నందీశ్వరుని అసలు కథ

నందీశ్వరుడు
 శివాలయంలోకి వెళ్ళగానే ముందుగా నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచే శివుని దర్శనం చేసుకోవాలి అని శైవాగమంలో ఉంది. అలా ఎందుకు చేయాలి. నందీశ్వరుని అసలు కథ గురించి శివమహాపురాణంలో వర్ణించబడింది. పూర్వం శిలాదుడు అనే బ్రాహ్మణుడు ఇంద్రుని కోసం తపస్సు చేసాడు. ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యి వరం కోరుకొమ్మనగా అయోనిజుడు, మరణంలేని వాడు, పరమభక్తుడు అయినవాడు నాకు కొడుకుగా ఇవ్వు అని అడుగుతాడు. దానికి ఇంద్రుడు నేనే చిరంజీవిగా ఉండను, నాకు ఆయుర్ధాయం తీరిపోతే నేను వెళ్ళిపోతాను, నేను ఎలా మరణంలేని వాడిని ఎలా ఇవ్వగలను అది చెయ్యవలసినది ఒక్క పరమశివుడు మాత్రమే నువ్వు శివుని గురించి తపస్సు చేసి నీకోరికను తీర్చుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు శిలాదుడు శివుని కోసం ఘోరమైన తపస్సు చేస్తే, శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, దానికి శిలాదుడు నీలా ఉండే కొడుకును ప్రసాదించమని అడుగుతాడు. నాలాంటి కొడుకు అంటే నేనే రావాలి, నీ భక్తికి మెచ్చాను నేనే నీ కొడుకు గా పుడతాను అని చెప్పి శివుడు వెళ్ళిపోతాడు. కొంతకాలం గడిచిన తరువాత శిలాదుడు యజ్ఞం చేయుటకు భూమిని దున్నుతుండగా అందులోంటి కిరీటంతో, నాలుగు చేతులతో, తెల్లటి భస్మం పుసుకున్న ఒక బాలుడు వస్తాడు. పరమశివుని అంశ చేత బాలశివుడా అన్నట్టుగా ఆవిర్భవిస్తాడు. ఆ బాలున్ని చూసి శిలాదుడు పొంగిపోతాడు. ఆ ఆనందంతో నందీ అని పేరు పెడతాడు. 

శిలాదుడు శివున్ని నీలాంటి కొడుకు కావాలి అని అడిగినప్పుడు శివుడు ధర్మస్వరూపంగా ఉన్న ఆదివృషభున్ని పిలిచి నా అంశతో, అయోనిజునిగా శిలాదునికి కొడుకుగా జన్నించు అని శాశనం చేసాడు. శివునికి తనకు భేదం లేదని చెప్పడానికి ముందుగా బాలశివునిగా దర్శనం ఇచ్చాడు. కొంతకాలం గడచిన తరువాత దేవతలు వచ్చి నందికి అల్పాయుర్ధాయం ఉంది. అతను జ్ఞానంతో చిరంజీవిగానీ, శరీరంతో కాదు తనకు ఆయువు తీరిపోతుంది అని దేవతలు చెప్పగానే. శిలాదుడు బాధపడతాడు. తండ్రి బాధను చూసిన నంది, భాదపడకండి తండ్రి నేను శివుని కోసం తపస్సు చేసి చిరాయువుని పొందుతానని చెప్పి, మార్కండేయునిలా తపస్సుచేసి శివుని మెప్పు పొందుతాడు. శివుడు ప్రతక్షం అవుతాడు. నంది తపస్సుకు ప్రీతి చెందిన పరమశివుడు. నందీ నీవు ఎప్పటికీ చిరంజీవివే నీ భక్తిని పరీక్షించడం కోసం ఇలా చేసాను అని చెప్పి శివుని మెడలో ఉన్న బంగారు పద్మములతో ఉన్న హారాన్ని నంది మెడలో వెయ్యగానే శివునిలా తేజస్సు వచ్చి, మూడవ కన్ను, ఐదు ముఖములు, పది భజములతో పరమశివుని ముందు నిలబడి ఉంటాడు. పార్వతీదేవి తల్లిలా నందిని అక్కున చేర్చుకుంటుంది. శివుడు తన జటాజూటంలో నుంచి నీటిని తీసి నంది మీద జల్లుతాడు. ఆ నీళ్ళు నందీశ్వరుని నుండి జాలువారి త్రిశ్రోట, జటోధక, స్వర్ణోదక, జంబూనది, వృషధ్వని అనే ఐదు నదులు ఏర్వడతాయి. ఆ నదుల మధ్యలో ఒక శివలింగాన్ని ప్రతిష్టిస్తాడు నందీశ్వరుడు. ఆ ఐదు నదులలో స్నానం చేసి ఆ శివలింగాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వారికి మోక్షం కలుగుతుందని శాస్త్ర వచనం. పార్వతీ దేవి నంది కి ప్రమధ గణాలకు అధిపతిగా చేయమని శివునికి అభ్యర్థిస్తుంది. అప్పుడు శివుడు పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రమధగణాలకు అధిపతిగా అభిషిక్తున్ని చేస్తాడు. 

అలా అభిషిక్తం చేసిన నందికి మరుత్తుల కుమార్తె అయిన సయశ తో వివాహం చేస్తారు. పిమ్మట శివుడు నందీశ్వరునితో నీవల్ల నీ తండ్రి తరించాలి, నీ తండ్రిని, తాతను కూడా సమున్నతమైన స్థాయిలోకి తీసుకువస్తాను అని శివుడు చెప్తాడు. వారిని కూడా నన్ను తరించుకునేటట్టు చేస్తాను అని వరం ఇస్తాడు. అలా శిలాదుడు కూడా ప్రమధగణాలలో చేరిపోయాడు. ప్రమధగణాలకు అధిపతి శిలాదుని కొడుకు అయిన నంది. అది వాళ్ళ గొప్పతనం. అలాగే నందికి ఇంకొక వరం నేను ఎక్కడ ఉంటే అక్కడ నంది ఉండేటట్టు, శివాలయం లో నా ఎదురుగా నువ్వు ఉండాలని వరం ఇస్తాడు. శివాలయం లోకి వెళ్ళినప్పుడు శివున్ని నేరుగా దర్శనం చేయకుండా, నంది కొమ్ములమీద బొటనవేలు, చూపుడువేలు పెట్టి కుడి చేతిని నంది యొక్క వెనుక భాగాన్ని పట్టుకుని చూడాలే తప్పా మాములుగా చూడకూడదు అని శాస్త్రం చెప్తుంది. అంతే కాకుండా శివునికి, నందికి మధ్యలో అస్సలు నడవకూడదు. నందికేశ్వరుని చరిత్రను చదివినా, విన్నా, తలుచుకుని తలొగ్గి నమస్కరించినా వారికి భగవంతుడు ఇహమునందు సమస్త సుఖములను ఇచ్చి, అంతమునందు తలుచుకుని పరవశించిపోయినా వారిని ఈశ్వరుడు తన ప్రమధగణములలో ఒకరిగా చేర్చుకుంటాడని అభయం ఇవ్వబడింది. 

నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక!
మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి!! అనే శ్లోకాన్ని చదువుతూ శివుని దర్శనం చేసుకుని నంది పక్కగా నిలబడి నందీశ్వరునిని వేడుకోవాలి.


కొత్తది పాతది