శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఎందుకు ఉట్టి కొడతారు?


జైశ్రీకృష్ణ

వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్థనం |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ||

శ్రీకృష్ణుడు జగద్గురువు. అజ్ఞానం నుండి యావత్ జగత్తును జ్ఞాన మార్గంలోకి తీసుకుని వెళ్ళడానికి వచ్చిన పరిపూర్ణ అవతారం. భూమి మీద మానవుల చేష్టల వల్ల పాపం పెరిగిపోతుందని, భూదేవి వెళ్ళి విష్ణువు కి మొరపెట్టుకుంటుంది. ఎంత బరువునైనా మోస్తాను గానీ ఈ పాప భారాన్ని మొయలేకపోతున్నాను, నువ్వే నన్ను రక్షించమని చెప్పి వేడుకుంటుంది. అప్పుడు విష్ణువు భూదేవికి నేను వచ్చి భూమి మీద అవతరించి నిన్ను పాప భారం నుండి రక్షిస్తానని చెప్తాడు. ఆ విధంగా వచ్చిన అవతారమే కృష్ణావతారం. శ్రావణ మాసం, వర్షఋతువు, అష్టమి అర్ధరాత్రి 12.00 గం లకు చిమ్మచీకటిలో కారాగారం లో ఉన్న దేవకీ, వసుదేవులకు జన్మించాడు. చీకటి అంటే అజ్ఞానం, అందులో నుంచి వెలుగు అంటే జ్ఞాన మార్గం చూపించడానికి అలా జన్మించారు స్వామి. ఆ రోజునే మనం కృష్ణజన్మాష్టమి గా జరుపుకుంటున్నాం.  కృష్ణుడు గోకులం లో ఉన్న అందరి ఇళ్ళల్లోనికి వెళ్ళి పైన ఉన్న ఉట్టిని కొట్టి అందులో ఉన్న వెన్నను తీసుకుని తిని, అక్కడ ఉన్న అందరి పిల్లలకు పంచిపెడతాడు. కృష్ణుడు అలా చేసాడు కాబట్టే ఆ కృష్ణ లీలలను గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ అందరూ కృష్ణ జన్మాష్టమి రోజు ఉట్టి కొట్టడం చేస్తారు. అసలు కృష్ణుడు అలా చేయడానికి అసలు రహస్యం ఏంటి? అంటే వెన్న నిర్మలమైన మనస్సుకు సంకేతం. మట్టికుండ లాంటి మన శరీరం లో ఉన్న మనస్సును నిర్మలంగా ఉంచుకుంటే దానిని కృష్ణుడు తీసుకుని తనలో ఉంచుకుంటాడు. అంటే జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలవటం అన్నమాట. గోపికలు ఆ వెన్నను ఎవరికీ అందకుండా పైకి ఉట్టి కట్టి దాచుకునే వారు. దానిని కృష్ణుడు పగలగొట్టి తనూ తిని అందరికీ పంచి పెట్టేవాడు. అంటే మన దగ్గర ఉన్న వాటిని మనతో పాటు అందరికీ పంచి పెట్టాలి అని ఆ విధంగా చేసేవాడు. శ్రీకృష్ణుడు అందుకే జగద్గురువు అయ్యాడు. తను చేసే ప్రతీ లీలలోను మనకు తెలియని అంతరార్ధం ఉంటుంది. అది తెలుసుకుని మన మనస్సులను నిర్మలంగా ఉంచుకుంటే స్వామి తన దగ్గరకు తీసుకుంటాడు. తనతో మనల్ని కలుపుకుంటాడు. ఆడవాళ్ళని పకృతి తో పోలుస్తారు. పకృతి వెళ్ళి పురుషుని లో కలవడమే గోపికలు వెళ్ళి శ్రీకృష్ణున్ని చేరడం. గోవర్ధన పర్వతం పైకి ఎత్తి ఎన్ని విపత్తులు వచ్చినా ఎల్లప్పుడూ ప్రజలనే కాకుండా పశు, పక్ష్యాదులను కూడా రక్షించడం. ఏడు పగళ్ళు, ఏడు రాత్రులు ఒక్క చిటికిన వేలు పై అంత పెద్ద కొండను ఎత్తి పట్టుకుని గోవులను కూడా కాపాడాడు కాబట్టి గోవిందునిగా తను కష్ణపడి సంపాదించుకున్న పేరు. స్వామి మనతో ఉన్నారని నమ్మి గోవిందా అంటే చాలు మనల్ని ఎంత కష్టం నుండి అయినా రక్షిస్తాడు. విష్ణువు ఎనిమిదవ అవతారం అయిన శ్రీకృష్ణుడు, దేవకీ దేవి ఎనిమిదవ సంతానంగా శ్రావణమాసంలో, అందులో కృష్ణ పక్షం ఎనిమిదవ రోజు జన్మించాడు. ఆ రోజు అందరూ భక్తి, శ్రద్థలతో ఉపవాస దీక్షలు చేసి, ఉట్టి సంబరాలు చేసుకుని ఉత్సాహంగా, ఉత్సవాలు చేసుకుంటారు. జైశ్రీకృష్ణ.


కొత్తది పాతది