రత్తగా మారు మాట్లాడకుంటా వారి చెప్పిన పని చేసేవాడు. ఆ బ్రాహ్మణులు శ్రీకృష్ణుని కథలు చదువుతూ, హరి లీలలు వర్ణిస్తూ హరి నామ సంకీర్తనం చేస్తూ ఉంటె వాటిని వింటూ ఆనందించేవాడు. అలా వింటూ వింటూ భాగవంతుని సేవ చేయాలి అని ఆసక్తి కలిగింది. ఈ విధంగా రోజు భక్తి శ్రద్దలతో ఆ బ్రాహ్మణుల ఇంట పని చేస్తూఉండగా వారు దానికి సంతోషించి ఎంతో ప్రేమతో ఈశ్వర విజ్ఞానాన్ని ఆ మహాత్ములు నారదునికి ఉపదేశించారు. ఆ విధంగా ఉండగా ఒకనాడు నారదుని తల్లి పాము కాటుకి చనిపోయింది. నారదుడు భాదపదకుండా బంధం తెగిపోయింది అనుకుని, ఇకనుంచి తనకు హరినామస్మరణమే తోడు అనుకుని తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళిపోయాడు. అలా కొంతకాలం తపస్సు చేసిన తరువాత శ్రీహరి ప్రత్యక్షమై నాయందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో నన్ను అంటిపెట్టుకుని ఉంటుంది. నీవు ఈ దేహాన్ని వదిలిన తరువాత నా ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ సృష్టి ఆరంభించినపుడు నీవు ఆతనికి మానస పుత్రునిగా జన్మించి నా నామ స్మరణ చేస్తూ ఉంటావు. అని నారాయణుడు నారదునికి చెప్పగా సంతశించి తన దేహాన్ని వదిలిన తరువాత కల్పాంతం ముగిసిన తరువాత బ్రహ్మ మానస పుత్రునిగా జన్మించి "మహతి" అనే వీణను వాయిస్తూ విష్ణు కథలను గానం చేస్తూ లోక సంచారం చేస్తూ ఉంటాడు.
                         కలహభోజనుడు అను నామదేయం కలిగిన నారదుడు గురువుగా వచ్చి వేదాలు విభాగం చేసిన, పురాణాలు రాసినా మనస్సు తృప్తి లేని వ్యాసమహర్షి కి భాగవత కథలును రచించమని ఆదేశించాడు. అదేవిధంగా మహాకావ్యంగా ఈనాటికీ ప్రసిద్దికెక్కిన, మానవ జన్మలో సత్య, ధర్మములను ఎలా అనుష్టించాలో మనకు నేర్పిన  రామాయణమును కూడా మొట్ట మొదట వాల్మీకి మహర్షికి చెప్పి అంతటి మహాగ్రంధాలను మనకు అందించే విధంగా మహర్షులకు చెప్పిన నారద మహర్షికి మనం ఎల్లప్పుడూ వందనములను తెలుపుతూ ఉండాలి.



కొత్తది పాతది